దొరగారి యాడ్స్ బేబీ యాడ్స్ ….

కేసీఆర్ ప్రకటనల విప్లవానికి అర్థమేంటి. తెలంగాణ ఉద్యమాన్ని సైతం శాంతియుతంగా నిర్వహించుకుని రాష్ట్ర సాధనలో మునిగి తేలిన కేసీఆర్..ప్రచారంలో మాత్రం ఎందుకంత జోరును ప్రదర్శిస్తున్నారు. యాడ్స్ తో వచ్చిన నిజమైన పబ్లిసిటీ ఎంత ? కోల్పోయిన ప్రజాధనం ఎంత ? ఇంతకీ ఎందుకంత ప్రచార పటాటోపం

పండగొస్తే యాడ్స్ తప్పదా ?

తెలంగాణకు పండగొచ్చింది. పత్రికలకు చానెళ్లకు పంట పండింది. మలిదశ తెలంగాణ ఉద్యమం సక్సెస్ కావడంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాకారమై కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. అంతవరకు బాగానే ఉన్నా…వృథా వ్యయం ఇప్పుడు పెద్ద గుదిబండగా మారే అవకాశం కనిపిస్తోంది. జూన్ 2 పర్వదినాన్ని పురస్కరించుకుని కేసీఆర్ సారూ పత్రికలకు ప్రకటనలు కుమ్మరించేశారు. పేజీల కొద్దీ యాడ్స్ వదిలారు..

గొప్పదనం కనిపించాలంటే…

ఒక ప్రభుత్వం గొప్పదనం పత్రికల్లోనే కనిపించాలా… చేసిన పనులతో లబ్ధి పొందిన జనం ప్రశంసించరా. ప్రభుత్వ పనితీరుకు యాడ్సే ప్రామాణికమా అంటే అవునని చెప్పాలేం. అలాగని కాదని కూడా చెప్పలేం. కాకపోతే ప్రజా ధనం మాత్రం వృథా అవుతుందన్నది నిజం. యాడ్స్ చూడటం వల్ల జనానికి ఒరిగేదేమిటి. వాటికి ప్రజాధనం ఎందుకు ఖర్చు చేయాలన్నది కూడా పెద్ద ప్రశ్న. అసలు జనం యాడ్స్ చూస్తారా. గవర్నమెంట్ యాడ్స్ అనగానే సెల్ఫ్ డబ్బా, బాకా ఊదుకోవడమే అన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉన్నదే కదా. కేవలం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత ఇమేజ్ కోసం రంగు రంగుల ఫుల్ పేజ్ యాడ్స్ వేయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న తప్పకుండా వేసుకోవాల్సిందే కదా.. ఒకప్పుడు సీఎం ఇమేజ్ కోసం వందల కోట్ల రూపాయల యాడ్స్ వేసిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తాయి. అయినా సరే ఈ రోజు మళ్లీ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. జనం చూడకపోయినా, చదవకపోయినా ఇమేజ్ బిల్డప్ అనివార్యమవుతోంది.

అడిగినోడికి అడిగినంత…

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవం జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతే ప్రకటనలు కుమ్మేసింది. పెద్ద పత్రికల నుంచి చిన్న పత్రికల వరకు పేజీలకు పేజీల యాడ్స్ వచ్చేశాయి. ఈనాడు తెలుగు పత్రికలో 12 ఫుల్ పేజీలు యాడ్స్ తో నింపేశారు. తెలంగాణలో జనం ఎక్కువగా చదివే రెండు ప్రధాన ఆంగ్ల పత్రికల్లో తలా ఆరు పేజీల యాడ్స్ ఇచ్చేశారు.ఖచితంగా చెప్పాలంటే అవి ది హందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇక నమస్తే తెలంగాణ, సాక్షి లాంటి ఇక సొంత పత్రికలకు యాడ్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పత్రికలు ప్రభుత్వానికి బాకా ఊదటం లేదన్న బాధ కేసీఆర్ కు ఉన్నట్లుంది. ప్రభుత్వ పథకాల ప్రచారం జనంలోకి వెళ్లడం లేదన్న అనుమానం కలుగుతున్నట్లుంది. దానితో డప్పు కొట్టుకునేందుకు ఫుల్ పేజీ యాడ్స్ వైపు పభుత్వం మొగ్గుచూపాయి. రాష్ట్ర అవతరణను సెలబ్రేట్ చేసుకునేందుకు అదొక్కటే అవకాశం అన్న ఫీలింగ్ వచ్చినట్లుంది. ఇదివరకటిలా డబ్బులిచ్చి రాయించుకునే అడ్వర్టోరియల్ కూడా పనిచేయడం లేదని కేసీఆర్ కు అనుమానం వచ్చిందేమో. దానితో ఏ పత్రిక తెరిచినా యాడ్స్ కనిపించాలని ఆయన డిసైడైనట్లున్నారు. అందుకే సూర్య, ప్రజాపక్షం, ఆంధ్రప్రభ, నవ తెలంగాణ , మన తెలంగాణ లాంటి పత్రికలకు కూడా యాడ్స్ వచ్చేశాయి. కాకపోతే ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించే ఆంధ్రజ్యోతి, వెలుగు లాంటి పత్రికలకు మాత్రం యాడ్స్ రాలేదు.

యాడ్స్ కు రూ. 50 కోట్ల ఖర్చు

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో జూన్ 2న ఒక్క రోజునే కనీసం రూ. 50 కోట్లు యాడ్స్ కోసం వినియోగిస్తున్నట్లు సమాచారం. అంతర్డాతీయ స్థాయిలో కేసీఆర్ ఖ్యాతిని పెంచాలన్న ఉద్దేశంతో పత్రికా ప్రకటనలిస్తున్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు…