మణిపూర్లో రిజర్వేషన్లు తెచ్చిన ఘర్షణలు ఇంకా చల్లారలేదు. ఇప్పటి వరకు హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 80 దాటింది. పలు జిల్లాల్లో ఇంటర్నెట్ పై ఆంక్షలతో పాటు కర్ఫ్యూ విధించారు. 40 మంది సాయుధ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి మణిపూర్ రాష్ట్రంలో పర్యటించారు. ఆయన ప్రయత్నాలు ఫలించి సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి..
జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన కేంద్రం
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ సహా ప్రభుత్వ పెద్దలతో అమిత్ షా పలు దఫాల చర్చలు జరిపారు. గవర్నర్ , రాష్ట్ర భద్రతా సలహాదారుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చూరాచాంద్ పూర్ సందర్శించి అక్కడి మహిళా సంఘాల ప్రతినిధులను పలుకరించారు. సమస్యకు కారణాలను వారి వైపు నుంచి కూడా తెలుసుకున్నారు. కూకీలు ఎక్కువగా ఉండే మోరే, కాంక్పోక్పీ ప్రాంతాలను సందర్శించారు. కోర్టు ఇచ్చిన తొందరపాటు తీర్పుతో హింస చెలరేగిందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రయోజనాలకు కాపాడే నిర్ణయాలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. జరిగిన హింసాకాండ, అందుకు కారణాలపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి చేత జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఆరు కేసులను సీబీఐకి అప్పగిస్తామని కూడా తెలిపారు.
శాంతి సంఘం ఏర్పాటు
గవర్నర్ నేతృత్వంలో శాంతి సంఘం ఏర్పాటుకు అమిత్ షా ప్రతిపాదించారు. అందులో మేథావులు, బాధిత వర్గాల ప్రతినిధులు, పౌర సమాజంలో ప్రముఖులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. శాంతి భద్రతల స్తాపనలో పోలీసు శాఖ తీరుపై వస్తున్న అనుమానాలకు కూడా ముగింపు పలికేందుకు అమిత్ షా చర్యలు తీసుకున్నారు. డీజీపీ పీ. దౌంగేల్ స్థానంలో త్రిపుర కేడర్ అధికారి రాజీబ్ సింగ్ ను నియమించి విమర్శలకు అవకాశం లేకుండా చూసుకున్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వం న్యూట్రల్ గా ఉందని అన్ని వర్గాలు సంతృప్తి చెందాయి.
బయోమెట్రిక్ పద్ధతికి కేంద్రం మద్దతు
మణిపూర్లోకి అక్రమ వలసలు పెరిగినందునే ఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపణలను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బయోమెట్రిక్ గుర్తింపు విధానానికి మద్దతిస్తూ అదే సరైన నిర్ణయమని పేర్కొంది.కూకీల మెజార్టీ ప్రాంతాల్లో వైద్య సేవల పెంపుకు చేపడుతున్న చర్యలను అమిత్ షా పర్యవేక్షించారు. ఇందుకే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇద్దరు జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. మిలిటెంట్ల దగ్గర అక్రమ ఆయుధాలున్నాయని సమాచారం అందడంతో 24 గంటల్లో వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. ఆ ప్రక్రియను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని వెల్లడించారు. దానితో మణిపూర్ ఇప్పుడు శాశ్వత శాంతి దిశగా పయనిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది.