కవిత, కేజ్రీవాల్ గుట్టు రట్టు ఖాయం – శరత్ రెడ్డి అప్రూవర్‌ మారడంతో సంచలనాలు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులంతా జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. నిందితులు అప్రూవర్లుగా మారితే స్కాం జరగలేదని వాదించడానికి అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితి ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారికి చిక్కులు తెచ్చి పెట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా అప్రూవర్లుగా మారుతున్నారు. తాము ఎలా నేరం చేశామో చెబుతామని క్షమించేయాలని పిటిషన్లు వేస్తున్నారు. ఇలా అప్రూవర్లుగా మారిన వారిలో మొదట దినేష్ అరోరా ఉన్నారు. తర్వాత బుచ్చిబాబు , అరుణ్ రామచంద్ర పిళ్లై ఉన్నారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి కూడా తాను అప్రూవర్ అయ్యారు. నెలల తరబడి జైల్లో ఉన్న వీరు హఠాత్తుగా ఎందుకు అప్రూవర్లుగా మారుతున్నారు. దీంతో గుట్టు రట్టు కాబోతోంది.

కేజ్రీవాల్ , కవిత పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా దొరికిపోతారా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదట అప్రూవర్ గా మారింది దినేష్ అరోరా. దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు సన్నిహితుడు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాల్లో దినేష్ అరోరా కీలకపాత్ర పోషించారని సీబీఐ చెబుతోంది. ఆయన అప్రూవర్ గా సాక్ష్యాలు ఇచ్చారు. సిసోడియాను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ను ప్రశ్నించారు.

శరత్ రెడ్డి వాంగ్మూలంతో నిండా మునిగేది కవితేనా

బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారాడు. కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని చెప్పాడు. అంతకు ముందు అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయ్యారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌ నుంచి అరుణ్‌రామచంద్రపిళ్లై,బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. దీంతో కవిత వ్యవహారాలకు ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు.

లిక్కర్ కేసుతో రాజకీయాల్లో పెను మార్పులు

ఇప్పటికే సీబీఐ,ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు.అరుణ్‌ రామచంద్రపిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌,ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన షెల్ కంపెనీలు,బినామీల అకౌంట్స్‌ నుంచి జరిగిన హవాలా లెక్కలను ఈడీ ఒక్కోటిగా బయటపెండుతోంది. కవిత కొన్న భూముల వివరాలంటూ కోర్టుకు సమర్పిస్తున్న చార్జిషీట్లలో డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారు. సుకేష్ చంద్రశేఖర్ కూడా వివరాలు ఇస్తున్నారు. మొత్తంగా లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్, కవిత నిండా ఇరుక్కుపోయారని భావిస్తున్నారు. వారి అరెస్టులు ఎప్పుడైనా జరగవచ్చని అంచనా వేస్తున్నారు.