తెలుగుదేశం పార్టీ అంటే కోడెల.. కోడెల అంటే తెలుగుదేశం పార్టీ. పల్నాడు టైగర్ గా పేరు తెచ్చుకున్న ఆయన చివరికి ఆత్మహత్య ద్వారా ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుమారుడు శివరామ్ రాజకీయ ఆశలతో సత్తెనపల్లిలో తిరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కొత్తగా టీడీపీలో చేరిన కన్నా లక్ష్మినారాయణను ఇంచార్జ్ గా ప్రకటించారు. ఆయనే అభ్యర్థి అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోడెల వర్గీయులు మండిపడుతున్నారు. కోడెల శివరామ్ అనుచరులతో సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు.
అంబటి రాంబాబను ఓడించడానికి కన్నా కావాల్సిందేనా ?
కన్నా లక్ష్మినారాయణకు సత్తెనపల్లి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు ఇంచార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కన్నా లక్ష్మినారాయణ సత్తెనపల్లిపై దృష్టి పెట్టి టీడీపీలో చేరారు. ఆయన కోరిక మేరకు ఇంచార్జ్ గా నియమించారు. కోడెల శివప్రసాదరావు గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సత్తెనపల్లిలో కాపు సామాజికవర్గం నిర్ణయాత్మక శక్తిగా ఉంది. అందుకే రేపల్లెకు చెందిన అంబటి రాంబాబు సత్తెనపల్లిలో పాగా వేశారు. స్థానికేతరుడు కావడంతో ఎక్కువ మంది వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణకు సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి.
కోడెల ఫ్యామిలిని చంద్రబాబు వదిలేశారా ?
కన్నా లక్ష్మీనారాయణను తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్‌గా నియమిస్తారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. అయితే పెదకూరపాడులో కన్నా లక్ష్మీనారాయణ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉందని అంతా భావించారు.అయితే సత్తెనపల్లిలో రాజకీయం కీలకంగా మారటంతో సామాజిక వర్గాల సమీకరణాల్లో కన్నాను ఛాన్స్ ఇచ్చారు. అయితే తెలుగు దేశం పార్టీలో సత్తెనపల్లి కేంద్రంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కేంద్రంగా చేసుకొని రాజకీయం జరిగింది. ఇప్పటికి ఆయన కుమారుడికే సత్తెనపల్లి సీటు వస్తుందని అంతా భావించారు. అయితే ఆఖరి నిమిషంలో కన్నాను తెర మీదకు తీసుకువచ్చారు. ఇప్పటికే పలు సమావేశాల్లో తనకు సీటు ఇప్పించాలంటూ అధినేతను కోడెల శివరాం బహిరంగంగానే అడిగారు. చంద్రబాబు ముందే బలప్రదర్శన కూడా చేశారు. కోడెల శివప్రసాదరావు పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన కుటుంబానికి ఇచ్చే గౌరవంలో భాగంగా సత్తెనపల్లి సీటు ఇవ్వాలంటూ పార్టీలో చర్చ కూడా జరిగింది. ఇప్పుడు కోడెల ఫ్యామిలి మాటేంటి అనే చర్చ మొదలైంది.
కోడెల వర్గం కన్నా కోసం పని చేస్తుందా ?
కోడెల శివప్రసాద్‌కు చెందిన అనుచరులు, అభిమానులు నియోజకవర్గంలో ఉన్నారు. పార్టీలో వారంతా అంకిత భావంతో పని చేస్తున్నారు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణను తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్‌గా ప్రకటించిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చర్చనీయాశంగా మారింది. అయితే కోడెల ఇబ్బందులు పడింది కుమారుడి వల్లేనన్న ప్రచారం ఉంది. ఆయన తీరు వల్లే గత ఎన్నికల్లో కోడెల ఓడిపోయారన్న అభిప్రాయం ఉంది. దీంతో .. వేరే విధంగా కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ కోరుతున్నట్లుగా చెబుతున్నారు.