రెజ్లర్ల వివాదంలో రైతులు వర్సెస్ అయోధ్య సాధువులు

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కుస్తీ మహిళలు చేసిన ఆరోపణల ఇప్పుడు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలకు మద్దతు లభించడంతో వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. పైగా ప్రజాసేవలో బ్రిజ్ భూషణ్ అంకిత భావాన్ని కొందరు ప్రశంసిస్తున్నారు.

రెజర్లకు రైతు సంఘాల మద్దతు

లైగింక ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్ల డిమాండ్ నెరవేరకపోవడంతో వారు తమ మెడల్స్ ను గంగానదిలో నిమజ్జనం చేసేందుకు హరిద్వార్ వెళ్లారు. వారిని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) చీఫ్ నరేష్ టికాయత్ వారించారు. వారిని సమాధానపరిచి తమ పతకాలను రాష్ట్రపతికి అందించాలని సూచించారు. రెజ్లర్లకు మద్దతుగా బీకేయూ మహా పంచాయత్ నిర్వహిస్తోంది దేశ వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది. రేజ్లర్లు ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని, తమ బిడ్డలు లాంటి వారికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని టికాయత్ హెచ్చరించారు.

బ్రిజ్ భూషణ్ వైపు అయోధ్య సంతులు, పూజార్లు

రైతు సంఘాలు రంగంలోకి దిగడంతో రామ మందిర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన అయోధ్య సీర్స్ బ్రిజ్ భూషణ్ కు మద్దతు పలుకుతున్నారు. నిజానికి విద్యార్థి నేత స్థాయి నుంచి బ్రిజ్ భూషణ్ ఎంపీగా ఎదిగేందుకు అయోధ్య ఉద్యమమే ఉపయోగపడిందని చెప్పాలి. హనుమాన్ ఘడీ ఆలయ పూజారి దగ్గర రెజ్లింగ్ నేర్చుకున్న బ్రిజ్ భూషణ్ తర్వాతి కాలంలో జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడయ్యారు. అయోధ్యలోే ఈ నెల 5న బ్రిజ్ భూషణ్ నిర్వహిస్తున్న జన చేతన మహా ర్యాలీకి అయోధ్య సీర్స్ కూడా హాజరవుతున్నారు. విభేదాలను పక్కన పెట్టి అయోధ్యలో ఉన్న మఠాలన్నీ బ్రిజ్ భూషణ్ కు మద్దతిస్తున్నాయి. వీహెచ్పీ కార్యకర్తలంతా వ్యక్తిగతంగా ర్యాలీకి హాజరుతారని తెలుస్తోంది. పైగా పోక్సో చట్టం ముసుగులో అమాయకులను వేధిస్తున్నారని ఆ చట్టానికి తగిన సవరణలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీ పోలీసుల ట్వీట్ ..

బ్రిజ్‌ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్‌ చేయడం చర్చనీయాంశమైంది. ‘‘బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేసేందుకు ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు. రెజ్లర్ల ఆరోపణలను సమర్థించే అనుబంధ సాక్ష్యాలు దొరకలేదు. రెండు ఎఫ్‌ఐఆర్‌లలో పోక్సోకు సంబంధించిన కేసులో ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కేసులో నిందితుడు సాక్ష్యాధారాలను ప్రభావితం చేయలేదు. అందుకే బ్రిజ్‌భూషణ్‌ను ఇన్వెస్టిగేషన్‌ అధికారి అరెస్టు చేయలేదు. మరో 15 రోజుల్లో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడమో.. దర్యాప్తు వివరాలను ఒక నివేదిక రూపంలో న్యాయమూర్తికి సమర్పించడమో చేస్తాం’’ అంటూ బుధవారం ఢిల్లీ పోలీసులు ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. రెజ్లర్లు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీంతో ఢిల్లీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఆ ట్వీట్‌ను తొలగించి, మరో ట్వీట్‌ చేశారు. ‘‘రెజ్లర్ల ఆరోపణలకు సంబంధించి పోలీసులు కోర్టుకు తుది నివేదిక ఇస్తారంటూ కొన్ని సోషల్‌ మీడియా చానల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం. ఈ కేసు విచారణ దశలో ఉంది. దర్యాప్తు పూర్తయ్యాకే నివేదికను సమర్పిస్తాం’’ అంటూ ఆ ట్వీట్‌లో తెలిపారు. బ్రిజ్ భూషణ్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని ఏ విచారణకైనా సిద్ధమని మరో మారు కుండబద్దలు కొట్టారు. ‘‘నాపై వచ్చిన ఒక్క ఆరోపణ నిజమని తేలినా.. నేను ఉరి వేసుకుంటాను. మీ దగ్గర ఆధారాలుంటే.. కోర్టుకు సమర్పించండి. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధం’’ అంటూ ఆయన సవాల్‌ విసిరారు. దీనిపై రెజ్లర్ల సమాధానం ఏమిటో చూడాలి…