ప్రతి శుక్రవారం ఇంట్లో ఉప్పు తో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులుండవు

ఎంత ఆస్తి ఉందన్నది కాదు అప్పుల్లేకుండా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం
ఎంత సంపాదించాలం అన్నది కాదు ఎంత దాచాం అన్నదే అవసరం
కొన్నిసార్లు సంపాదన భారీగా ఉన్నా చేతిలో పైసా నిలవదు. కళ్లముందే అకౌంట్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుంటుంది. ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. అవన్నీ అవసరమైన ఖర్చులే అయితే ఏమీ చేయలేం కానీ కొన్నిసార్లు అనుకోని ఖర్చుల కారణంగా పర్స్ ఖాళీ అయిపోతుంటుంది. సంపాదించిన ఆనందం క్షణమైనా నిలవకపోగా నిరాశగా అనిపిస్తుంది. అయితే ప్రతి శుక్రవారం ఇంట్లో ఉప్పుతో దీపం వెలిగిస్తే మానసిక ప్రశాంతత కలగడంతో పాటూ సంపద నిలబడుతుందని చెబుతారు పండితులు.

ఉప్పుతో దీపం ఎలా!
ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ పెద్ద ప్రమిదలు రెండు తీసుకుని పసుపుకుంకుమ రాయాలి. బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపై ప్రమిదలు ఒకదాని పైన ఒకటి ఒకటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైనపసుపు కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిద దానిపై పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి దీపం వెలిగించాలి. పళ్ళు, పాలు, పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ దేవి, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రాలు చదువుకోవాలి. కనకధార స్త్రోత్రం చదివితే మంచిది.

దీపారాధన కొండెక్కాక ఆ ఉప్పు ఏం చేయాలి
శుక్రవారం దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి నీటిలో కలపి ఆ నీటిని ఇంటి బయట ఎవ్వరూ తొక్కని స్థలంలో పోయాలి. అవకాశం ఉంటే చెరువుల్లో, నదుల్లో కలపవచ్చు. ఏ అవకాశం లేకుంటే నీళ్లలో కలిపి షింక్ లో అయినా పోయొచ్చు.

అవే ప్రమిదలు మళ్లీ వాడుకోవచ్చు
వారం వారం ప్రమిదలు మార్చాల్సిన పనిలేకుండా అవే వినియోగించుకోవచ్చు. అయితే ప్రతి శుక్రవారం ఉప్పుపై దీపం వెలిగించిన తర్వాత శనివారం రోజు మాత్రం ఆ ఉప్పు తీసేయాలి. ఇలా 11 శుక్రవారాలు కానీ 16 వారాలు కానీ, 21 లేదా 41వారాలు కానీ అనుకుని దీపం వెలిగించాలి. ఈశాన్యమూలన పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. 41 శుక్రవారాలు ఇలా ఉప్పుతో దీపం పెట్టే వారికి శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు.

ఉపశమనమే కానీ పరిష్కారం కాదు
ఈ ఐశ్వర్య దీపం ఆర్థిక సమస్యల నుంచి కాస్తంత ఉపశమనమే కానీ పూర్తిస్థాయి పరిష్కారం కాదంటారు పండితులు. ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు ఆధారంగా వీటిని అనుసరించవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా దేవుడిపై నమ్మకం, భక్తి ప్రధానం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.