ప్రధానిగా నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనలో 40 కోట్ల మందికి దుర్భర పేదరికం నుంచి విముక్తి కలిగింది. పేదలకు సాధికారత కల్పించడం, వారి కనీస అవసరాలు తీర్చడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి చేరేలా చేయడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగారు. భారత్లో కటిక దరిద్రమనేది పూర్తిగా తొలగిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించింది. వినియోగం విషయంలో పేదలకూ, ధనికులకూ మధ్య ఉన్న వ్యత్యాసం కూడా గత 40 ఏళ్లలో అతి తక్కువ స్థాయికి చేరుకున్నదని ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.
తగ్గిపోయిన పేదిరకం – అంతర్జాతీయ సంస్థల నివేదికలు
2011లో 22.5 శాతం ఉన్న పేదరికం 2019 నాటికి 10.2 శాతానికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు విధాన పరిశోధన పత్రం కూడా వెల్లడించింది. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం తీవ్రంగా తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు చెప్పింది. 2011లో గ్రామీణ పేదరికం 26.3 శాతం కాగా, అది 2019 నాటికి 11.6 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో పేదరికం 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది.తాజా నివేదిక త్వరలో రానుంది. పేదరికం మరింత తగ్గినట్లుగా అంతర్గత నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం మోదీ హయాంలో చిన్న భూకమతాలు ఉన్న రైతులకు అత్యధిక ఆదాయం లభిస్తోంది. సన్నకారు రైతుల వార్షిక ఆదాయం 10 శాతం మేరకు పెరిగింది.
కటిక దారిద్ర్యం నుంచి అందరికీ విముక్తి
దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్రం అండగా నిలిచింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ఇప్పటి వరకూ ఆరు దశలుగా అమలయింది. 1003 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసింది. దేశంలో వలస కార్మికులు ఎక్కడకు వెళ్లినా అక్కడ రేషన్ తీసుకునే సదుపాయం కూడా మోదీ ప్రభుత్వం కల్పించింది. ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డు’ క్రింద దేశంలో 5 లక్షల రేషన్ షాపుల్లో ఎక్కడైనా శ్రమజీవులు ఉచితంగా తమ రేషన్ తీసుకోవచ్చు. దాదాపు 61 కోట్ల మేరకు ఈ రకంగా వేర్వేరు రేషన్ షాపుల్లో వారు ఆహార ధాన్యాలను స్వీకరించినట్లు గణాంక వివరాలు చెబుతున్నాయి. దేశంలో 80 కోట్లమందికి పైగా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారు. దాదాపు రూ. 70 వేల కోట్ల మేరకు ఇందుకు ప్రభుత్వం ఖర్చు చేసింది. వారిని కటిక దారిద్ర్యం నుంచి బయటకు తెచ్చింది.
భారత్ లో పేదరికం నుంచి విముక్తి ఓ కేసు స్టడీ
పేదరికం నుంచి విముక్తి లభించాలంటే, ఆహార ధాన్యాలు అందించడం మాత్రం ఒక్కటే మోదీ ప్రభుత్వం చేయలేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, అందుకోసం స్వచ్ఛమైన వంట గ్యాస్, పారిశుధ్య పథకాలు, త్రాగునీటి సౌకర్యం, తక్కువ ధరలకు ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య బీమా, పక్కా ఇళ్లు నిర్మించడం విధానాలు చేపట్టాలని మోదీ ప్రభుత్వం భావించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్, జన్ ధన్ యోజన, గ్రామీణ సడక్ యోజన, జలజీవన్ మిషన్, సౌభాగ్య వంటి పథకాల మాత్రమే కాదు, ఆయుష్మాన్ యోజన, జనఔషధి యోజన ద్వారా వైద్య చికిత్స అందుబాటులో తీసుకు రావడం కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ పథకాలన్నీ కోట్లాది మంది దేశ ప్రజలకు ఏదో రకమైన ప్రయోజనం అందించేందుకు ఉద్దేశించినవే, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు పరచడమే కాదు, అవినీతిని నిర్మూలించేందుకు, ఖర్చు పెట్టే ప్రతి పైసా సద్వినియోగం చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలే కాదు, ఆక్స్ఫామ్ సంస్థ, యుఎన్డిపి కలిసి నిర్వహించే బహుముఖీన పేదరిక నివేదిక కూడా ప్రతి ఏడాదీ కోట్లాది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందుతున్నట్లు చెబుతోంది. మోదీ పాలనా దక్షతకు ఈ గణాంకాలే నిదర్శనం.