ఏపీలో జరిగిన ప్రతి అభివృద్ధి పని, సంక్షేమం వెనుక కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని.. నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ చేశారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం చేసిన అభివృద్ధి పై చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల అభివృద్ధి ని వివరిస్తూనే ఎపి రాజకీయాల్లో నడుస్తున్న, నడుపుతున్న వ్యవస్ధల పక్షపాత వైఖరిపై మండిపడ్డారు. దశాభ్దకాలంగా ఎపి రాజకీయాల్లో ఉన్న దారుణమైన కేంద్ర వ్యతిరేక ప్రచారంపై సోము వీర్రాజు మండిపడ్డారు.
కేంద్ర నిధులు తీసుకుంటూ బీజేపీపై బురద చల్లే కుట్రలు
ఏపీలో వేల కోట్లు అభివృద్ది చేస్తుంటే ఎవరూ కూడా ప్రస్తావించ కుండా బిజెపి పై బురదచల్లే రాజకీయాలను చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ బిజెపి బలోపేతం జరిగితే వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని వారంతా ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర స్వరంతో మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ, టీడీపీలకు కొన్ని ప్రశ్నలు సంధించారు.
ఈ ఐదు ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే దమ్ముందా ?
- టిడ్కో ఇళ్లు ఇంతవరకు ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేదు. ?.
- ఆయుష్మాన్ భారత్ నిధులు తీసుకుంటూ ఆరోగ్యశ్రీ అని ఎందుకు అంటున్నారు..?
- వైద్య కళాశాలలకు కేంద్రం నిధులు ఇస్తే మీ స్వంత ప్రచారం చేసుకుంటూ కనీసం కేంద్రం నిధులు ఇచ్చిన విషయం ఎందుకు ప్రస్తావించడం లేదు..?
- నాలుగు సంవత్సరాల్లో మీరు వేసిన రోడ్లు వివరాలు చెప్ప గలరా..?
- పరిశ్ర మలు విషయంలో గత పాలకులు ప్రస్తుత పాలకులు చెప్పగలరా ? అని ప్రశ్నించారు.
అప్రకటిత మేధావులు భూతవైద్యులుగా తయారయ్యారు !
బిజెపి పై బురద చల్లేందుకు ఒక రాజకీయ పార్టీ భూత వైద్యులను ప్రవేశపెడుతుందని.. ఒక టీమ్ సమయం సందర్భంలేకుండా నే పర్యటిస్తూ కేంద్రం పై విమర్శలు చేస్తూంటారన్నారు. వారిని భూతవైద్యులుగా సోమువీర్రాజు అభివర్ణించారు. తీసేసిన తహసీల్దార్ లు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ని ఆడిపోసుకోవడం వీరికి అలవాటుగా మారిపోయిందని మేం చేసిన అభివృద్ధి వీరికి కనిపించదంటూ వారి పై విమర్శల వర్షం కురిపించారు. ఈ భూతవైద్యుల బ్రుందం ప్రజలకు తాయత్తులు కట్టి బిజెపికి ప్రజలను దగ్గర కాకుండా చూస్తున్నారన్నారు. ఎపిలో అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలంటూ టిడిపి, వైసిపి లకు సవాల్ విసిరారు సోము వీర్రాజుఎపి అభివృద్ధి కి నరేంద్రమోడీ ప్రభుత్వం ఎంతో సహకారం అందించింది..తొమ్మిదేళ్ల లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంతో చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన పై ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు.. కేంద్రం నిధులతో జరుగుతున్న అభివృద్ధికి పేర్లు మార్చుకోవడం వైసిపి కి అలవాటు గా మారిపోయిందన్నారు.