150 కాదు.. 200 – మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గట్టి కౌంటర్…

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ తో కాంగ్రెస్ పార్టీ ప్రకటనల పర్వం కొనసాగుతోంది. అక్కడ 135 స్థానాలతో విజయం సాధించిన హస్తం పార్టీ.. ఇకేంముంది దేశంలోని అన్ని రాష్ట్రాల్లా తామే గెలుస్తామని చెప్పుకుంటోంది. ఇకపై పట్టిందల్లా బంగారమవుతుందన్న రేంజ్ లో మాట్లాడుతోంది. ఒక్క గెలుపుతో ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ వద్దని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ హితబోధ చేస్తున్నా.. సోనియా భక్తులకు మాత్రం ఆ సంగతి అర్థం కావడం లేదు..

ఎంపీలో 150 స్థానాలు ఖాయమంటున్న రాహుల్

అధిష్టానంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల సమావేశం ఢిల్లీలో జరిగింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, పార్టీకి అక్కడి జనాదరణ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో కూడా కర్ణాటక తరహా పరిస్థితులే ఉన్నాయని అక్కడ పార్టీ విజయం ఖాయమని రాష్ట్ర నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ప్రభుత్వం పట్ల మధ్యప్రదేశ్ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని నేతలు విశ్లేషించుకున్నారు. సమావేశం తర్వాత కాంగ్రెస్ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విలేకర్లతో మాట్లాడుతూ త్వరలో జరిగే మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని చెప్పుకున్నారు. మొత్తం 230 స్థానాలున్న అసెంబ్లీలో తమకు 150 స్థానాలు దక్కుతాయని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటారని రాహుల్ అన్నారు.

అంత సీన్ లేదన్న బీజేపీ

గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 114 స్థానాలు రాగా, బీజేపీ 109 చోట్ల గెలిచింది. తొలుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఇక రాహుల్ తాజా ప్రకటనపై బీజేపీ విమర్శలు, సోషల్ మీడియా మీమ్స్ పెల్లుబికాయి. దీనిపై మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎన్ని ఊహల పలావులు వండుకున్నా విజయం తమదేనని శివరాజ్ అన్నారు. ఈ సారి తమకు 200 స్థానాల కంటే ఎక్కువ వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాలి మేడలు కట్టుకోవడం మినహా కాంగ్రెస్ పార్టీ సాధించేదేమీ లేదని చౌహాన్ సమాధానమిచ్చారు.

సంక్షేమానికి పెద్ద పీట

మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది. పదుల సంఖ్యలో పథకాలతో పేద, అల్పాదాయ వర్గాలకు ప్రయోజనం కలిగించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్వరోజ్ గార్ యోజనతో స్వయం ఉపాధికి అవకాశాలు పెంచింది. గోకుల్ గ్రామ్ యోజనతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పెంచింది. మొబైల్ హాస్పిటల్స్, అంత్యోదయ్ ఉపచార్ యోజన ద్వారా పేదలందరికీ వైద్య సదుపాయాలు అందించింది. ఐదు రూపాయలకే భోజనం పెట్టే అంత్యోదయ రసోయి యోజనతో ప్రజలకు బాగా చేరువైంది. వికలాంగుల సంక్షేమానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సమర్థ్ యోజనను అమలు చేస్తోంది. పేద అమ్మాయిల పెళ్లి కోసం సీఎం కన్యా దాన్ యోజనను అమలు చేస్తూ వారికి తలా రూ. 51 వేలు అందిస్తున్నారు. ముస్లిం మహిళల నికాహ్ కు కూడా ఇలాంటి పథకమే అమలవుతుంది. యువతలో స్కిల్ డెవలప్ మెంట్ కోసం సీఎం కౌశల్ సమ్వర్థన్ యోజన ప్రవేశ పెట్టారు. 60 ఏళ్లు దాటిన వారికి సీఎం తీర్థ్ దర్శన్ యోజన అంటే తీర్థయాత్రలకు ఆర్థిక సాయం చేసే పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకాలే తమను గెలిపిస్తాయని బీజేపీ విశ్వసిస్తోంది