చైనా కొవిడ్ తో భయపడాల్సిన పనిలేదంటున్న నిపుణులు

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి కరోనా వేవ్ ప్రపంచంపై పంజా విసిరితే ఏం జరుగుతుందోనన్న భయం జనంలో పెరుగుతోంది.దాన్ని నిరోధించేందుకు ప్రభుత్వాలు అహరహం కృషి చేస్తున్నాయి. కొత్త వేరియంట్లు తమ దేశాల్లోకి విస్కరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి..

జూన్ ఆఖరుకు భారీగా కేసులు…

చైనాలో ఏప్రిల్ మధ్య కాలం నుంచి కొవిడ్ పెరుగుతోంది. జూన్ ఆఖరుకు కనీసం ఆరున్నర కోట్ల మంది కరోనా రోగులుంటారని ఆ దేశ ప్రభుత్వమే అంచనా వేస్తోంది. చైనాలో విస్తరిస్తున్న కరోనాను ఇప్పుడు ఎక్స్.బీ.బీ. సబ్ వేరియంట్ అని పిలుస్తున్నారు. అది ఒమైక్రాన్, బీఎ 2.75ల కలయిక అని వైద్య నిపుణులు నిర్థారించారు. దాని వల్ల చైనీయులకు శ్వాసకోశ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

భారతదేశానికి ఒమైక్రాన్ అనుభవం

ఇండియాలో గతేడాది అంతకముందు కొన్ని రోజులు ఒమైక్రాన్ ప్రభావం కనిపించింది. చాలా మందికి పాజిటివ్ వచ్చినా ఎలాంటి అనారోగ్యం, ప్రాణ హాని జరగలేదు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా 90 శాతం మందికి రాలేదు. భారత వైద్య పరిశోధనా మండలికి చెందిన 54 లేబొరేటరీల్లో కరోనాపై పరిశోధనలు చేస్తూ ఎంత మరే నష్టం ఉందనే అంచనాకు వస్తున్న నేపథ్యంలో గతేడాది ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని నిర్థారించారు.ఇండియన్ సార్స్ కోవిడ్ -2 జినోమ్ కన్సార్టియం విడుదల చేసిన బులెటిన్లలో కూడా గతేడాది కరోనాతో ఎవరికీ తీవ్ర సమస్యలు ఎదురు కాలేదని ప్రకటించారు.

చైనా, ఇండియా తేడా ఏమిటి…

గతేడాది నవంబరు, డిసెంబరులో ఎక్స్. బీ. బీ వేరియంట్ ప్రభావం ఉన్న మాట వాస్తవం. చైనాతో సరిహద్దును పంచుకునే ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. దేశ ప్రజల్లో ఇమ్యూనిటీని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయం సాధించడమే ప్రస్తుత ధైర్యానికి కారణంగా చెప్పుకోవచ్చు. స్వల్ప సమయంలో భారీ స్థాయి వ్యాక్సినేషన్ ప్రజారోగ్య పరిరక్షణలో కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. ఒమైక్రాన్ కారణంగా జనానికి నేచురల్ ఇమ్యూనిటీ ప్రాప్తించింది. గతేడాది దేశంలో లాక్ డౌన్లు లేకపోవడంతో కూడా ఇమ్యూనిటీ పెరిగింది. మరో పక్క వైరస్ పెరుగుతుందన్న భయంతో చైనా ప్రభుత్వంసుదీర్ఘ లాక్ డౌన్లు పాటించింది. దానితో చైనీయులకు ఇమ్యూనిటీ పెంచుకునే అవకాశం రాలేదు. వైరస్ కూడా అక్కడ త్వరగా వ్యాపించింది.

ఒమైక్రాన్ వైరస్ లోనే మార్పులు, పరివర్తన కనిపించడంతో భారతీయులపై దాని ప్రభావం ఎక్కువగా లేదు. కొంత మంది పెద్దలను ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చినా ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడలేదు. ప్రతీ ఆరు నెలలకు వేరియంట్ భయంకరంగా తయారు కావాల్సి ఉన్నప్పటికీ అలా జరగకపోవడం మన ఇమ్యూనిటీకి నిదర్శనంగా చెబుతున్నారు. అయినా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని ఐసీఎంఆర్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రాబోయే వేరియంట్ల తీవ్రతను ఇప్పుడే అంచనా వేయడం కష్టం..