వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో గెలవడానికి నవరత్నాలను నమ్ముకుంది. వాటిని అమలు చేశారా లేదా అన్నది పక్కన పెడితే.. ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తోంది. పేదలను ధనవంతులు చేయడం కాన్సెప్ట్ తో.. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని టీడీపీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఈ పథకాలను మొదటి విడతగానే ప్రకటించిది. తమ పథకాల గురించి ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చేయడానికి ఇలా చేసింది. అయితే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూంటారు వచ్చే పాతికేళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారని..ఇక దివాలా తీయడమే మిగిలిందని చెబుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ పథకాలన్నీ టీడీపీ ఎలా అమలు చేస్తుంది?
ఏపీ ఆర్థికంగా దివాలా తీస్తేఈ పథకాలు ఎలా ఇస్తారు >
తాము ఉచిత పథకాలు ఇవ్వకుండా అందరి సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నామని, దీంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని సీఎంజగన్ చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఓ వర్గం ప్రజలు కట్టే పన్నులు మాత్రమే కాదు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి, అడ్డగోలు అప్పులు చేసి పథకాలను అమలు చేస్తున్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరం. సంపద సృష్టించినా. ఇలా అప్పనంగా పంచిపెట్టడం వల్ల నష్టమే .. అంటే అనుత్పాదక వ్యయమే అవుతుంది. దాని వల్ల దేశానికి నష్టమే. కానీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు దేశానికి నష్టం చేయడానికైనా వెనుకాడటం లేదు. పథకాలు పంచి పెట్టడం వల్ల.. ఏపీ ఆర్థికంగా దివాలా తీస్తుందని ఆరోపిస్తున్న టీడీపీ ఇప్పుడు ఈ పథకాలను ఎలా అమలు చేస్తుందన్నది కీలకం.
సంపద సృష్టిస్తారని ప్రచారం చేస్తున్న టీడీపీ !
చంద్రబాబుకు సంపదసృష్టి అనే విజన్ ఉందని.. సంపద సృష్టించి పేదలకు పంచుతానని ఆయన చెబుతున్నారు. సంపద సృష్టించం అంటే ఏమిటి ? భూముల విలువ పెంచి అమ్ముకోవడమా ? అలా అమ్ముకున్న వాటితో పథకాలు అమలు చేయడమా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సంపద సృష్టి అనేది ఆషామాషీగా ఒక్క రోజులో జరిగేది కాదు. పైగా ఏపీ లో ఐదేళ్లు ఉన్న ప్రభుత్వం పూర్తిగా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి..ఆదాయం పెంచే అంశాలపై పూర్తిగా శీతకన్నేసినందున.. అది సాధ్యం కూడా కాదు.
ఉచిత పథకాల విషయంలో మార్పు రావాల్సింది ప్రజల్లోనే !
రాజకీయ పార్టీలు ఇలాంటి హామీలు ఇస్తున్నాయంటే.. దానికి కారణం స్కీములకు ప్రజలు ఓట్లు రాల్చడమే. వీరు కూడా బాధ్యతగా వ్యవహరిస్తే.. తప్ప.. రాజకీయాల నుంచి పథకాల పేరుతో ఓట్లు కొనే జాడ్యం సమసిపోదు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఉచిత హామీలకు.. సంక్షేమానికి స్పష్టమైన గీత గీసింది. ప్రజల ఆకలి తీర్చడం సంక్షేమం.. అంతే కానీ వారి విలాసాలకు డబ్బులివ్వడం కాదు.ఈ తేడాను ప్రజలు కూడా గుర్తించినప్పుడే వారు కట్టే పన్నులకు ఓ వాల్యూ వస్తుంది.