కర్ణాటక కాంగ్రెస్ లో రచ్చ రచ్చ

కాంగ్రెస్ అంటేనే పదవులు. పదవుల కోసమే పార్టీని అంటిపెట్టుకుని ఉండే నేతలు. పదవులు లేకపోతే ఉక్కపోతను అనుభవించే పార్టీ శ్రేణులు. పదవులివ్వకపోతే పార్టీలో ఉండేది లేదని ప్రకటించే నాయకులు. అంతకుమించి వీధినపడి కొట్టుకునే గ్రూపులు. పార్టీ పరువు, క్రమశిక్షణతో సంబంధం లేని ముఠాలు.

చిచ్చుపెట్టిన ప్రమాణ స్వీకారం

కర్ణాటక కేబినెట్లో 24 మంది కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. సుదీర్ఘ మంతనాలు, ఢిల్లీలో చర్చలు, సామాజిక వర్గ సమీకరణాలు చూసిన తర్వాత మంత్రుల పేర్లను ఖరారు చేసి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ ప్రకటించారు. ఐనా కాంగ్రెస్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం గందరగోళానికి దారి తీసింది. కొందరు అలిగి గోల చేశారు. ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడే రాజ్ భవన్ బయట కాంగ్రెస్ శ్రేణలు పార్టీ వ్యతిరేక నినాదాలు చేశాయి. తమ నాయకుడికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటూ చాలా మంది నిరసన నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఆగ్రహావేశాలు బెంగళూరు సిటీతో ఆగిపోలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపించింది. టుమాకూరు, మైసూరు, హవేరీ, కొడగులో కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తా రోకోలు, నిరసనలు నిర్వహించారు. రాక రాక అవకాశం వస్తే మా నాయకులకు మంత్రి పదువులు ఇవ్వరా అన్ని ఇంఛార్జ్ లను జిల్లా నేతలను నిలదీశారు. ఎమ్మెల్యే టీబీ జయచంద్రన్ అనుచరులు ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసం బయట నిరసన నిర్వహించారు. కేబినెట్ విస్తరణలో కుంచిటిగ సామాజిక వర్గానికి బాగా అన్యాయం జరిగిందని, ఆ కులం నుంచి ఒక వర్గానికి కూడా అవకాశం రాలేదని ఆగ్రహం చెందారు. మైసూరులో ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్ అనుచరులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతు తేల్చుతామని కొందరు నినాదాలిచ్చారు. కొందరి పెత్తనంతో పార్టీ నడవడమేంటని ప్రశ్నించారు. తమకు మంత్రి పదవులు రాకపోవడంతో ఎమ్మెల్సీలు బీకే హరిప్రసాద్, సలీం అహ్మద్ బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఫలించని బుజ్జగింపులు

అసంతృప్తిపరులను దారికి తెచ్చేందుకు సిద్దరామయ్య, శివకుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎనిమిది జిల్లాల్లో ఎమ్మెల్యేలు అసంతృప్తి చెందిన మాట నిజమేనని అంగీకరించిన సిద్దరామయ్య.. అడిగిన వారందరికీ పదవులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకున్నారు. సామాజిక వర్గం, అనుభవం లెక్కలు కట్టుకుని మంత్రి పదవులిచ్చిన కారణంగా కొందరికి అన్యాయం జరిగిందని ఆయన అంగీకరించారు. తొలి సారి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొందరిని సంతృప్తి పరచగలిగినా ఆదివారం కూడా జిల్లాల్లో నిరసనలు కొనసాగాయి. తమ నాయకులకు న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

నిరసనలు చల్లారేందుకు కొంత కాలం పట్టొచ్చు. ఈ లోపు ఒకరిద్దరికి తాయిలాలిస్తే సైడైపోతారు. కాంగ్రెస్ పార్టీలో అది మామూలే కదా.. పెద్దగా చెప్పుకోవాల్సిందేముంది.