కడుపుతో ఉన్న స్త్రీ ప్రశాంతంగా ఉండాలని, మంచి మాటలు మాట్లాడాలని, రామాయణం-మహాభారతం లాంటి గ్రంధాలు చదవాలని చెబుతారు. తల్లి ప్రవర్తనే కడుపులో ఉన్న బిడ్డపై పడుతుందని పండితులు చెబుతారు. పురాణకాలం నుంచి ఇప్పటివరకూ ఆ మాట నిజమైన సందర్భాలెన్నో.
అభిమన్యుడు
పద్మవ్యూహం గురించి అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక నేర్చుకోలేదు..తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని మహాభారతంలో ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు కూడా. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు.
అయితే పద్మవ్యూహం లోపలకు ఎలా వెళ్లాలో పూర్తిగా వివరించిన అర్జునుడు…సుభద్ర నిద్రపోతోందని గమనించి బయటకు వచ్చే వ్యూహం వివరించడం ఆపేస్తాడు. ఇదంతా లోపలనుంచి విన్న అభిమన్యుడు..అత్యవసర పరిస్థితుల్లో పద్మవ్యూహంలోకి చేధించుకుంటూ వెళ్లి శత్రువులతో పోరాడాడు. కానీ ఆ వ్యూహం నుంచి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యవిషయం అభిమన్యుడు పద్మవ్యూహం గురించి కాదు…కడుపులో ఉన్న బిడ్డ బయట మనం మాట్లాడే ప్రతిమాటని అర్థంచేసుకుంటాడని…
ప్రహ్లాదుడు
హిరణ్యకశిపుడి కొడుకైన ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడని..అందుకే పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెబుతారు. సినిమాల్లో చూపించినప్పుడు మాత్రం బిడ్డ పుట్టిన తర్వాత నారాయణ మంత్రం ఉపదేశించాడని అప్పటి నుంచి విష్ణుభక్తుడు అయ్యాడని చూపిస్తారు. కానీ లీలావతి గర్భవతిగా ఉన్న సమయంలోనే నారదుడు ఆమెకు నారాయణమంత్రం గురించి చెబుతాడు. ఆ సయంలో లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కంటే కూడా ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాదుడే ఎక్కువగా ఆకళింపు చేసుకున్నాడు.
నేర్చుకోవడం గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మొదలవుతుంది
నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి నిరూపించారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగా వినికిడి శక్తి ఏర్పడుతుందని, దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగాలుగుతారని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. గర్భస్థ శిశువు మన మాటలు వింటుంది, గ్రహిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని, ఆవేశాలు, వివాదాలకు దూరంగా ఉండాలని చెబుతారు. అందుకే రామాయణ, మహాభారతం చదవాలని, నిత్యం దైవనామస్మరణలో ఉండాలని సూచిస్తారు. తల్లి ఎంత ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటుందో..బిడ్డ కూడా అంతే ఆరోగ్యంగా పుడుతుంది.. ఆరోగ్యకరమైన ఆలోచనలతో పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.