గోవులో చతుర్దశ భువనాలు ఉన్నాయని వేదం చెబుతోంది.
‘ధేనునా మస్మి కామధుక్’
నేనే గోవును అని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఇలా ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసి కొంచెం ప్రసన్నుడైన తర్వాత దక్ష ప్రజాపతి శ్వాస నుంచి సుగంధం ప్రసరించింది. ఆ సుగంధం నుంచి ఆవు జన్మించింది. సుగంధం ద్వారా జన్మించడం వలన దక్ష ప్రజాపతి ఆ ఆవుకి ‘సురభి’ అని పేరు పెట్టారు. లోకంలో గో సంతతి వ్యాప్తి చెందేందుకు సురభియే ఆధారం. సురభి నుంచి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశానికి మాతగా, జననిగా పరిగణిస్తారు. సురభి రోమ కూపాల నుంచి కొన్ని లక్షలలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతే వృషభాలు (ఎద్దులు). ఋగ్వేదంలో ఆవును ”అఘణ్య” అని అన్నారు. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని,గోవును పూజించడం వల్ల సకల దేవతలా ఆశీర్వాదం పొందవచ్చని భావిస్తారు.
గోవును ఏ భాగంలో పూజించడం వల్ల ఏ దేవుడి ఆశీర్వాదం కలుగుతుంది..తద్వార పొందే ఫలితం ఏంటి
-గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడు. కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే…త్రివేణి సంగమంలో నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.
- గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు
- గోవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారు. చెవి భాగాన్ని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది
- ఆవు కళ్ల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయి
- ఆవు నాలుకపై వరుణ దేవుడు కొలువై ఉంటాడు.
- ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి
- ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారు
- ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలు, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడు
- ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. అందుకే పొదుగు స్థానంలో పూజిస్తే ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయి
- ఆవు గిట్టల చివర ఉండే నాగదేవతలను పూజిస్తే పుణ్యలోక ప్రాప్తి లభిస్తుంది
- దేవలోక గోవు పటాన్ని గమనించినట్లైతే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఆవు వెనుక భాగాన్ని పూజిస్తారు
- గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.