అద్దానికి ఆత్మకు సంబంధం ఏంటి – పగిలిన అద్దం ఇంట్లో ఉంటే ఏమవుతుంది!

అద్దం పగిలితే ఏదో జరిగిపోతుందని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. అద్దం పగిలితే అరిష్టం అని, లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్లిపోతుందని భావిస్తారు. నిజంగా అద్దం పగిలితే చెడు జరుగుతుందా..ఆత్మకు-అద్దానికి సంబంధం ఏంటి.. అద్దం సెంటిమెంట్ విదేశీయుల నుంచి మనకు వచ్చిందా.. అద్దం గురించి వివరణాత్మక కథనం ఇది…

భారతీయ సంస్కృతిలో అద్దం అనేది ఆత్మ భాగాన్ని స్వాధీనం చేసుకునే శక్తి అని నమ్ముతారు. రోమన్లది కూడా ఇలాంటి భావనే. అద్దంలో కనబడే ప్రతిబింబం వ్యక్తి నిజమైన ఆత్మగా రోమన్లు భావిస్తారు. అయితే పొరపాటున అద్దం పగిలిపోతే దురదృష్టమని అందులో వ్యక్తి ఆత్మ చిక్కుకుంటుందని నమ్ముతారు. ఇలాంటి మూఢనమ్మకం మొదటిసారి ఐరోపాలోనే ప్రారంభమై, తర్వాత చైనా, ఆఫ్రికా, చివరిగా భారతీయ సంస్కృతిలో చేరింది. అలాగే అద్దం పగిలిపోతే దాని పెంకులను గొయ్యి తీసి పాతిపెట్టాలని కూడా చెబుతారు.

పగిలిన అద్దం ఇంట్లో ఉంటే..!
అద్దం పగిలితే అరిష్టం, పగిలిన అద్దంలో మొహాన్ని చూసుకోకూడదు, పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు, మరకలు పడిన లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలే ఉంచకూడదు, అద్దం లక్ష్మీదేవి అని పెద్దలు చెబుతుంటారు. అద్దాలు లేనికాలంలో నదులు, సరస్సులు, చెరువులలో ప్రతిబింబాన్ని చూసుకునేవారు.ఈ ప్రతిబింబాలు మన ఆత్మలాగే మనతోనే ఉంటాయని నమ్మేవారు. ఇలా ప్రతి బింబాలని చూసుకునేటప్పుడు ఏ మాత్రం అటూ ఇటూ అనిపించినా అశుభం అని భావించేవారు. అలా అలా ఆ తర్వాత అద్దాలు వచ్చాక కూడా ప్రతిబింబం గందరగోళంగా కనిపిస్తే అశుభం అనే భావన ఉండిపోయింది.

అద్దం అమ్మవారి స్వరూపం
అద్దం అమ్మవారి స్వరూపం అంటారు. లక్షీ స్వరూపంగా భావించే అద్దం పగిలితే సంపద నష్టపోతారని, ఇంట్లో మనశ్సాంతి ఉండదని చెబుతారు. పగిలిన అద్దంలో ఒకే బొమ్మ నిలకడగా ఉండనట్టే..లక్ష్మీదేవి కూడా నిలకడగా ఉండదంటారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే, ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. అద్దాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు కాబట్టే మైల వచ్చినప్పుడు ముట్టుకోకూడదంటారు. ఇంట్లో అద్దం పగిలిన అరిష్టం పోవాలంటే ముత్తైదువలకు అద్దం ఇవ్వాలంటారు పండితులు.

అద్దం పగలడం మృత్యు సంకేతమా!
హిందువులతో పాటూ విదేశీయులకు కూడా అద్దం సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా రోమన్లు, గ్రీకులు, చైనీయులు, ఆఫ్రికన్లకి అద్దం చాలా సెంటిమెంట్. అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలిందంటే మన రూపం ఛిద్రమైనట్టే..అంటే మరణించే సమయం ఆసన్నమైందనే హెచ్చరిక అంటారు. అమెరికా, ఐర్లాండ్ వాసులు ఓ సెంటిమెంట్ ఫాలోఅవుతుంటారు…తెలిసినవాళ్లెవరైనా చనిపోతే వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీదా గుడ్డ కప్పేస్తారట. చనిపోయి వారి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తనవాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం దొరికేవరకూ అద్దంలో తలదాచుకుంటుందని వారి నమ్మకం. అందుకే ఆ ఆత్మ వచ్చి చేరుతుందని భయపడి అద్దాలను కప్పేస్తారట.

అద్దం విషయంలో ఇవన్నీ నిజాలా-ప్రచారాలా!
అద్దం పగిలితే అరిష్టం, సంపద పోతుంది, ఆత్మలొస్తాయి ఇవన్నీ మాటల్లో చెప్పుకోవడమే కానీ నిజంగా అలా జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. వాస్తవానికి పగిలిన అద్దంలో చూసుకుంటే కళ్లకు మంచిది కాదంటారు వైద్య నిపుణులు. మరీ ముఖ్యంగా పగిలిన అద్దం క్లీన్ చేసినా చిన్న గాజుపెంకు ఉండిపోయి గుచ్చుకున్నా ప్రాణాపాయం ఉండొచ్చు. అందుకే అద్దం చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అది పగిలిపోతే దురదృష్టమనే మూఢనమ్మకానికి ముడిపెట్టారని చెబుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.