అవినాష్ రెడ్డి అరెస్టుపై సీబీఐ నిర్ణయాల్లోనూ బీజేపీపై నిందలు – ఇదేం రాజకీయం !?

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని టార్గెట్ చేసుకున్న ఓ వర్గం మీడియా వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జరుగుతున్న పరిణామాల్ని కూడా బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. అదృశ్య శక్తి అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ.. దర్యాప్తు సంస్థలను ఎవరెవరో ప్రభావితం చేస్తున్నారన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. వైసీపీ, బీజేపీ ఒక్కటే అని చెప్పడానికి.. వ్యూహాత్మకంగా జరుగుతున్న రాజకీయ దాడిలో ఇది కూడా ఓ భాగం అయింది. దీన్ని తప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు.

వివేకా కేసులో ఏ చాన్సూ వదలని సీబీఐ

నిజానికి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చాలా సిన్సియర్ గా దర్యాప్తు చేస్తోంది. ఓ వర్గం మీడియా ప్రచారం చేసినట్లుగా అదృశ్య శక్తి నిజంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ సీబీఐ అధికారులు డీప్ గా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారుల్ని పట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారని ఆ మీడియానే చెబుతోంది. మళ్లీ అవినాష్ రెడ్డి విషయంలో అరెస్ట్ చేయకపోతే ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తోంది. సీబీఐ అధికారులు తాము చెప్పినట్లుగా చేయాలని అలా చేయకపోతే బీజేపీ ప్రభావితం చేసిందన్నట్లుగా ఆ వర్గం మీడియా బురద చల్లడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. వారికి ఆయా పార్టీల సానుభూతిపరులు తోడవుతున్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

బీజేపీ ప్రభావితం చేస్తే అసలు కేసు ఉండేదా – ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు ?

వైఎస్ వివేకా హత్య కేసును బీజేపీ ప్రభావితం అంటూ చేస్తే అసలు ఇక్కడిదాకా వస్తుందా అని ఆలోచిస్తే…ఎవరికైనా సమాధానం దొరుకుతుంది. సీబీఐని ఎవరూ ప్రభావితం చేయడం లేదని..దర్యాప్తు అధికారిని సుప్రీంకోర్టు మార్చిన తర్వాత కూడా కేసులో వేగం కొనసాగుతూండటమే దీనికి కారణం. నిజానికి ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న ప్రతీ సారి బీజేపీపై అనుమానాస్పదంగా చూస్తూ.. వ్యాఖ్యలు చేయడం కథనాలు రాయడం.. ఆ మీడియాకు అలవాటుగా మారింది. దీన్ని ప్రజలు గుర్తించే సమయం ఆసన్నమయింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరేముకున్నా..తమ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం సీబీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది.

న్యాయ అవకాశాలు వినియోగించుకుంటే బీజేపీ ఏం చేస్తుంది ?

దేశంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయి. తమకు అన్యాయం జరుగుతుందని భావించినా లేదా.. తానుతప్పు చేసినా సరే.. తప్పు చేయలేదని నిరూపించుకోవడానికైనా న్యాయపరమైన ఆప్షన్లను ఎంచుకుంటారు. అందరూ చేసేది అదే. తెలుగుదేశం పార్టీ నేతలే కాదు.. వైసీపీ సహా అన్ని పార్టీల నేతలు చివరికి పత్రికాధిపతులు కూడా న్యాయవ్యవస్థ తలుపు తట్టి ఉంటారు. అందరూ ఎవరి హక్కులు వారు వినియోగించుకుంటారు. అలాంటి విషయాల్లోనూ బీజేపీకి ఎందుకు ముడి పెడుతున్నారు. ఇలా ప్రచారం చేయడం వ్యవస్థల్ని కించ పర్చడమేనని తెలిసి కూడా ఎందుకు బరి తెగిస్తున్నారో వారే ఆత్మవిమర్శ చేసుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.

బీజేపీపై ప్రచార కుట్రలు ఎల్ల కాలం సాగుతాయా ?

తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా బీజేపీపై నిందలు వేయడం అనేది కామన్ గా మారిపోయింది. వ్యవస్థలు తమ పనులు తాము చేసుకోనివ్వకుండా వాటిపై ముద్ర వేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్ని ప్రజలు ఎల్ల కాలం నమ్మరు. ఒక సారి నమ్ముతారు.. రెండు సార్లు నమ్ముతారు.. కానీ అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న చందంగా ప్రతీ సారి నమ్మరు. అలా నమ్మే స్టేజ్ దాటిపోయింది. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు సిద్దమవుతున్నారు.