కేంద్రం పట్టుదల – కిషన్ రెడ్డి సంకల్పం ! కశ్మీర్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా జీ 20 మీట్ – ఇది అసలు ఊహించామా ?

మూడేళ్ల కిందటి వరకూ కశ్మీర్ అనే మాట టీవీలో, పేపర్లలో వచ్చిందంటే.. ఖచ్చితంగా మొదట వినిపించే మాట ఉగ్రవాదుల దాడి. తర్వాత రాళ్ల దాడులు. శాంతిభద్రతల సమస్యలు. కశ్మీర్ అంటే కల్లోలతమైన చరిత్ర. కానీ అదే కశ్మీర్‌లో ఇప్పుడు జీ 20 సన్నాహాక సమావేశం జరుగుతోంది. టూరిజంపై జరుగుతున్న ఈ సన్నాహక సమావేశానికి ప్రపంచంలోని ప్రముఖ దేశాల ప్రతినిధులంతా వచ్చారు. ఇండియన్ స్విట్జర్లాండ్ గా ఉన్న కశ్మీర్ ను చూసి వారంతా మైమరిచిపోతున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నా ఎక్కడా చిన్న అపశృతి లేకుండా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతల పరంగా అసలు ఎలాంటి సమస్యా లేదు. దీంతో ఇది మన కశ్మీరేనా అని దేశం మొత్తం ఆశ్చర్య పడుతోంది.

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత క్రమంగా మెరుగుపడిన పరిస్థితులు

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019లో రద్దు చేశారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. జమ్మూకశ్మీర్‌లో అతివాదంపై పోరాటంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కశ్మీర్‌లో మిలిటెంట్ దాడులు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. మరోవైపు మిలిటెంట్ల సంఖ్య కూడా తగ్గింది. ఆపరేషన్ ఆల్ ఔట్’లో భాగంగా చాలా మంది మిలిటెంట్లను భద్రతా సంస్థలు హతమార్చాయి. అతిపెద్ద నెట్‌వర్క్‌ను ఇంత తక్కువ సమయంలో పూర్తిగా తొలగించడం చాలా కష్టం కానీ మూడేళ్లలోనే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితుల్ని.. టెర్రరిజం అంటే ఇక్కడ లేదే అనే పరిస్థితుల్ని బలగాలు తీసుకు రాగలిగాయి. దీంతో కశ్మీర్ దేశంలో భాగంగా మారిపోయింది. గత రెండేళ్లలో కశ్మీర్‌కు వస్తున్న పర్యటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2022లో మొత్తంగా 1.88 కోట్ల మంది పర్యటకులు వచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అసాధారణమైన వృద్ధి. ఏ మాత్రం భద్రత భయాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు.

జీ 20 పర్యాటక సదస్సు నిర్వహణతో ప్రపంచం దృష్టికి కశ్మీర్

కశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ తో పాటు చైనా కూడా వివాదాస్పద ప్రాంతంగా చేయాలని చూసేది. అందుకు బలంగా గతంలో ఉన్న ఆర్టికల్370ని చూపించేది. కానీ కేంద్రం దాన్ని తీసేసిన తర్వాత పూర్తి స్థాయిలో కశ్మీర్ భారత్ భూభాగం అని.. అక్కడ ప్రత్యేక ప్రతిపత్తి లేదని స్పష్టంగా ప్రపంచానికి వివరిస్తున్నారు. జీ 20 సమావేశం కశ్మీర్ లో నిర్వహించాలనుకున్నప్పుడు చైనా కూడా అభ్యంతరం చెప్పింది. వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించవద్దని చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం ధీటుగా తిప్పికొట్టింది. కశ్మీర్ ఏ విధంగానూ వివాదాస్పద ప్రాంతం కాదని.. పూర్తిగా దేశంలో అంతర్భాగం అని స్పష్టం చేసింది. పాక్ కుతంత్రాలు కూడా ఈ అంశంలో పారలేదు.

జీ 20 సన్నాహక సదస్సు నిర్వహణలో కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ !

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి కశ్మీర్ కు ప్రపంచంలో ప్రత్యేమైన పర్యాటక కేంద్రంగా మార్చడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన కశ్మీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కశ్మీర్ లో టూరిజం రంగంలోనే తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కూడా వచ్చింది. అందుకే ప్రపంచం దృష్టికి కశ్మీర్ అందాల్ని తీసుకెళ్లి టూరిజంను ప్రమోట్ చేయాలంటే..టూరిజంపై జీ 20 సన్నాహాక సమావేశం అక్కడే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. భద్రతా పరంగా సున్నితమైన విషయం అన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ.. అక్కడికి రావడానికి కొంత మంది అభ్యంతరం చెబుతారన్న ప్రచారం జరిగినప్పటికీ వెనక్కి తగ్గలేదు. బారత్ నిర్ణయించే వేదికను కాదనే దేశాలు లేవు. చైనా లాంటి దేశాలకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసు. అందుకే కశ్మీర్ నే వేదికగా నిర్ణయించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తున్నారు.

ప్రపంచం ముందు ఠీవిగా భారత పర్యాటక సౌందర్యం – నిర్వహణ సామర్థ్యం !

కశ్మీర్ అందాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. స్విట్జర్లాండ్ కూడా దిగదుడుపే. హాలీవుడ్ సినిమాల షూటింగ్‌లు జరుపుకునేంత ప్రకృతి సౌందర్యం అక్కడ ఉంటుంది. కానీ ఇంత కాలం అక్కడ ఉన్న ఉగ్రవాద ప్రాబల్యం వల్ల సాధ్యం కాలేదు.ఇప్పుడు అన్నీంటినీ కేంద్రం చక్కబెట్టేసింది. ఈ విషయం జీ 20 సదస్సు నిర్వహణ ద్వారా ప్రపంచానికి భారత్ చాటి చెప్పినట్లయింది.