ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన లోటు భర్తీ నిధులను కేంద్రం విడుదల చేసింది. దాదాపుగా రూ. పది వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేసింది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎంతగానే ఉపయోగపడుంది. సమస్యల్లో ఉన్నరాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడతాయి. కేంద్రం ఎన్నో అంచనాలు వేసి.. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం లోటు భర్తీ కింద నిధులు మంజూరు చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది ? ఓ వర్గం మీడియాలో ఎందుకిచ్చారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు..? నిధులిచ్చినా సరే బీజేపీకి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది. ఇలా ఇవ్వాల్సిన నిధులను కూడా ఆపాలని వీరు ఎందుకు కోరుకుంటున్నారు. వీరికి కావాల్సింది రాజకీయమా ? రాష్ట్ర ప్రయోజనాలా ?
చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చారు.. ఇవ్వకూడదా ?
కేంద్ర – రాష్ట్రాల మధ్య రాజ్యాంగపరమైన సంబంధాలు ఉంటాయి. వాటికి రాజకీయాలతో సంబంధం లేదు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధులు రాజ్యాంగపరంగా ఉంటాయి. ఆ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. విభజన చట్టంలో భాగంగా కేంద్రం లోటు భర్తీ చేయాల్సి ఉంది. ఆ మేరకు లోటు భర్తీని కేంద్రం చేసింది. ఏపీకి రూ. పది వేల కోట్లకుపైగా నిధుల్ని ఇచ్చింది. రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం నిధులు వచ్చినందుకు ఎవరైనా సంతోషిస్తారు. అధికార, ప్రతిపక్షంతో సంబంధం లేకుండా సంతోషించాలి. ఎందుకంటే ఈ నిధులు వచ్చింది రాజకీయ పార్టీకి కాదు.. ప్రభుత్వానికి. అంటే ప్రజలకే. ఇంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చినప్పుడు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాలి కానీ..కుట్రలు ఆపాదించకూడదు.
వీళ్లకేం కావాలి.. రాజకీయమా ? రాష్ట్రమా ?
నిధులు విడుదల చేసిన అంశంపై రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తే ఓ అర్థం ఉండేది. ఎందుకు అంటే.. రాజకీయం చేయడం వారి అవసరం అనుకోవచ్చు. కానీ ఇక్కడ అనూహ్యంగా రాజకీయ పార్టీ కాకుండా ఆ రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. ఎందుకు ఇచ్చారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ పై ప్రత్యేకాభిమానంతో రూ.పది వేల కోట్లు ఇచ్చారన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. రాజకీయాన్ని ముడిపెట్టి.. బీజేపీ, వైసీపీ ఒకటే అనే భావన కల్పించడానికి ఈ నిధుల విడుదలను ఉపయోగించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మొదటి నుంచి బీజేపీ ని టార్గెట్ చేసే ఓ వర్గం మీడియా చేస్తున్న పనే అది.
బీజేపీకి రాష్ట్రం ముఖ్యం – ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదు : సోము వీర్రాజు
భారతీయ జనతా పార్టీకి రాష్ట్రం ముఖ్యమని..ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఏపీ ప్రయోజనాల కోసం దాదాపు 3 లక్షల కోట్లు బిజెపి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ముఖ్యమైన భావించి నేడు పదివేల కోట్లు పైబడి అందించడం జరిగిందన్నారు. మూడు లక్షల కోట్లు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఎవరు అధికారంలో ఉన్నారు అనేది కాదు ముఖ్యం ప్రజలకు సహకారం అందిదా లేదా అనేది దీర్ఘకాలిక ప్రయోజనాలతో అన్ని వ్సవస్థలు ఆలోచించాయని సోము వీర్రాజు తెలిపారు.
రాజకీయాల కోసం రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపదని తేలింది : సత్యకుమార్
రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపదని తాజాగా ఇచ్చిన నిధుల ద్వారా స్పష్టమయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. గతంలో 22,500 కోట్లు రెవెన్యూ లోటు ఇవ్వడం జరిగిందన్నారు. నేడు 2014 15 రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య వివాదంలో ఉన్న వివరాలకు అనుగుణంగా రాష్ట్రం కోరిక మేరకు ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నేడు మరో 10 వేల కోట్లు ఇచ్చారన్నారు. మొత్తం కలిపి దాదాపు 33 వేల కోట్లు రెవెన్యూ లోటు కింద ఇవ్వడం జరిగిందని దీన్ని బిజెపి స్వాగతిస్తుందని ప్రకటించారు.
ఇవ్వకపోతే ఇవ్వలేదని అడగవచ్చు కానీ.. ఇస్తే ఇచ్చారనడం ఏమిటి ?: ఐవైఆర్
రాష్ట్రానికి ఇచ్చిన రూ. పది వేల కోట్ల లోటు భర్తీపై మాజీ చీఫ్ సెక్రటరీ , బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఇచ్చిన సహాయాన్ని ఒప్పుకొని రాని దాని కోసం ప్రయత్నించటం ఒక విధానమన్నారు. ఎంత ఇచ్చినా ఏమీ ఇవ్వలేదని నిందలు వేస్తూ ఇచ్చే దానికి అవకాశం ఉన్నదాన్ని కూడా రాకుండా చేసుకోవడం ఇంకొక విధానమన్నారు. రెండవ విధానం లో ఎల్లో మీడియా పాత్ర ఎనలేనిదని సెటైర్ వేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా ఇవ్వలేదని నిందలు వేసి.. నిధులు రాకుండా చేసుకున్న విషయాన్ని ఐవైఆర్.. తన స్పందన ద్వారా వ్యక్తం చేసినట్లయింది.
వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ద్రోహం చేయడమే : విష్ణువర్దన్ రెడ్డి
రాష్ట్రానికి ఇచ్చిన నిధుల పట్ల వ్యతిరేకంగా వార్తలు రాయడం.. రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేయడమేనని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. నిధులు ఇవ్వడం లేదని ఇంత కాలం నిందలు వేశారని.. ఇప్పుడు ఇచ్చారని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొంత మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం ఇలా చేయడం రాష్ట్రానికి ద్రోహం చేయడమేనన్నారు.
మీడియా వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు.. రాష్ట్రం కోసం పని చేయాలి !
రాష్ట్ర ప్రయోజనాల్ని వదిలేసి.. వ్యక్తుల ప్రయోజనాల కోసం పని చేస్తే మీడియా పతనావస్థలో ఉన్నట్లే. ఇలాంటి కథనాల ఓ పార్టీ కి మేలు.. మరో పార్టీకి నష్టం కలిగిస్తాయోమో కానీ..అంతిమంగా అది రాష్ట్రానికీ కూడా చేటు చేస్తుంది. ఇలా రాష్ట్రానికి చేటు చేయాలనుకోవడం మంచి మీడియా లక్షణం ఎలా అవుతుంది..? ఓ వ్యవస్థ పతనానికి అది సాక్ష్యం అవుతుంది. ప్రస్తుతం తెలుగు మీడియా అలాంటి పరిస్థితుల్లోనే ఉందని.. ఈ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చనిపుణులు అంటున్నారు.