రాయలసీమలో బీజేపీ బలంగా ఉంది. అయితే సరైన నాయకుల కొరత వల్ల కొంత మేర క్యాడర్ ను కలిపి ఉంచలేకపోయారు. ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించేది. అయితే నాయకత్వం ఉన్న చోట్ల చాలా వరకూ క్యాడర్ సమీకృతమయింది. గట్టి ఫైట్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇలాంటి నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ ఒకటి. అక్కడ భూమా కుటుబంం నుంచే ఓ బలమైన నేత బీజేపీ కోసం విస్తృతంగా పోరాడుతున్నారు. ప్రచార ఆర్భాటలకు పోకుండా.. వార్డు, గ్రామ స్థాయిలో పోరాటం చేసి.. బీజేపీని బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడు ఆళ్లగడ్డలో బీజేపీ కూడా బలమైన శక్తిగా ఉందంటే అతిశయోక్తి కాదు.
భూమా ఫ్యామిలీ నుంచి కిషోర్ రెడ్డి బీజేపీలో కీలక పాత్ర !
కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం టీడీపీలో ఉందని అనుకుంటారు. కానీ అదే కుటుంబానికి చెందిన భూమా కిశోర్ రెడ్డి, భూమా మహేశ్వర్ రెడ్డి, భూమా వీరభద్ర రెడ్డి తమ అనుచరులతో కలిసి నాలుగేళ్ల క్రితమే బీజేపీలో చేరారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు కిశోర్ రెడ్డి. మండల పరిషత్ మాజీ సభ్యుడు కూడా. భూమా నాగిరెడ్డి తరపున ఆయన రాజకీయ కార్యకలాపాల్లో చరుగ్గా పాల్గొనేవారు. తర్వాత అఖిలప్రియతో విబేధించి బీజేపీలో చేరారు. సొంతంగా రాజకీయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఆళ్లగడ్డలో పోటీ చేసి.. విజయం సాధించాలన్న పట్టదలగా ఉన్నారు. ఆయన బీజేపీని ఇంటింటికి చేర్చే కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపడుతున్నారు.
బలమైన నేతల్ని ఎదుర్కొని ధీటుగా కిషోర్ రెడ్డి పోరాటం !
ఆళ్లగడ్డ అంటే ఫ్యాక్షన్ గడ్డ. అక్కడి ఓటర్లు వర్గాలను చూసి ఓట్లు వేస్తారన్న అభిప్రాయం ఉంది. అలాంటి చోట.. పరిస్థితి మార్చాలన్న లక్ష్యంతో భూమా కిషోర్ రెడ్డి సోదరులు నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలో చేరినప్పటి నుండి ఆయన ప్రతీ గ్రామంలో తిరుగుతున్నారు. భూమా అఖిలప్రియ, ఆమె సోదరి, సోదరుడు వ్యక్తిగత జీవితాల్లో వివాదాలతో అనుచరుల్ని, వర్గాన్ని పట్టించుకునే తీరిక లేకుండా ఉన్నారు. దీంతో భూమా వర్గానికి కష్టాలు రాకుండా కిషోర్ రెడ్డే చూసుకుంటున్నారు. బలమైన గంగుల కుటుంబాన్ని తట్టుకుని భూమా వర్గాన్ని కాపాడుకుని రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ చేపట్టే కార్యక్రమాన్ని సీరియస్ గా నిర్వహిస్తున్నారు.
కిషోర్ రెడ్డికి ప్రజల సానుభూతి !
భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా ఆయన కోసం.. భూమా కిషోర్ రెడ్డి సోదరులు పని చేసేవారు. ప్రజలందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అది ఇప్పుడు వారికి బాగా ఉపయోగపడుతోంది. పైగా.. ముగ్గురు సోదరులు ఎప్పుడూప్రజల్లోనే ఉంటారు. విస్తృతంగా పర్యటిస్తున్నారు. సొంత ఖర్చుతో ప్రజల సమస్యలు తీర్చేందుకు కూడా వెనుకాడటం లేదు. దీంతో భూమా అఖిలప్రియ కన్నా ఆళ్లగడ్డలో ఇప్పుడు.. ఎవరికి సాయం అవసరం వచ్చినా కిషోర్ రెడ్డే గుర్తొస్తున్నారు. అందుకే ఈ సారి అక్కడ బీజేపీ ..కమలం వికసించే అవకాశం ఉందన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతోంది.