వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని నాగేంద్రబాబు చెబుతున్నారు కానీ.. అలా చెబుతున్నారంటే అర్థం పోటీ చేస్తానని చెప్పడమేనని జనసేనలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పార్టీ అభిమానుల కోరిక మేరకు పోటీ చేస్తున్నానని ప్రకటించి చివరి క్షణంలో నామినేషన్లు వేస్తారని అంటున్నారు. ఇందు కోసం ఓ ఎంపీ..ఓ ఎమ్మెల్యే సీటును రిజర్వ్ చేసుకున్నారని..ఎక్కడ పోటీ చేయాలనుకుంటే అక్కడ పొత్తుల్లో భాగంగా దాన్ని కేటాయింప చేసుకోవడానికి ఇప్పటి నుంచి లాబీయింగా చేస్తున్నారని అంటున్నారు.
అనకాపల్లి పార్లమెంట్ పై నాగబాబు కన్ను
ప్రజాప్రతినిధి అవ్వాలని ఎవరికి ఉండదు ? నాగబాబు లాంటి వారికి ఇంకా ఎక్కువ ఉంటుంది. గత ఎన్నికల్లో చివరి క్షణంలో నర్సాపురం నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ సారి పొత్తులు ఉంటాయని పవన్ కల్యాణ్ నేరుగా చెబుతున్నందున ఆయన ఈ సారి నర్సాపురం లాంటివి కాకుండా అనకాపల్లి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎంపీ అవ్వాలని ఆయన అనుకుంటున్నారు. అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేయాలన్న తన కోరికను పవన్ కు చెప్పారని అంటున్నారు. ఒక వేల ఎంపీ సీటు కుదరకపోతే.. భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ రెండింటి మీద దృష్టి పెట్టి అక్కడ క్యాడర్ తో సన్నిహిత సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
జనసేనలో కష్టపడిన వారికి షాకే !
జనసేన పార్టీలో అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాల్లో కష్టపడి పని చేసిన నాయకులు ఉన్నారు. భీమిలీ నుంచి పంచకర్ల సందీప్ గత ఎన్నికల్లో పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఆయన పార్టీ కోసం పని చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా భీమిలి సీటు జనసేనకు వస్తే తాను ఎమ్మెల్యే అయిపోయినట్లేనని ఆయన ఆశపడుతున్నారు. కానీ అంత తేలిగ్గా అది అయ్యేది కాదని.. నాగబాబు పోటీకి రావడంతో ఆయన నిరాశపడుతున్నారని అంటున్నారు. పొత్తుల్లో భాగంగా వచ్చే కొన్ని సీట్లు ఖాయంగా పలుకుబడి ఉన్న వారికే వెళ్తాయని .. జనసేన కోసం కష్టపడిన వారికి రావన్న అభిప్రాయం ఇప్పటికే జనసైనికుల్లో వినిపిస్తోంది.
ఇంతకీ పవన్ పోటీ చేసేది ఎక్కడ?
విశేషం ఏమిటంటే పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపై స్పష్టత లేదు. ఆయన ప్రత్యేకంగా ఓ నియోజకవర్గాన్ని ఎంచుకుని పని చేయడం లేదు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన రెండు చోట్ల ఆయన పర్యటించింది లేదు. ఈ సారి ఆయన మరింత సేఫ్ సీటు వెదుక్కోవాలని అనుకుంటున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే ఎక్కడైనా గెలుస్తారని అనుకుంటున్నారు. అయినా సరే రిస్క్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో పిఠాపురంలాంటి చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుున్నారు. మొత్తంగా పవన్ సీటుపై క్లారిటీ లేదు కానీ నాగబాబు మాత్రం ఓ సీటు మీద కర్చీఫ్ వేసుకున్నట్లుగా తెలుస్తోంది.