రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. రెండు వేల నోట్లను ఉపసంహరించాలని నిర్ణయించడంపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఎందుకంటే సామాన్యులు రెండు వేల నోటు చూసి చాలా కాలం అయింది. వ్యూహాత్మకంగా వీటి సర్క్యూలేషను చాలా కాలంగా ఆర్బీఐ నియంత్రిస్తూ వస్తోంది. నాలుగేళ్ల కిందటే ముద్రణ కూడా ఆపేసింది. బ్యాంకుల్లో కూడా ఇవ్వడం తగ్గించారు. ఇక ముందు ఇవ్వరు. మరి ఇప్పటి వరకూ చెలామణిలో ఉన్న నోట్లన్నీ ఎక్కడకు పోయాయి ?. ఈ సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. నిజంగానే ఆ డబ్బులన్నీ ..నోట్లన్నీ ఎక్కడికి పోయాయో కొంత మందికి తెలుసు. ఎన్నికల సమయంలో బయటకు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు ముందే బయటకు రావాలి.. లేకపోతే ఎందుకూ పనికి రావు.
ఓటుకు నోటు పంచేందుకు బండిల్స్ రెడీ చేసుకున్నారనే ఆరోపణలు
అవినితీ రాజకీయ నేతలు .. ఓట్లను కొనేందుకు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున నోట్లనే వినియోగిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో రెండు వేల కోట్ల పంపిణీ జరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనుకుంటున్న కొంత మందిరాజకీయ నేతలు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నగదు సేఫ్ జోన్లకు తరలించారని చెబుతున్నారు. అలాంటి వారికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం షాక్ ఇవ్వనుంది. ఆ నోట్లన్నీ మార్పించుకుంటే ఎక్కడివి అని ఐటీ, ఈడీ అడుగుతాయి. మార్పించుకోకపోతే మురిగిపోతాయి.
విపక్షాల ఆర్థిక అవసరాలు తీరుస్తామన్న నేతకు ఊహించనిషాక్!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు . అండగా ఉండే కాంట్రాక్టర్లకు కొదవు లేదు. ఓ ప్రభుత్వ పెద్ద అయితే.. ప్రధానమంత్రి అభ్యర్థిగా తనకు మద్దతిస్తే కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టుకుంటానని అన్ని రాజకీయ పార్టీలకూ హామీ ఇచ్చారని చెబుతున్నారు. అంటే ఆయన వద్ద ఎంత ధనం పోగుపడి ఉంటుందో అంచనా వేయడం కష్టం కాదు. లక్షల కోట్లు అప్పు చేసి నిర్మించిన ప్రాజెక్టులు ఒకే కాంట్రాక్టర్ కు ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని భూ లావాదేవీలపై లెక్కలేనన్ని వివాదాలున్నాయి. వీటి మీద పోగేసిన నల్లధనం మొత్తం ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది. కొసమెరుపేమిటంటే..ఈ పార్టీ ఆధ్వర్యంలో నడిచే మీడియా సంస్థల్లోని సిబ్బందికి సగం జీతం బ్యాంకులో వేస్తారు.. సగం జీతం నగదు రూపంలో ఇస్తారు. అక్కడే అసలు బ్లాక్ మనీ ఎలా సర్క్యూలేట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చంంటున్నారు.
ఇసుక , మద్యం మొత్తం నగదులోనే లావాదేవీలు చేసే రాష్ట్రంలో ఇంకెంత నగదో ?
మరో వైపు తెలుగు రాష్ట్రాల్లోనే ఓ చోట మద్యం లావాదేవీలు మొత్తం నగదు రూపంలోనే జరుగుతాయి. ఎంత వసూలవుతోంది..అనేది అనేది ఎవరికీ తెలియదు. మద్యం తయారీ నుంచి అమ్మకం వరకూ మొత్తం ఒకే మాఫియా చేతుల్లో ఉండటంతో ఎంత మేర బ్లాక్ మనీ తరలి పోతుందో చెప్పడం కష్టం. అలాగే.. ఇసుక .. ఇతర ఖనిజాల విషయంలోనూ. నగదు లోనే లావాదేవీలు జరుగుతూండటంతో చాలా వరకూ అలా వచ్చిన బ్లాక్ మనీని వచ్చే ఎన్నికల్లో పంచడానికి రెడీ చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్ననిర్ణయంతో షాక్ కు గురికాక తప్పదంటున్నారు.
మొత్తం క్లీన్ ఎలక్షన్స్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కేంద్ర వ్యవస్థలన్నీ ఒక్కో అడుగు ముందుకేస్తున్నాయి. అవినీతి రాజకీయ నాయకల గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేస్తున్నాయి.