రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. శుక్రవారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకు లావాదేవీల్లో రూ. 2 వేల నోటను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. జనం దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు ఒక ప్రణాళికను సైతం రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకుల్లో రద్దీ పెరిగి రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకుగాను.. మంగళవారం (మే 23) నుంచి సెప్టెంబరు 30 దాకా ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను రూ.20 వేల పరిమితికి మించకుండా మార్చుకోవచ్చని వెల్లడించింది. డిపాజిట్లు మాత్రం నిబంధనల ప్రకారం చేసుకోవచ్చని హామీ ఇచ్చింది.
ఎంత సొమ్ము ఉంది..
రూ.2000 డినామినేషన్ నోట్లలో దాదాపు 89% మార్చి 2017కి ముందు జారీ చేశారు. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలుగా అంచనా వేశారు. మార్చి 31, 2018 నాటికి చెలామణిలో ఉన్న నోట్లలో 37.3% అంటే గరిష్టంగా ఉన్న రూ.6.73 లక్షల కోట్ల నుంచి చెలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ రు.3.62 లక్షల కోట్లకు తగ్గింది. మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8% మాత్రమే. . ఈ విలువ సాధారణంగా లావాదేవీలకు ప్రయోజనకరం కాదని, ప్రజల కరెన్సీ అవసరాలు తీర్చడానికి రూ.2,000 నోటు ఉపయోగకరంగా లేవని గుర్తించినందునే వాటిని ఉపసంహరించుకోవాలని తీర్మానించారు.
తర్వాత కూడా చెలామణి
రూ.2000 నోటుకు సెప్టెంబరు 30 తుది గడువేమీ కాదు. తర్వాత కూడా వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు వీలుగా గడువును పొడిగించే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి పైగా దశలవారీగా ఉపసంహరించాలన్న సంకల్పమే మినహా.. వాటిని తమ వద్ద ఉంచుకున్న వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని ఆర్బీఐ అంటోంది సెప్టెంబురు 30 తర్వాత కూడా రూ.2,000 నోట్లను వాడుకోవచ్చని ప్రకటించింది. అందుకే తొందరపడి బ్యాంకుల ముందు బారులు తీరాల్సిన అవసరం లేదని, నిదానంగా కూడా మార్చుకోవచ్చని తేల్చేసింది. పైగా ఇప్పుడు కూడా ఆ నోట్లతో లావాదేవీలు జరుపుకునేందుకు ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తున్నాయి. 2016 నవంబర్ లో రూ. 1000, రూ.500 బ్యాంకు నోట్లను రద్దు చేసి రూ. 2000 నోటును ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రజల ముందుకు వచ్చి ప్రకటన చేశారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఆర్బీఐ ద్వారా ఈ ప్రకటన చేయించారు. అంతేకాదు, మార్పిడికి సెప్టెంబర్ 30 దాకా సమయం ఇవ్వడం ద్వారా.. ప్రజలు బ్యాంకుల ముందు క్యూలలో నిలబడనవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాక.. 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2000 నోటు ముద్రణను నిలిపివేసి, ఇతర కరెన్సీలలో తగిన మొత్తంలో డబ్బులు లభ్యమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ వర్గాలు వివరించాయి.
నిల్వచేసుకున్న వారికి కష్టమేనా…
బ్లాక్ దందా చేస్తూ భారీగా నగదు నిల్వ చేసుకున్న వారికి ఇప్పుడు కొంత మేర కష్టాలు ఎదురు కావచ్చు. కాకపోతే అది పరిమిత స్థాయిలోనే ఉంటుందనుకోవాలి. ఏకమొత్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన పక్షంలో ఆదాయ పన్ను శాఖ నుంచి సమన్లు వచ్చే అవకాశం ఉంది. రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేసినప్పుడు చాలా మంది అడ్డదారులు తొక్కి నగదు మార్చుకున్నారు. కొందరికి కమిషన్లు ఇచ్చి నగదు మార్పిడి చేయించుకున్నారు. ఇప్పుడా పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే అప్పట్లో వ్యాపార లావాదేవీలకు రూ.500 నోటును ఆపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా లావాదేవీలు కొనసాగించుకోవచ్చని తెలిపింది.
పెరగనున్న డిజిటల్ పేపెంట్స్
ఆర్బీఐ నిర్ణయాన్ని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ స్వాగతించారు. ఆదాయపన్ను దాడుల్లో భారీగా రూ.2000 నోట్లు పట్టుబడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. పైగా ఇప్పుడే దేశంలో దాదాపు 50 శాతం మందికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దానితో నగరాలు, పట్టణాల్లో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. కరెన్సీ వినియోగం, అందులోనూ పెద్ద నోట్ల అవసరం తగ్గిపోయింది. అందుకే రూ.2,000 నోటు ఉపసంహరిస్తున్నారని సుబ్రమణియన్ అంటున్నారు. నిజానికి 2026 నాటికి డిజిటల్ లావాదేవీలు మూడు రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అప్పుడు నోట్ల అవసరం పెద్దగా ఉండకపోవచ్చు..