మహాత్ముడేలిన పుణ్యప్రదేశం అని మన కవులు రాస్తుంటారు. దేశంలో గాంధీజీ నేర్పిన అహింసాయుత సహజీవనానికి అది నిదర్శనం. జనం గాంధేయమార్గంలో ప్రయాణించడం వల్లే ఇప్పుటికీ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెప్పక తప్పదు. బీజేపీ నాయకుడు, దేశ ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనల్లో తరచూ గాంధేయ మార్గాన్ని ప్రస్తావిస్తారు. అదీ భారతీయులకే కాకుండా ప్రపంచం మొత్తానికి ఆచరణీయమని మోదీ అంటారు.
హీరోషిమాలో గాంధీ విగ్రహం
భారత ప్రధాని ఇప్పుడు జపాన్ పర్యటనలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణు బాంబు దాడికి గురైన హీరోషిమా నగరంలో జరుగుతున్న జీ-7 సదస్సుకు ఆయన హాజరయ్యారు. అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీబొమ్మను చూసినప్పుడల్లా అహింసా మార్గం మదిలో మెదులుతుందని మోదీ అన్నారు. అందరూ గాంధీ మార్గంలో నడిస్తే హిరోషిమా లాంటి ఘటనలు ఉండేవి కాదని మోదీ అభిప్రాయపడ్డారు.
జపాన్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు
గాంధీజీ వెళ్లిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా విదేశీయులు ఆయన్ను గుర్తు చేసుకోవడం ముదావహమే అవుతుంది. తధాగతుడు నేర్పిన అహింస, గాంధీజీ ప్రవచించిన అహింసను వారు పాటించాలనుకోవడం అందుకు గుర్తుగా మహాత్ముని విగ్రహం పెట్టడం..నిజానికి అది బారతీయులందరికీ గర్వకారణమనే చెప్పాలి. మోదీ కూడా అదే తరహాలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఆయన అగ్రగణ్యుడు. హిరోషిమాలో గాంధీ విగ్రహం పెట్టాలనుకోవడమే ఓ పురోగామి నిర్ణయమని మోదీ ప్రశంసించారు.
వాతావరణ ఉగ్రవాదంపై అహింసాయుత పోరాటం
ప్రధాని మోదీ తన ప్రసంగంలో వాతావరణ మార్పులు, ఉగ్రవాదంపై ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. వాతావరణంలో గణనీయమైన మార్పుల ద్వారా గ్లోబల్ వార్మింగ్ కు పాల్పడే వారు కూడా ఉగ్రవాదులేనని మోదీ సర్మగర్భంగా వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై పోరాటంలో గాంధీయవాదం పురోగామి మార్పుకు నాంది పలుకుతుందని మోదీ అన్నారు. నిజానికి గ్లోబల్ వార్మింగ్ కు అనేక కారణాలున్నాయి. అందులో 90 శాతం మానవ తప్పిదాలే అవుతాయి. కర్బణ ఉద్గారాల కారణంగానూ, మితిమీరిన కాలుష్యంతోనూ ఆ పరిస్థితి దాపురిస్తుంది. అందుకే వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ సముద్ర జలాలు వేడెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ మనిషిపై ఉందని మోదీ పలు పర్యాయాలు ప్రస్తావించారు. హిరోషిమాలో కూడా మోదీ అదే విషయాన్ని చెప్పారు.
బౌద్ధ వృక్షం శాంతి చిహ్నం
జపాన్ ప్రధాని భారత పర్యటనకు వచ్చినప్పుడు మన ప్రభుత్వం బౌద్ధ వృక్షం (రావి చెట్టు )ను శాంతి సందేశంగా ఆయనకు అందించారు. ఆ చెట్టును జపాన్ తీసుకెళ్లారు. అక్కడే నాటారు. అదే ఇప్పుడు మహావృక్షమై కూర్చుంది.ఆ బౌద్ధ వృక్షాన్ని చూసేందుకు వచ్చే ప్రతీ సందర్శకుడికి శాంతి సందేశం అందుతూనే ఉంటుంది. అది భారతీయత. మన దేశం ప్రపంచానికి ఇచ్చిన శాంతి సందేశం కూడా అదే.ఆ బౌద్ధ వృక్షాన్ని మోదీ ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. మోదీ మంచి వక్త కావడంతో జపానీయులకు సైతం గాంధీజీ సందేశం సులభంగా అర్థమైందని చెబుతున్నారు..