చావడం ఓడిపోవడమే – గెలిచి చూపించడమే జీవితం !

పరీక్షల్లో ఫెయిల్ అయినా .. స్నేహితులు అనుమానించారని అనుకున్నా.. ప్రేమ విషయాల్లో చిన్న ఎదురు దెబ్బలు తగిలినా ప్రాణాలు తీసుకోవడం అనేది ఇప్పుడు చాలా చిన్న విషయంగా మారిపోయింది. ప్రతీ రోజు మీడియాలో ఎంతో భవిష్యత్ ఉన్న యువత ఆత్మహత్యల ఘటనలు ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నాయి. ఇవి అంతకంతకూ పెరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత యువత జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. వారి వ్యక్తిగత జీవితాల్లో తొందరపాటుతో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో వారికి మొదటగా వస్తున్న ఆలోచన ఆత్మహత్య. కానీ అసలు చేస్తున్న తప్పే అది అని వారు గుర్తించలేకపోతున్నారు.

ప్రతీ చిన్న విషయానికీ ఆత్మహత్యలు

పరీక్షా ఫలితాల తర్వాత పదో తరగతి పిల్లలు.. ఇంటర్ పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశారు. ప్రేమ వ్యవహారాలతో ఆత్మహత్య చేసుకున్న వారూ అధికంగానే ఉంటున్నారు. మూడు రోజుల కిందట ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దానికి వేరే అబ్బాయి కారణం అంటూ అందరూ అనుమనంగా చూడటంతో అతను భరించలేకపోయారు. తాను కారణం కాదని.. కొన్ని సాక్ష్యాలుగా వాట్సాప్ మెసెజులు పెట్టి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి ఇవి ప్రాణాలు తీసుకునేంత విషయాలా అంటే.. అసలు ఏ కారణమూ ప్రాణం తీసుకునేంత పెద్దది కాదని ఎవరైనా చెబుతారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో లోకజ్ఞానం తెలియని వీరు ప్రాణం తీసుకోవడమే సమస్యకు పరిష్కారం అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?

జీవితంలో కష్టాలు, నష్టాలు లేని వారుంటారా?

వ్యక్తిగత జీవితంలో సమస్యలు లేని వారంటూ ఎవరైనా ఉంటారా ? నాకే ఎందుకు ఇలా అంటూ ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికీ కష్టాలు ఉంటాయి. డబ్బులు ఉన్న వాళ్లకు కష్టాలుండవా ? అదే నిజం అయితే ఎంతో మంది డబ్బున్న వారు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు ? సమస్య డబ్బు కాదు. అసలు సమస్య మానసికమైనదే. మనిషి జీవితంలో ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సమస్య మనిషి తనకు తాను సృష్టించుకున్నదే. పరిష్కారం లేని సమస్య ఉండదు. అందు కోసం కష్టపడాల్సి ఉంటుంది. మానసికంగా ధృడంగా మారాల్సి ఉంటుంది. ప్రశాంతంగా అసలు సమస్యకు మూలం గుర్తించి .. అనుగుణంగా పరిష్కారం చేసుకుంటే.. అది అసలు సమస్యే కాదని అవగతమవుతుంది.

తల్లిదండ్రులు ఇచ్చే జన్మను ముగించుకునే హక్కు లేదు !

ఆత్మహత్యా మహా పాతకం అంటారు. తల్లిదండ్రులు ఓ జన్మని ప్రసాదించారు. దాన్ని అర్థంతరంగా ఆపేసుకునే హక్కు ఎవరికీ లేదు. తన వంతు పాత్ర పోషించాలి. తను బాగుపడాలి. తను బాగుపడితే ఆటోమేటిక్ గా సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే అందరూ సమాజంలో భాగస్వాములు. అందరూ ధైర్యంగా జీవితాన్ని గడిపితే.. సమాజం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది.కానీ టెక్నాలజీలో మునిగి తేలుతున్న యువత రాను రాను సున్నిత మనస్కులుగా మారిపోతున్నారు. తాము ఓడిపోతామేమో… నిందితుుగా అయిపోతున్నామో.. అనే భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి యువత బయటకు రావాలి. మానసికంగా ధైర్యంగా అవడమే అసలైన విజయం.

అసలు ఓటమి ఆత్మహత్య ఆలోచనే.. !

పరీక్షల్లో ఫెయిల్ కావడం… అమ్మాయిల ప్రేమను పొందలేకపోవడం లేదా నిలబెట్టుకపోవడం ఇవన్నీ జీవితంలో భాగం. కష్టాలు నష్టాలు అన్నీ జీవితంలో భాగం. వాటిని అలాగే తసుకోవాలి అంతే కానీ… అవి జరిగాయి కదా అని.. జీవితాన్ని అక్కడితో నిలిపివేయాలనుకోవడం అసలైన ఓటమి. అలా చేస్తే ఆత్మీయులు ఒక్క రోజు ఏడుస్తారు. తర్వాత మర్చిపోతారు. కానీ ఈ ప్రపంచంలో లేకుండా పోయేది ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తే. గుర్తించి జీవితాన్ని ఆస్వాదిస్తే.. అంతా అనందమే.

అందుకే ఆత్మహత్య ఆలోచనలు వస్తే .. ఏ మాత్రం ఆలోచించకుండా కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఆత్మీయులతో మాట్లాడాలి. పెద్దలతో ఎక్కువ సమయం గడపాలి.