సౌండ్ లేని కొడాలి నాని – చార్జ్ షీట్‌పై చర్చకు భయపడ్డారా ?

గుడివాడ బస్టాండ్ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి చర్చకు సిద్దమని కొడాలి నానికి ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి చేసిన సవాల్‌కు కొడాలి నాని కానీ వైసీపీ కానీ స్పందించలేదు. ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటే ఏర్పడే తదుపరి పరిణామాలపై కొడాలి నానికి అవగాహన ఉందేమో కానీ ఆయన విష్ణువర్దన్ రెడ్డి సవాల్ పై సైలెంట్ గా ఉండిపోయారు. గన్నవరంలో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం కోసం బీజేపీ అగ్రనేతలంతా కృష్ణా జిల్లాలోనే ఉంటారు. ఇలాంటి సందర్భంలో బహిరంగ చర్చ పెట్టుకుంటే పరువు పోతుందన్న ఉద్దేశంతో సైలెంట్ గా ఉండిపోవడం మంచిదని కొడాలి అనుకున్నట్లుగా చెబుతున్నారు.

గుడివాడలో అంతా దందాలే అభివృద్ధి నిల్ !

గుడివాడ నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొడాలి నాని ఏళ్ల తరబడి వరుసగా గెలుస్తూ తన వికృత రాజకీయాలకు వేదికగా గుడివాడను వాడుకుంటున్నారు. గుడివాడ రౌడీగా కనిపిస్తారని ఆయన మిత్రుడు పేర్ని నాని సరదాగా చెప్పినా నిజం అదే. రౌడీయిజంతో అందర్నీ బెదిరించి.. గుడివాడను అన్ని రకాల అవలక్షణాలకు వేదికగా మార్చారు. సంక్రాంతి సమయంలో కేసినోలే పెట్టారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. గుట్కా ,మట్కాల దగ్గర్నుంచి గుడివాడలో జరగని అసాంఘిక కార్యక్రమాలే ఉండవంటే అతిశయోక్తి కాదు. పేకాట శిబిరాలపైఓ సారి పోలీసులు దాడి చేస్తే ఫైన్ కట్టేసి మళ్లీ ఆడుకుంటామని నేరుగా చెప్పిన నిజాయితీ ఆయన సొంతం.

కొడాలి నాని ఇంటి ముందు రోడ్డే అధ్వాన్నం

ఇరవై ఏళ్లుగా గుడివాడను పట్టుకుని వేలాడుతున్న కొడాలి నాని నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. కనీసం రోడ్లు కూడా వేయించలేకపోయారు. చిన్న వర్షం వస్తే గుడివాడ బస్టాండ్ నీట మునిగిపోతుంది. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా రోడ్లు అనే వే కనిపించవు. గుంతలే ఉంటాయి. గుంతల్నే రోడ్లు అనుకోవాలి. చివరికి ఆయన ఇంటికి వెళ్లే దారి కూడా దారుణంగా ఉంటుంది. అయితే ఇలాంటివేమీ ఆయన పట్టించుకోరు. తన దందాలు.. పేకాట లాంటి వాటికి అడ్డం వస్తే మాత్రం ఊరుకోరు. ఇక ఎవరనైనా ప్రశ్నిస్తే మాత్రం బూతులతో విరుచుకుపడతారు.

కొడాలి నాని వదిలి పెట్టే ప్రశ్నే లేదంటున్న బీజేపీ నేతలు

ఇష్టం వచ్చినట్లుగా తమ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని వదిలి పెట్టే ప్రశ్నే లేదని బీజేపీ నేతలంటున్నారు. గన్నవరంలో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వైసీపీపై పూర్తి స్థాయి పోరాటానికి ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. ఈ క్రమంలో గుడివాడలో కూడా భారీ కార్యక్రమం రూపకల్పనపై చర్చించే అవకాశం ఉంది. బహిరంగచర్చకు కొడాలి నాని రాకపోయినా.. బీజేపీ మాత్రం నాని బండారాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.