గుడివాడ బస్టాండ్ దగ్గరే తేల్చుకుందాం.. ఒక్కడివే అయినా కట్టకట్టుకుని అయినా వచ్చిన సరే రెడీ అని ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి కొడాలి నానికి సవాల్ చేశారు. కొడాలి నాని భాష వల్ల రాష్ట్ర పరువు దేశవ్యాప్తంగా పోతోంది. ఇలాంటి ఎమ్మెల్యేను బీజేపీ అధికారంలోకి రాగానే జైల్లో వేస్తామని ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ప్రకటించారు. గుడివాడలో ప్రజా చార్జిషీట్ కార్యక్రమంలో వందల మంది తమ సమస్యలపై చార్జిషీట్ ను బీజేపీ నేతల వద్ద దాఖలు చేశారు. వారి సమస్యలను చూసిన సునల్ ధియోధర్.. కొడాలి నాని తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే నోరు మత్రమే ఉన్న కొడాలి నాని.. తర్వాత ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై విష్ణువర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనపై చర్చలకు రావాలన్న విష్ణవర్ధన్ రెడ్డి
విశాఖలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కొడాలి నాని భాషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ అభివృద్ధి, వైసీపీ పరిపాలనా వైఫల్యాలు అన్నింటిపై బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. శుక్రవారం గన్నవరం బస్టాండ్ దగ్గరకు వస్తే ప్రజా చార్జిషీట్‌పై చర్చిద్దామని సవాల్ చేశారు. కొడాలి నాని ఒక్కరే వచ్చినా.. కట్టకట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినా తాును రెడీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. కనీసం గుడివాడలోనైన పూర్తయ్యాయని చెప్పగలరా..? అంటూ సవాల్ చేశారు.
ఆస్తుల విరవాలు బయట పెట్టాలని డిమాండ్
వైసీపీ నేతలంతా రాష్ట్రంపై పడి దోచుకుంటున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ, తమ బంధువుల ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో బయట పెట్టాలన్నారు. గుడివాడలో ఒక్క అభివృద్ధి పని జరగలేదు కానీ.. కబ్జాలు, దందాలు, కేసినోలకు మాత్రం లోటు లేదన్నారు. ప్రజల్ని వ్యసనాలకు బానిసల్ని చేసి వారిని కొడాలి నాని దోచుకుంటున్నారని మండిపడ్డారు. గుడివాడలో సమస్యలు లెక్కలేనన్ని ఉన్నాయని అక్కడి ప్రజలు ప్రజా చార్జిషీట్లో భాగంగా బీజేపీ నేతలకు ఫిర్యాదులు ఇచ్చారు. వాటిపై సునీల్ ధియోధర్ మాట్లాడితే.. కొడాలి నాని అనుచితంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విష్ణువర్ధన్ రెడ్డి సవాల్‌పై కొడాలి నాని ఎలా స్పందిస్తారోనని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
వైసీపీకి అనుకూలమైన ఓటే లేనప్పుడు ఇక చీలిక ఎక్కడ ?
2024లో రాష్ట్రంలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలమైన ఓటే లేనప్పుడు.. చీలిక అనే ప్రస్తావనే రాదన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీ.. ఇప్పుడు స్నేహం కోసం వెంపర్లాడుతోందంటూ సెటైర్లు వేశారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలవబోతోందని జోస్యం చెప్పారు.. మరోవైపు.. ఏపీలో తాగడానికి నీళ్లు లేవు.. కానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శించారు. శుక్రవారం గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుతోంది.. 2024 ఎన్నికల మీద కీలకమైన చర్చ జరుగుతుందని.. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుందని ప్రకటించారు.