సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. తమిళనాడు సంప్రదాయ పండుగ క్రీడ జల్లికట్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టం సమర్థనీయమని ధర్మాసనం పేర్కొంది..
శతాబ్దంగా కొనసాగుతున్న జల్లికట్టు
తీర్పు సందర్భంగా జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. శతాబ్దం కాలంగా జల్లికట్టు కొనసాగుతుందని తాము విశ్వసిస్తున్నట్లు జస్టిస్ జోసఫ్ తేల్చేశారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సహేతుకంగా ఉన్నాయని ఒప్పుకున్నారు. అయితే సువిశాల తమిళ సంస్కృతిలో జల్లికట్టు భాగమా,కాదా అన్నది మాత్రం చెప్పలేమని , అది న్యాయస్థానం విధుల్లో భాగం కాదని సుప్రీం కోర్టు అంటోంది. జల్లికట్టు సాంస్కృతిక వారసత్వం కాదంటూ కొందరు వేసిన పిటిషన్లను బెంచ్ తోసిపుచ్చింది. వారి సమర్పించిన ఆధారాలు వారికి అనుకూల తీర్పు ఇచ్చేందుకు సరిపోవని కోర్టు చెప్పింది. నిజానికి ఒక తమిళనాడు జంతు హక్కుల సంఘం ఈ పిటిషన్ వేసింది. తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు అనుమతిస్తూ చేసిన చట్టాన్ని వారు ఛాలెంజ్ చేశారు. జల్లికట్టు తమిళనాడు సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిబింబమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అసలేం జరిగింది..
జల్లికట్టుపై తమిళనాడులో చాలా కాలంగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పొంగల్ పండుగ రోజుల్లో ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడగా ఇదీ కొనసాగుతోంది. దీని వల్ల ఎద్దులకు హాని ఉందని, మనుషులకు ప్రాణ హాని ఉందని వాదన వినిపిస్తూనే ఉంది. తమిళనాడులోని అలంగానల్లూరు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు వరకు జల్లికట్టు మాత్రం ఆగడం లేదు. ప్రతీ సంక్రాంతికి జల్లికట్టు ఆటలో వందల మంది గాయపడుతున్నారు. కనీసం ఏడెనిమిది మంది చనిపోతున్నారు. దానితో ఒక సందర్భంలో కోర్టులు అభ్యంతరం చెప్పడంతో జల్లికట్టుకు అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వమని, ఆర్టికల్ 29 (1) ప్రకారం జల్లికట్టుకు రక్షణ కల్పిస్తూ తమిళనాడు చట్టం చేసింది. దానిపై జంతు హక్కుల ఉద్యమకారులు కోర్టుకెక్కారు. 1960 నాటి జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం జల్లికట్టుతో పాటు కర్ణాటక ,మహారాష్ట్రల ఎద్దుల బండి పందేల చట్టాలు జంతువుల పట్ల క్రూరత్వాన్ని పెంచి పోషిస్తాయని వాదించారు. అయితే ఇప్పుడు ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం మాత్రం జల్లికట్టును సమర్థించింది.
జంతు ప్రేమికుల అభ్యంతరం
ఎద్దుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారన్న సంగతి సుప్రీం ధర్మాసనం అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమని పీపుల్స్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ ప్రతినిధి అంబికా సుక్లా అభిప్రాయపడ్డారు. ఆ క్రూరత్వం సుప్రీం కోర్టుకు అర్థం కాలేదన్నారు. జల్లికట్టు బ్లడ్ స్పోర్ట్ కాదని ప్రకటించడం అన్యాయమే అవుతుందని ఆమె అన్నారు. జంతువుల రక్తం కళ్ల చూసేందుకు జల్లికట్టు నిర్వహించరని, ఆటలో ఆలా జరిగిపోతుందని కొందరు వాదించడం పట్ల ఆమె అభ్యంతరం చెప్పారు. జంతువులను హింసిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. అవి భయంతో వణికిపోతున్నా.. జనానికి ఎందుకు అర్థం కావడం లేదన్నదే ఆమె ప్రశ్న…