పూర్వకాలం బ్రేక్ ఫాస్ట్, లంచ్,డిన్నర్ అంటే ఏ పూటకి ఆ పూట మెనూలు ఉండేవి కాదు. రాగిపిండి ముందురోజు రాత్రి నానెబెట్టి పొద్దున్నే ఉడకబెట్టి అందులో తెలకపిండి ఒడియం నంజుకుని తినేవారు. ఇక లంచ్ విషయానికొస్తే ఉల్లిపాయ-మిరపకాయ నంజుకుని వేడి వేడి గంజీఅన్నం ఆరగించేవారు. నిజంగా వీటి రుచి ముందు పంచభక్ష్య పరమన్నాలు ఏం సరిపోతాయ్ అన్నట్టుండేది. ఎందుకంటే పులియబెట్టిన రాగిపిండి అంబలి శరీరానికి పుష్కలమైన పోషకాలు అందిస్తుంది…గంజీ అన్నం గురించి ఇక చెప్పేదేముంది..నిత్యం ఇది తింటే మందులే వాడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ వచ్చిన తర్వాత అదో ఫ్యాషన్, ట్రెండ్ అనే పేరుతో ఆరోగ్యాలని తాకట్టుపెట్టుకోవడం మొదలెట్టారు. కరోనా కల్లోలం తర్వాత కానీ మళ్లీ ఆలోచన మారలేదు…సంపాదన, ట్రెండ్ కాదు ఆరోగ్యం ముఖ్యం అని జ్ఞానోదయం అయింది. అందుకే ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు అనేక మార్గాలు వెతుకుతున్నారు. తీసుకునే ఆహారంలో మార్పులూ చేర్పులూ చేసుకుంటున్నారు. గ్రీన్ ట్రీ, బ్రౌన్ రైస్, మొలకలు ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి…ఈ లిస్టులో ఒకటి రెడ్ రైస్..
ఏంటీ ఎర్రబియ్యం ( రెడ్ రైస్)
బియ్యం అనగానే తెల్ల రంగు, బ్రౌన్ రైస్ గుర్తుకొస్తాయి. అయితే ఇటీవల మార్కెట్లో ఎర్రబియ్యం, నల్ల బియ్యం వచ్చాయి. ఎక్కువ మంది వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆంథోసయనిన్ అనే యాంటీఆక్సిడెంట్ కాంపౌండ్ పుష్కలంగా ఉండటం వల్లనే ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. ఒకప్పుడు వైట్ రైస్ కు హెల్తీ ఆల్టర్నేటివ్ గా బ్రౌన్ రైస్ ను మాత్రమే పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు బ్రౌన్ రైస్ కి మించి రెడ్ రైస్ అంటున్నారు. దీనిలో ఉండే యాంతోసైనిన్ల వల్ల నీటిలో కరిగిపోయే పిగ్మెంట్స్ వల్ల దీనికి ఈ రంగు వచ్చింది. మీకు వెయిట్ లాస్ విషయంలో కూడా సహాయం చేస్తుంది. ఇంకా రెడ్ రైస్ తో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి.
వెయిట్ లాస్
బరువు తగ్గాలి అనుకునేవారు డైట్ లో భారీమార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. తగ్గేందుకు డైట్ లో ఎటువంటి ఛేంజెస్ చేసుకోవాలో తెలీక తికమకపడేవారు రెడ్ రైస్ ను తినడం స్టార్ట్ చేయండి. ఇది వెయిట్ లాస్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫ్యాట్ కంటెంట్ సున్నా. కాబట్టి, దీన్ని తినడం వలన బరువు పెరుగుతారేమోనన్న భయం అవసరం లేదు.
చర్మ సౌందర్యానికి మంచిది
రెడ్ రైస్ లో విటమిన్ , ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ రెండూ శరీరంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ను పెంచుతాయి. దాంతో స్కిన్ హెల్దీగా మారుతుంది. రైస్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ పై పోరాటం జరుపుతాయి. అందుకే చర్మ సౌందర్యానికి మంచిది.
డయాబెటిస్
రెడ్ రైస్ లో మ్యాంగనీజ్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి డయాబెటిస్ పేషంట్స్ కు అవసరం. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచేందుకు చాలా ఉపయోగపడుతుంది.
డైజెషన్
రెడ్ రైస్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇది డైజేషన్ ప్రాసెస్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మాటిమాటికీ కలిగే చిరు ఆకలి సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి, జంక్ ఫుడ్ పై మనసు వెళ్ళదు.
ఆస్త్మా
రెడ్ రైస్ లో మెగ్నీషియం శ్వాశలో ఉండే సమస్యను నివారిస్తుంది, బోన్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది.
అలసట తగ్గుతుంది
రెడ్ రైస్ లో ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల రోజూ ఈ రైస్ తింటే శరీరంలో ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరుగుతుంది. మరింత ఎనర్జిటిక్ గా ఫీలవుతారు..అస్సలు అలసట దరిచేరదు. ఇమ్యూనిటీ బూస్టవుతుంది.
గమనిక: ఆరోగ్యానికి మంచిదని అతిగా తినకూడదు. రెడ్ రైస్ ను కూడా మితంగానే తీసుకోవడం మంచిది..అతిగా తీసుకుంటే అరుగుదల సమస్య వస్తుంది. ఆహారంలో ఏ మార్పులు చేసుకోవాలి అనుకున్నా వైద్యులను సంప్రదించిన తర్వాతే చేయడం మంచిది