కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఓ వైపు విపక్షాలు .. మరో వైపు ఓ వర్గం మీడియా చిత్ర, విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. రకరకాల మ్యాపులు ప్రచారంలోకి తెస్తున్నారు. అందులో బీజేపీ రంగు కాషాయం తగ్గిపోతోందని లెక్కలు చెబుతున్నారు. నిజానికి వీరి హడావుడి చూస్తే 2018లో విపక్షాలు చేసిన హడావుడి గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఇక బీజేపీ పనైపోయిందని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక తామే ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఖాయమని చంద్రబాబు దగ్గర్నుంచి మమతా బెనర్జీ వరకూ అందరూ లైన్లో నిలబడి చేతులెత్తే కార్యక్రమాలు చేశారు. చివరికి ఎన్నికలయ్యే సరికి అందరూ చేతులెత్తేశారు. బీజేపీ ఒక్కటే 303 స్థానాలు సాధించింది. అది అంతకు ముందు సాధించిన విజయం కంటే ఎక్కువ.
2019కి ముందు కూడా బీజేపీకి కొన్ని ఎదురు దెబ్బలు
భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలు నమోదు చేస్తూనే ఉంది కానీ.. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కొద్ది తేడాతో ఓడిపోయింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ఏడాది ముంద జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాలతో పరాజయం పాలైంది. 2018లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ అప్రజాస్వామిక పొత్తులతో బీజేపీకి కాంగ్రెస్, జేడీఎస్ అధికారన్ని దూరం చేశాయి. కానీ వారిద్దరికీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు. ఒక్కో పార్లమెంట్ సీటు మాత్రమే వారికి ఇచ్చారు. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఎన్నికల్లోనూ బీజేపీ పరాజయం పాలైంది. అదే సమయంలో యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిస్తే దున్నేయడమే అనుకున్నారు. అందుకే అందరూ ప్రధానమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ వ్యతిరేక మీడియాను అడ్డం పెట్టుకుని ఇక బీజేపీ పనైపోయిందని ప్రచారం చేశారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది ?. బీజేపీ తిరుగులేని విజయం సాధించింది.
దేశంలో తిరుగులేని బలమైన స్థానంలో బీజేపీ !
ఈశాన్య భారతదేశం సిక్కింతో సహా 8 రాష్ట్రాల్లో మొత్తం 25 మంది ఎంపిల్లో బిజెపికి 15 మంది ఎంపిలు అంటే 60 శాతం మంది ఉన్నారు. ఒకప్పుడు ఈనాశ్య రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు ఉండేది కాదు.. ఇప్పుడు బీజేపీ తప్ప మరో పార్టీ గెలుస్తుందా అన్నంతగా అక్కడ బీజేపీబలపడింది. ఒక్క రాష్ట్రం తప్ప అన్నీ బీజేపీ కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి. పశ్చిమ భారతదేశంగా చెప్పుకునే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లలో మొత్తం 99 మంది ఎంపిలలో 73 మంది బిజెపికి చెందిన వారు, అంటే 72 శాతం. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం సీట్లను స్వీప్ చేసింది. ఇక తూర్పు భారతదేశం బీహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలలో కూడా బీజేపీకి తిరుగులేని విజయాలు వచ్చాయి. ఈ రాష్ట్రాల నుంచి మొత్తం 117 మంది ఎంపిలలో 54 మంది బిజెపికి చెందిన వారు, అంటే 46 శాతం మంది. బెంగాల్ , ఒడిశాలలో బీజేపీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ పదిహేను సీట్లుకూడా రావని విపక్షాలు గతంలో లెక్కలేసుకున్నాయి. కానీ జరిగింది వేరు.
ఉత్తర భారతంలో బీజేపీ స్వీప్.. మళ్లీ ఖాయం.!
ఉత్తర భారతం లో భాగమైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్, యూపి, ఉత్తరాఖండ్ 189 ఎంపిల్లో బిజెపికి 98 మంది అంటే 52 శాతం ఉన్నారు. ఈ సారి ఇంకా పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. మధ్యభారత్ గా చెప్పుకునే మధ్యప్రదేశ్ , ఛత్తీస్గఢ్ 40 మంది ఎంపిల్లో 37 మంది బిజెపికి చెందిన వారు అంటే 92 శాతం ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభు్తవమే ఉంది. కర్ణాటక ఓటమి తర్వాత దక్షిణాదిలో బిజెపి ప్రభుత్వం లేదు. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ మొత్తం 130 మంది లోక్సభ ఎంపీలు వచ్చారు. వీరిలో బిజెపికి 29 మంది అంటే 22 శాతం ఉన్నారు. అసలు దక్షణాదిలో ఉనికే లేదని చెబుతున్న వారికి ఈ లెక్కలు కనిపించవు. వీరిలో కర్ణాటక నుంచి 25 మంది, తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బీజేపీ.. పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేసింది బీజేపీ.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 350 స్థానాలను టార్గెట్ పెట్టుకున్న బీజేపీ !
రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు వేరు. పార్లమెంట్ కు జరిగే ఎన్నికలు వేరు. స్థానిక కారణాలతో రాష్ట్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. అదే లోక్ సభ ఎన్నికలు అయితే.. మోదీ ప్రభుత్వ పనితీరు ప్రాతిపదికగా జరుగుతుంది. మోదీ ప్రభుత్వ పనితీరుపై 70శాతానికి మందికిపై సంతృప్తిగా ఉన్నారని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ సంతృప్తి ప్రకారం చూస్తే.. 350 సీట్లు రావడం పెద్ద విషయమేం కాదు.
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి ఉత్సాహపడుతున్న ఓ వర్గం మీడియా !
జాతీయవాదంపై తీవ్ర వ్యతిరేకత భావంతో ఉండే ఓ వర్గం మీడియా.. బీజేపీ ప్రభావం తగ్గిపోతోందంటూ ప్రచారం చేస్తున్నారు. అర్థసత్యాలతో మ్యాప్లు విడుదల చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉంది. అందుకే విపక్షాల పార్టీలు కూడా మోదీని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఏకం కాలేకపోతున్నాయి. గతంలోలా ఉమ్మడి సమావేశాలు పెట్టలేకపోతున్నారు. కానీ వారి కన్నా బీజేపీ అంటే పడని మీడియా హడావుడే ఎక్కువగా ఉంది. వారికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే 350 సీట్లే కళ్లు తెరిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.