కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. హస్తం పార్టీలో ఎక్కడ లేని జోష్ వచ్చింది. ముఖ్యమంత్రి పదవిపై మాత్రం సంధిగ్థత కొనసాగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వైపు అధిష్టానం మొగ్గుచూపింది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా కర్ఛిఫ్ వేయడంతో పోటీ తప్పలేదు పైగా శివకుమార్ గట్టి కేండెంట్. ప్రజా నాయుకుడు. ఎంత డబ్బయినా ఖర్చు పెట్టగల సంపన్నుడు. సోనియాకు ఆయన అంటే అభిమానం. అయినా సీఎం పదవి ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పెద్దలకు ఎదురైంది. దానికి కారణం డీకేఎస్ పై ఉన్న కేసులేనని చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఎనిమిది కేసులు, ఒక సమను
సీబీఐ,ఈడీ, ఆదాయపన్ను శాఖ కలిసి డీకే శివకుమార్ పై ఎనిమిది కేసులు పెట్టాయి. ఒక సమను పెండింగ్ లో ఉంది. ఈ కేసులను డీకేఎస్ వేసిన కేసులు కర్ణాటక హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ విషయంలోనే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు సంస్థలు ఎప్పుడైనా ఆయన తలుపు తట్టొచ్చని సిద్దా గుర్తు చేశారట. నిజానికి శివకుమార్… స్వయంగా కోర్టు మెట్లు ఎక్కుతూ ఆ కేసులను కొట్టివేయాలని అభ్యర్థిస్తున్నారు.
2012 నుంచే కేసులు
శివకుమార్ పై తొట్ట తొలి కేసు 2012న నమోదైంది. రెండు అవినీతి కేసుల్లో కర్ణాటక లోకాయుక్త ఆయన్ను నిందితుడిగా తేల్చింది. అప్పట్లో బీజేపీ అధికారంలో ఉండటంతో కక్షసాధింపు అంటూ శివకుమార్ ఆరునొక్క రాగం అందుకున్నారు. 2015లో ఈ కేసులను హైకోర్టు కొట్టివేసింది. మరుసటి సంవత్సరం లోకాయుక్త , సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. అయితే స్పెషల్ లీవ్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేయగా, దాన్ని పునరుద్ధరించాలని 2019లో కేసు వేశారు. దానిపై ఇంకా శివకుమార్ కు నోటీసులు అందలేదు.
ఆదాయపన్ను కేసు
2018లో ఆదాయపన్ను శాఖ డీకేఎస్ పై కేసులు పెట్టింది. పన్ను ఎగవేత, సాక్ష్యాలను తారుమారు చేయడం లాంటి మూడు కేసులు నమోదయ్యాయి. తనకు కేసుల నుంచి విముక్తి కలిగించాలని శివకుమార్ పెట్టుకున్న పిటిషన్ ను 2019లో కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. 2020లో శివకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆదాయపన్ను శాఖకు నోటీసులు వెళ్లాయి. మరో మూడు ఐటీ కేసుల్లో మాత్రం శివకుమార్ కు విముక్తి కలిగింది. ఐటీ శాఖ పెట్టుకున్న అప్పీలును హైకోర్టు మరో సారి తోసిపుచ్చింది. ఫైనల్ గా ఐటీ శాఖ సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్లింది. మూడు కేసులు అత్యున్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్నాయి. ఎప్పుడైన ఉత్తర్వులు రావచ్చని ఐటీ శాఖ ఎదురు చూస్తోంది.
భయపెడుతున్న ఈడీ కేసులు
శివకుమార్ ను ఎక్కువగా భయపెడుతున్నవీ ఈడీ కేసులే.. మనీ లాండరింగ్ కింద ఈడీ 2018లో ఆయనపై కేసు పెట్టగా, 2022 నుంచి ఢిల్లీ స్పెషల్ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఎప్పుడైనా నేరాభియోగాలు నమోదు కావచ్చు.దీనికి సంబంధించి శివకుమార్ వేసిన రిట్ పిటిషిన్ కూడా తోసివేతకు గురైంది. ఆయన అప్పీలు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసులోనే శివకుమార్ 2019లో అరెస్టయి 50 రోజులు జైల్లో ఉన్నారు. శివకుమార్ పై సీబీఐ 2020లో అక్రమాస్తుల కేసు పెట్టింది. ప్రస్తుతానికి ఆ కేసు విచారణ ఆగింది.
ఏ కేసులోనైనా శివకుమార్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్నది విచారణను ఫాలో అవుతున్న వారి మాట. అందుకే ఆయనకు సీఎం పదవి దక్కడం లేదని చెబుతున్నారు. కాకపోతే ఇంతటి అవినీతికి పాల్పడిన వ్యక్తి మంత్రి పదవికైనా అర్హుడా అన్నదే పెద్ద ప్రశ్న.