దేశ రహస్యాలు అమ్ముకుంటున్న జర్నలిస్టులు

పాత్రికేయం పవిత్రమైన వృత్తి అంటారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తూ, ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ విశాల జనహితం కోసం పనిచేయడమే జర్నలిజం అంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం జర్నలిజం దారి తప్పుతుంది. పాత్రికేయ ప్రమాణాలను పక్కన పెట్టి డబ్బుకు కక్కుర్తి పడటంతో కొందరి కారణంగా సమాజానికి ఇబ్బందులు ఎదరువుతున్నాయి.ఎందుకంటే వారికి డబ్బే ప్రధానం జర్నలిజం కాదు..

వివేక్ రఘువంశీపై సీబీఐ నజర్

డిఫెన్స్ జర్నలిస్టుగా చలామణి అవుతున్న వివేక్ రఘువంశీపై సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, జైపూర్ సహా 12 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానూ, కొన్ని వెబ్ సైట్లకు కంట్రిబ్యూటర్ గానూ ఉన్న వివేక్ రఘువంశీ దేశ రహస్యాలను శత్రువులకు విక్రయిస్తున్నట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.జాతి భద్రతకు సంబంధించి అంశాల్లో చొరబాడి వాటిని సేకరించి శత్రు దేశాలకు విక్రయించినట్లుగా సీబీఐ నిర్ధారించింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ప్రాజెక్టులకు సంబంధించిన రోజువారీ రహస్య సమావేశాలకు చెందిన సమాచారాన్ని కూడా సేకరించగలిగిన వివేక్, ధనాపేక్షతో వాటిని శత్రు దేశాలకు విక్రయించాడు.

ఆర్మీ రహస్యాలు సైతం చేరవేత

వివేక్ రఘువంశీ మాముూలోడు కాదని, అతని కార్యకలాపాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సైనిక స్థావరాలు, సైనిక కార్యలాపాలు, సైనిక దళాల వ్యూహాత్మక చర్యలు,ఆర్మీ రహస్య దస్తావేజులు,మిత్రదేశాలతో భారత్ నడిపే రహస్య చర్చలకు సంబంధించి సమాచారమంతా అతని వద్ద ఉన్నట్లు సీబీఐ రైడ్స్ లో వెల్లడైంది. తనచేతికి అందిన ప్రతీ సమాచారాన్ని వివేక్, విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థలకు చేరవేశాడు. వాటికి సంబంధించిన సమాచారాన్ని సైతం దాడుల సందర్భంగా సీబీఐ సేకరించగలిగింది.

2020లో రాజీవ్ శర్మ

2020లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రాజీవ్ శర్మ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు దేశ రహస్యాలను విదేశీయులను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. సుదీర్ఘ విచారణ తర్వాత 2021 జూలైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజీవ్ శర్మను అరెస్టు చేసింది. అత్యంత రహస్య సమాచారాలను సేకరించిన రాజీవ్ శర్మ వాటిని చైనీస్ ఇంటెలిజెన్స్ అధికారులకు విక్రయించినట్లు ఈడీ గుర్తించింది. కొందరు చైనా జాతీయులు షెల్ కంపెనీలను ప్రారంభించి హవాలా మార్గంలో డబ్బును రాజీవ్ శర్మకు చేరవేస్తే అతను రక్షణ శాఖ రహస్య సమాచారాన్ని వారిని అందించాడని నిర్ధారించారు. దాదాపు 50 లక్షల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

రాజీవ్ శర్మపై విచారణ కొనసాగుతోంది. అతనికి సహాయపడిన వ్యక్తుల సమాచారం తెలుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వివేక్ రఘువంశీ విషయంలోనూ అదే సమస్య ఎదురు కావచ్చు. ఎందుకంటే దేశ రహస్యాలను సేకరించడం, వాటిని విదేశీయులకు విక్రయించడం ఒకరి వల్ల అయ్యే పని కాదు. దానికి ఒక నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. విదేశీ గూఢచారులతో సంబంధాలు కొనసాగించాలి. ఇలాంటి అంశాలన్నింటినీ బయటకు తీసినప్పుడే వివేక్ రఘువంశీ లాంటి వారి ఆటకట్టించే వీలుంటుంది…