జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలన్నీ ముందూ వెనుకా ప్లానింగ్ లేకుండా జరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ గుర్తును కాపాడుకోలేకపోయారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ఇప్పుడు ఆ పార్టీ సొంతం కాదు. ఆ పార్టీ కోసం గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం రిజర్వ్ చేయలేదు. దీనికి కారణం .. జనసేన పార్టీ… రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందకపోవడమే. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ప్రిపరేషన్లు ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు.. వాటి గుర్తులపై క్లారిటీ ఇచ్చింది.
ఏపీలో రెండు మాత్రమే గుర్తింపు పొందిన పార్టీలు
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లను పక్కన పెడితే ఏపీలో మరో రెండు మాత్రమే రాష్ట్ర స్థాయి పార్టీలుగా గుర్తింపు పొందాయి. టీడీపీ, వైసీపీ మాత్రమే ఆ గుర్తింపు పొందాయి. ఏపీ నుంచి టీడీపీ, వైసీపీ మాత్రమే గుర్తింపు రాష్ట్ర స్థాయిలో పొందిన పార్టీలు. అందుకే వాటి గుర్తులను వాటికే రిజర్వ్ చేశారు. కానీ గుర్తింపు పొందని పార్టీ అయిన జనసేన గుర్తు గాజు గ్లాస్ ను మాత్రం ఫ్రీ సింబల్స్ లో ఉంచారు. గత ఎన్నికల్లో గుర్తింపు కోసం అవసరమైనన్ని ఓట్లు జనసేనకు రాలేదు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు, కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు అయినా దక్కించుకోవాలి. అయితే గత ఎన్నికల్లో జనసేనకు.. 5.9 శాతం ఓట్లు వచ్చాయి.. ఒకే అసెంబ్లీ స్థానం గెలిచారు. అందుకే గుర్తింపు పొందలేకపోయారు.
ఎవరికైనా గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు !
జనసేన గుర్తింపు సాధించలేకపోవడంతో జనసేనకు గాజు గ్లాస్ గుర్తును ఈసీ అధికారికంగా కేటాయించలేదు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది. అంటే ఈసీ విచక్షణను బట్టి ఎవరికైనా కేటయించచ్చు. అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ మొత్తం గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేసినందున ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు కేటాయించాలని ఈసీని అడగవచ్చు. ఈసీ అనుమతించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ అది జనసేన పోటీ చేసే చోట్ల మాత్రమే. ఆ పార్టీ పోటీ లేని చోట ఇతరులకు కేటాయిస్తారు.
పొత్తుల్లో జనసేన పోటీ చేయని చోట బరిలో గాజు గ్లాస్ గుర్తు !
కానీ ఈ సారి జనసేన టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేయాలనుకుంటోంది. అంటే అన్ని చోట్లా పోటీ చేయడం లేదు. కొన్ని చోట్ల పోటీ చేస్తుంది. జనసేన పోటీ చేయని చోట ఇండిపెండెంట్లు తమకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కోరితే..ఈసీ వారికి చాన్స్ ఇస్తుంది. తిరుపతి ఉపఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు ఉంది. పొత్తులు పెట్టుకుని విస్తృతంగా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తారు. దీని వల్ల ఇతర చోట్ల కూడా గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు పడతాయి. దాని వల్ల పొత్తుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇది జనసేనానికి ఇబ్బందికరంగామారే అవకాశం ఉంది.