సాయిపల్లవి..ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంటుంది. ఆమెను తలుచుకోగానే అందమైన రూపం మాత్రమే కాదు అద్భుతమైన నటన గుర్తొస్తుంది. ఏ పాత్రలో నటించినా ఆ ప్లేస్ లో మరో హీరోయిన్ ని అస్సలు ఊహించుకోలేం. అందుకే ఆమె సినిమాలకు మైనస్ మార్కులుపడినా ఆమె నటనను ఎవ్వరూ తక్కువచేయలేకపోయారు. ఓ వేదికపై లేడీ పవర్ స్టార్ అనే బిరుదు అందుకుందంటే దటీజ్ సాయి పల్లవి.
హీరోల చుట్టూ తిరిగే తెలుగు సినిమా కథల్లో..సాయి పల్లవి తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. ఎంత పెద్ద హీరో ఉన్నా కథలో తనపాత్రకు ప్రత్యేక గుర్తింపు లేకుండా ఇప్పటివరకూ ఏ ప్రాజెక్టూ చేయలేదు. అందుకే సాయిపల్లవి సమ్ థింగ్ స్పెషల్. అయితే ఈ మధ్య సాయిపల్లవి నటించిన సినిమాలు వరుసగా నిరాశపర్చడంతో ఇక సినిమాలకు దూరమవుతుందని, పెళ్లిచేసుకుంటుందని ప్రచారం చేశారు. ఈ వార్తలసంగతి పక్కనపెడితే ఆమె రీసెంట్ గా తన లవ్ స్టోరీ గురించి చెప్పింది. లవ్ స్టోరీ అంటే నాగచైతన్యతో కలసి నటించిన సినిమా గురించి కాదు..నిజజీవతంలో ఆమె ప్రేమకథ గురించి చెప్పుకొచ్చింది.
లవ్ లెటర్ అమ్మచూసేసి చితక్కొట్టేసింది
ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ తన ప్రేమ కథ గురించి చెప్పుకొచ్చింది. ఏడో తరగతి చదువుతున్న రోజుల్లో తవ క్లాస్ మేట్ ని ఇష్టపడిందట. ఆ అబ్బాయి అంటే ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ చెప్పడానికి భయమేసి లెటర్ రాసింది. కానీ ఆ లెటర్ ఇచ్చేందుకు కూడా ధైర్యం సరిపోక బుక్స్ లో దాచుకుంది. సాధారణంగా అమ్మలంతా పిల్లల బ్యాగులు, పుస్తకాలు, క్యారియర్లు సర్దడమే కాదు చెక్ చేస్తారు కూడా. అదే పని చేసిన సాయిపల్లవి తల్లికి ఆ లెటర్ కంటపడింది. స్కూల్ కి చదువుకోమని పంపిస్తే లవ్ లెటర్లు రాస్తావా అంటూ చితక్కొట్టేసిందట. అమ్మ కొట్టడం అదే ఫస్ట్ అదే లాస్ట్..అప్పటి నుంచీ ఎలాంటి తప్పులు చేయలేదని సరదాగా చెప్పుకొచ్చింది లేడీ పవర్ స్టార్.
సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టలేదంటూ క్లారిటీ
ఈ మధ్య సాయి పల్లవి ప్రాజెక్టులు తగిపోయాయి. తెలుగులో ఆమె చివరి చిత్రం విరాటపర్వం. తమిళంలో గార్గి..ఇదే సినిమా తెలుగులో కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి డాక్టర్ గా కొనసాగుతుందని, పెళ్లి చేసుకుంటుందని ప్రచారం చేశారు. వీటన్నింటినీ కొట్టిపడేసిన సాయిపల్లవి..మంచి స్క్రిప్ట్స్ కోసం ఎదురుచూస్తున్నానని క్లారిటీ ఇచ్చేసింది. తనను ప్రతి ఒక్కరూ వాళ్లింట్లో మనిషిలా భావిస్తారు కాబట్టి..వారికి నచ్చే పాత్రలే చేయాలి, వారి మనసులో నా స్థానం ఉన్నతంగా ఉండాలి అందుకే పాత్రల ఎంపికలో ఆలస్యం అవుతోందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి హీరో శివ కార్తికేయన్ తో కలసి ఓ సినిమా చేస్తోంది. పుష్ప 2లో కూడా సాయి పల్లవి నటిస్తోందనే ప్రచారం జరిగింది. మరి తెలుగులో సాయిపల్లవి చేయబోయే ప్రాజెక్ట్ ఏంటో వెయిట్ అండ్ సీ…