Health Tips: ఈ జనరేషన్ పిల్లలకు మందగిస్తోన్న కంటిచూపు, ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టమే!

కంటిచూపు మందగించడం అంటే అప్పట్లో పెద్దయ్యాక, ముసలయ్యాక జరిగేది. కానీ ఈ జనరేషన్ పిల్లలకు కంటిచూపు మందగించడం చాలా కామన్ అయిపోయింది. కొందరికి పుట్టుకతో సమస్య మొదలైతే మరికొందరికి తినే తిండిలో పోషకాలు లేకపోవడం, అలవాట్లు కారణంగా మారుతున్నాయి. చాలా మంది పిల్లలకు పుట్టినప్పుడు కంటి లోపాలు ఉంటాయి. క్రమంగా చాలా వరకు సర్దుకుంటాయి. కొన్నిసార్లు మాత్రం దీర్ఘదృష్టి, హ్రస్వదృష్టి లాంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇంతకీ చిన్నారుల కళ్లు బలహీనపడకుండా వారి చూపు మందగించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు.

శారీరక ఎదుగుదలపై ప్రభావం
పిల్లల కళ్లపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకుంటే ఇవి వారి నేర్చుకునేతత్వంపై, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కంటిచూపు సరిగా లేని పిల్లలు చదువులోనూ వెనుకబడే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి.. భవిష్యత్‌లో చాలా నష్టం వాటిల్లవచ్చు. దృష్టి ప్రభావం పిల్లల శారీరక ఎదుగుదలపైనా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు కంటిచూపు తక్కువున్న వారిలో చేయి-కన్నుకు మధ్య సమన్వయం లోపిస్తుంది. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే క్రీడలు, వ్యాయామం తదితర ఫిజికల్‌ యాక్టివిటీస్‌పై వారు మొగ్గు చూపరు. ఫలితంగా దాని ప్రభావం శరీరక ఎదుగుదలపై పడుతుంది. అందుకే పిల్లల కంటి చూపు మెరుగుపడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

నాలుగు గోడల మధ్యా ఉంచేయవద్దు
ఈ తరం పిల్లలు శరీరానికి చెమట పట్టే ఆటలు ఆడటం మానేశారు. ఏసీల్లో కూర్చుని నాలుగు గోడల మధ్య మగ్గిపోతూ ఆడుకుంటున్నారు కానీ బయటకు అడుగుపెట్టడం లేదు..మొబైల్ పట్టుకుంటున్నారు లేదంటే టీవీతోనే సమయం గడిపేస్తున్నారు. ఫలితంగా శారీరక వ్యాయామం ఉండటం లేదు. పిల్లలు సహజ వెలుతురులో సమయం గడపడం వల్ల హ్రస్వదృష్టి వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో దగ్గరి వస్తువులు బాగానే కనిపిస్తాయి కానీ దూరంగా ఉన్న వస్తువులు మాత్రం సరిగా కనిపించవు.

టీవీలు,ఫోన్లు ఇవ్వండి కానీ..
టీవీలు, ఫోన్లు పట్టుకుని గంటల తరబడి ఉండిపోతున్నారు. అలాగని ఏకంగా ఇవ్వొద్దని కాదు కానీ ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ స్క్రీన్‌ చూస్తే కళ్లు బాగా ఒత్తిడికి గురవుతాయి. కొన్ని సార్లు పొడి బారిపోయి కంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పిల్లలకు వీలైనంత వరకు మొబైల్స్‌, టీవీలను చూపించకపోవడమే ఉత్తమం. ఒకవేళ చూపించాల్సి వస్తే.. మధ్య మధ్యలో విరామం ఇవ్వడం మర్చిపోవద్దు.

మసక వెలుతురులో చదవొద్దు
చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు ఆ ప్రదేశంలో సరైన వెలుతురు ఉండేలా జాగ్రత్తపడాలి. లేదంటే వారి కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు
శరీర ఎదుగుదల మంచి ఆహారం చాలా అవసరం. విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు ఇవ్వాలి. దీనివల్ల వారి కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు. ఆకుకూరలు,పండ్లు, కూరగాయలు ఎక్కుగా తినేలా ప్రోత్సహించండి.

తరచూ కంటిపరీక్షలు చేయించండి
పిల్లలకు తరచూ కంటి పరీక్షలు చేయించడం చాలా అవసరం. ఏవైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. కళ్లను తాకేముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. దీనివల్ల కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు.పిల్లలు ఆరుబయట ఆడుకునేటప్పుడు కళ్లలో ఇసుక పడిపోవడం లేదా చిన్నపాటి గాయాలవుతుంటాయి. అందుకే ఆడుకునే సమయంలో కళ్లజోడు ఇవ్వడం మంచిది.

పుస్తకం పట్టుకునే తీరు నేర్పించండి
చాలా మంది పిల్లలు చదువుతున్నప్పుడు పుస్తకాలను కళ్లకు దగ్గరగా పెట్టుకుంటారు. పడుకుని కొందరు, తక్కువ వెలుతురులో ఇంకొందరు ఇలా రకరకాలుగా చదువుతుంటారు. అలాకాకుండా ఎలా చదవాలో పిల్లలకు నేర్పించాలి. నిటారుగా కూర్చుని కంటికి, పుస్తకానికి కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలి. వివిధ భంగిమల్లో చదవడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగుతుందని అర్థమయ్యేలా చెప్పాలి.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లల కంటి ఆరోగ్యమే కాకుండా.. శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం