నెల్లూరు జిల్లా వైసీపీకి వైరస్ పట్టుకున్నట్లుగా ఉంది. ఆ పార్టీ నేతలు అధిపత్య పోరాటంతో అసలు పార్టీకే గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే ఆనం, మేకపాటి, కోటంరెడ్డి పార్టీకి దూరమైపోయారు. మరికొంత మంది సైలెంట్ అయ్యారు. ఇప్పుడు నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ కుటుంబంలో ఏర్పడిన చిచ్చుతో ఓ వర్గం బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. వైసీపీలో ఉండలేకపోవడం.. టీడీపీలో చోటు లేకపోవడంతో బీజేపీలో చేరాలన్న ఆలోచనలు ఓ వర్గం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అనిల్ కుమార్ ,రూప్ కుమార్ మధ్ గొడవలు
అనిల్ కుమార్ యాదవ్ రెండుసార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచారు, జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. ఆయన గెలుపులో బాబాయ్ రూప్ కుమార్ కీలక పాత్ర పోషించారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు రూప్ కుమార్ అందుబాటులో ఉంటారు. అనిల్ షాడోగా ఆయన చాలా వ్యవహారాలు చక్కబెట్టారు. కానీ వ్యాపారాల్లో రూప్ కుమార్ దూసుకెళ్తున్నాడని.. ఆర్థికంగా బలపడిపోతున్నాడని.. పార్టీలో తన కంటే్ బలంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడన్న అనుమానంతో అనిల్ కుమార్ ఆయనను దూరం పెట్టడం ప్రారంభించారు. లదీంతో అనిల్, రూప్ మధ్య గొడవ ముదిరింది. ఎంతగా అంటే.. రూప్ కుమార్ కొత్త ఆఫీస్ కూడా కట్టుకుంటున్నారు.
రూప్ కుమార్ ను పార్టీ నుంచి పంపకపోతే పోటీ చేసేది లేదంటున్న అనిల్ కుమార్
బాబాయ్ అబ్బాయ్ ల మధ్య గొడవలు చూసి.. మొత్తానికే మోసం వస్తుందని కంగారు పడిన సీఎం జగన్ వారి మధ్య సయోధ్య కుదిర్చారు. కానీ అది ఎక్కువ రోజులు లేదు. చేతులు కలిపారు కానీ అనిల్ మాత్రం తగ్గేది లేదంటున్నరు. రూప్ కుమార్ ను పార్టీ నుంచి పంపేయాలని .. ఆయన సహకారంతో ఎన్నికలు చేయలేనని.. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే రాజకీయాలు వదిలేస్తానని కూడా అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు టౌన్ లో అనిల్ వర్గం, రూప్ వర్గం రెండుగా విడిపోయాయి. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ వెంటే ఎక్కువ మంది కార్పొరేటర్ల ుఉన్నారు. వచ్చే దఫా అనిల్ కి సిటీలో టికెట్ ఇస్తే పార్టీ గెలుపు కష్టం అనే సంకేతాలు అదిష్టానానికి పంపేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. అనిల్ కి టికెట్ రాకుండా అడ్డుకోడానికి పావులు కదుపుతున్నారు. అనిల్ కే టిక్కెట్ ఇస్తే.. రూప్ కుమార్ బీజేపీ నుంచి పోటీ చేయవచ్చని అంటున్నారు.
టీడీపీ నుంచి నారాయణ పోటీ !
టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణే నెల్లూరు సిటీలో పోటీకి దిగుతారు. ఆయన ఓడిపోయినప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ అభ్యర్థి ఆయనేనని టీడీపీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. సొంత పార్టీలోనే అనిల్ కి కుంపటి ఎదురైతే.. అది కచ్చితంగా టికెట్ పై కూడా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. అనిల్ కు టిక్కెట్ లేదన్న ప్రచారం ఇందుకే జరుగుతోంది. రూప్ కుమార్ పార్టీలోని కొంత మంది పెద్దలను కలిసి తనకే చాన్సివ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో ఆయన బీజేపీ తోనూ టచ్‌లో ఉండి .. ఎన్నికల సమయంలో అయినా ఆ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్నారు.