కాంగ్రెస్ కు సెగ మొదలైందా..

ఇల్లు అలకగానే పండుగ కాదు.. ముందుంది మొసళ్ల పండుగ అన్నట్లుగా తయారైందీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కర్ణాటకలో గెలిచిన సంబరాలు పూర్తి కాకముందే జనం నిలదీయడం మొదలు పెట్టారు. చేసిన బాసలు మరిచిపోకని అని పాడుతున్నారు.

కరెంటు బిల్లు కట్టేది లే..

ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే కర్ణాటకలోని చాలా గ్రామాల్లో కరెంట్ బిల్లు కట్టడం ఆపేశారు. చిత్రదుర్గా తాలూకా సిద్దాపుర గ్రామ పంచాయతీలో కరెంట్ బిల్లులు కట్డాలని అడిగేందుకు వెళ్లిన విద్యుత్ శాఖ అధికారులను జనం తరిమి కొట్టారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే ఓటేశామని, ఇప్పుడు పార్టీ గెలిచినందునే ఇక బిల్లులు కట్టే ప్రసక్తే లేదని ఊరి జనం తేల్చేశారు. రెండు రోజులుగా చాలా గ్రామాల్లో ఇలా జరుగుతోందట. విద్యుత్ బిల్లులు రద్దు చేసినట్లు ఉత్తర్వులు వచ్చే వరకు డబ్బులు కట్టాల్సిందేనని అధికారులు చెప్పినా జనం వినిపించుకోవడం లేదు. జీవో వచ్చే వరకు మీరే ఆగండని అధికారులకు వారు హితబోధ చేస్తున్నారు.

గృహ జ్యోతితో కష్టాలేనా…

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఉచిత పథకాలను ప్రస్తావించింది. అధికారానికి వచ్చిన వెంటనే రేషన్ షాపుల్లో ప్రతీ నెల పది కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.అన్న భాగ్య యోజన పేరులో ఆహార ధాన్యాలు అందిస్తారు. గృహజ్యోతి పథకం కింద ప్రతీ ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తామని చెప్పింది. గృహ లక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెల రెండు వేల రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ అంటోంది. యువ నిధి పేరుతో నిరుద్యోగ యువతకు ప్రతి నెల భృతి అందిస్తారు. డిప్లొమా చదివిన వారికి రూ. 1,500 … డిగ్రీ చదివిన వారికి రూ. 3,000 ఇస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు.

ఖజానాపై భారం ఖాయం..

ఉచితాలు అమలు చేస్తే ప్రతీ పథకానికి వేల కోట్లు అదనపు ఖర్చు అవుతోంది. గృహ లక్ష్మీ పథకం కింద మహిళలకు రూ.2 వేలు ఇచ్చిన పక్షంలో ఖజానాపై ఏడాదికి రూ. 45 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.9,000 కోట్లు వ్యయం తప్పదు. ఇప్పటికే విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల అదనపు సాయం అందిస్తోంది.

పెరిగిపోతున్న అప్పులు

కర్ణాటక రాష్ట్రం కూడా అప్పుల్లో మునిగి ఉంది. ఆ రాష్ట్రం అప్పు రూ. 5.2 లక్షల కోటు. ఇది ఎవరో చెప్పినది కాదు. కాగ్ నివేదిక నిగ్గు తేల్చిన అంశం. ప్రతీ నెల ప్రభుత్వం వడ్డీ కింద రూ. 14,178 కోట్లు చెల్లిస్తోంది. వడ్డీ చెల్లింపు అనేది అనుద్పాదక వ్యయమని మరిచిపోకూడదు. 2022.23లో ద్రవ్య నిర్వహణ సమీక్ష జరిగినప్పుడు వడ్డీల కారణంగా అప్పులు మరింతగా పెరిగిపోతున్నాయని ఆర్థిక కమిటీ తేల్చింది. ఇప్పుడు కాంగ్రస్ పార్టీ హామీ ఇచ్చిన ఉచిత పథకాలను అమలు చేస్తే ఏడాదికి అదనంగా రూ. లక్ష కోట్లు వ్యయం కావచ్చు. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో అదనపు అప్పులు తీసుకు రావాల్సి ఉంటుంది. జగన్ ప్రభుత్వ తరహాలో ప్రతి నెల అప్పుల మీద నెట్టుకు రాక తప్పదు మరి హామీలు నెరవేర్చి కర్ణాటకను దివాలా తీయిస్తారా… లేకపోతే ఏమీ ఎరుగనట్లు ఉంటారో చూడాలి…