జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకపక్షంగా పొత్తులు ప్రకటించేసుకున్నారు. టీడీపీ అధినేత మాత్రం పొత్తుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ జనసేనను కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అందరికీ తెలుసు. దీన్ని పవన్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారో లేకపోతే కానీ పొత్తులు ఉంటాయని భావిస్తున్నారు. దీంతో తమ స్థానాలు ఎక్కడ గల్లంతవుతాయోనని టీడీపీ నేతలు హైరానా పడుతున్నారు.
జనసేన గతంలో ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గాలపై గురి
పొత్తుల పై పవన్ ప్రకటన చేయడంతో టీడీపీ నేతల్లో ఇప్పుడు సీట్ టెన్షన్ మొదలైంది. జనసేన ఎక్కడెక్కడ టిక్కెట్లు ఆశిస్తుందో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో తెలియని పరిస్థితుల్లో నేతలు ఉన్నారు. షరతులు లేకుండా పొత్తులకు వెళ్తామని అయితే, ఎవరికి లొంగేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీట్ల పంపకాలే మిగిలాయన్న అభిప్రాయంలో టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు. దాదాపు 35 నుండి 40 అసెంబ్లి స్థానాలతోపాటు ఏడు పార్లమెంటు స్థానాలను జనసేన ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
సీనియర్ నేతలకు టిక్కెట్లు గల్లంతు అవుతాయా ?
ఇప్పటివరకూ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటున్న టీడీపీ నేతలపై పడనుంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ పొత్తుల ప్రభావం అధికంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కొంత మేర రాయలసీమలో చూపనుంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అధిక సీట్లను జనసేన ఆశిస్తుంది. అలాంటి చోట్ల టీడీపీకి బలమైన నేతలు ఉన్నారు. వారు త్యాగాలు చేయడం సాధ్యం కాదు. అదే సమయంలో జనసేనకు ఓటు బ్యాంక్ ఉంది కానీ బలమైన నేతలు లేరని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
సమన్వయం కుదరకపోతే పొత్తు వల్ల ప్రయోజనమే ఉండదు !
రాజకీయ పొత్తులు విజయవంతం కావాలంటే.. అన్ని వైపుల నుంచిసహకారం ఉండాలి. కానీ టీడీపీ, జనసేన క్యాడర్ ఎక్కడా కలుస్తున్నట్లుగా లేదు. సోషల్ మీడియాలో వారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు. అలాంటి వారు పొత్తులు పెట్టుకున్నా..ఓట్లు బదిలీ చేసుకుంటారన్న నమ్మకం లేదు. ఇలా జరిగితే పొత్తుల వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. మొదటికే మోసం తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.