ఏపీ మంత్రుల్లో పెద్ద నోర్లున్న నేతల్లో మంత్రి రోజా ఒకరు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. కానీ ఆ నోరును అదుపులో పెట్టుకోకపోవడం వల్ల రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోనే కాదు.. తన సొంత నియోజకవర్గం మొత్తం ప్రత్యర్థుల్ని పెంచుకున్నారు రోజా. ఆమె నోటికి భయపడే హైకమాండ్ మంత్రి పదవి ఇచ్చిందనే గుసగుసలు ఉన్నాయి. ఇక ఆమెను భరించడం కష్టమని.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే ఆలోచన లేదని వైసీపీ వర్గాలే లీకులు ఇస్తున్నాయి.
నగరిలోని ఐదు మండలాల్లో రోజాకు వ్యతిరేకులు !
నగరిలో మరోసారి వైఎస్సార్‌సీపీలో వర్గపోరు ఎప్పుడూ బయటపడుతూనే ఉంది . ఐదు మండలాల ముఖ్య నేతలు రోజాకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఏకంగా మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఐదు మండలాల్లోని ముఖ్య నేతల్లో ఒకరికే ఈ ఎన్నికల్లో సీటు కేటాయించాలంటూ నేతలు అల్టిమేటం ఇచ్చారు. ఎమ్మెల్యే రోజా ప్రజలకు అందుబాటులో లేరని..మంత్రి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని..రోజాను గెలిపించిన వైసీపీ కార్యకర్తలను హీనంగా చూస్తున్నారని.. నగరిలో రోజా ఎలాంటి అభివృద్థి చేయలేదంటూ విమర్శిస్తున్నారు . ఎమ్మెల్యేతో పనేంటి..ఆమె మంత్రి అయితే మాకేంటీ అంటున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ వారి చేతుల మీదుగానే నడుస్తున్నాయి.
తమిళ ఓటర్లు ఈ సారి మద్దతుగా నిలుస్తారా?
రోజా రెండు సార్లు గెలిచినా స్వల్ప ఓట్లతోనే గెలిచారు. తమిళనాడు సరిహద్దులో ఉండటంతో తమిళ ఓటర్లు ఆమెకు అనుకూలంగా ఉన్నారు. రోజా భర్త సెల్వమణి తమిళ సినీ డైరక్టర్ గా పేరు తెచ్చుకుని ఇప్పుడు తమిళ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ కారణంగా తమిళ ఓటర్లు రోజా వైపు ఉన్నారు. కానీ ఇటీవల రజనీకాంత్ పైనా రోజా తన నోటి పవర్ చూపించడంతో వారూ దూరమయ్యారన్న చర్చ జరుగుతోంది.
రోజుకు వ్యతిరేకంగా ఉన్న నేతలకు పెద్దిరెడ్డి అండ !
నగరిలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న వారంతా బలమైన నాయకులే. నిండ్ర మండలం నుంచి రెడ్డివారి చక్రపాణిరెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు, నగరి నుంచి కేజే కుమార్, శాంతి దంపతులు ..అలాగే వడమాల పేట, విజయపురం, నుంచి మురళీధర్ రెడ్డి, లక్ష్మీపతి ఇలా పలువరు నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమలో ఒకరికి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. స్థానికులకే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాలని అధినేత దృష్టికి తీసుకెళ్ళామని.. జగన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. వీరందరికీ మంత్రి పెద్దిరెడ్డి అండ ఉంది. లేకపోతే మాట్లాడేవారు కాదన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా రోజాకు కూడా టిక్కెట్ ఉండదనే సిగ్నల్స్ వస్తున్నాయంటున్నారు. ఇతర పేర్లువైసీపీ వైపు నుంచి తెరపైకి వస్తున్నాయి. అందుకే రోజా.. ఇటీవలి కాలంలో తనను విస్మరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో.. చెప్పేలా టంగ్ పవర్ చూపిస్తున్నారని అంటున్నారు. మరి రోజాకు వైసీపీ హైకమాండ్ భయపడుతుందా .. పార్టీ కోసమే చూస్తారా అన్నది కొన్ని నెలల్లో క్లారిటీ రానుంది.