కర్ణాటక ఎన్నికల్లో బీజేపీపై ప్రజావ్యతిరేకత ఉందని అందుకే ఓడిపోయారని అందరూ విశ్లేషిస్తున్నారు కానీ.. అసలు విషయం ఏమిటంటే… బీజేపీ అసలు ఓట్ల శాతం తగ్గలేదు. బీజేపీ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. బీజేపీ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంది. సీట్లు తగ్గినా ఓట్ల షేర్‌ను గత ఎన్నికల మాదిరే రాబట్టింది. కానీ జేడీఎస్ దారుణంగా నష్టపోయింది.ఆ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కు బదిలీ కావడంతో కాంగ్రెస్ ఎక్కువ లాభపడింది. ఫలితంగా అధికారంలోకి వచ్చింది.
ఇదీ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం !
2018 ఎన్నికల్లో 36.22 % ఓట్లు రాగా.. ఈ సారి 36 % వచ్చాయి. అంటే కేవలం 0.22 శాతమే తగ్గింది. ఓట్ల చీలిక ఎఫెక్ట్ కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. హస్తం పార్టీకి గత ఎన్నికల్లో 38.1% ఓట్లు పడగా, ఈ సారి 42.88% పడ్డాయి. అంటే 5 శాతం షేర్ పెరిగింది. ఈ పెరిగిన షేర్ మొత్తం జేడీఎస్‌దే. కుమారస్వామి పార్టీ ఈ ఎన్నికల్లో 5 శాతం పైగా ఓట్లను కోల్పోయింది. 2018లో 18.36% ఓట్లు పడగా, ఈ సారి 13.29%కి తగ్గింది.
కాంగ్రెస్ కుట్రలో భాగస్వామిగా మారిన గాలి జనార్ధన్ రెడ్డి
ఓట్లు తగ్గకున్నా.. సీట్లు మాత్రం బీజేపీకి భారీగా తగ్గిపోయాయి. గత ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఈసారి 65 సీట్ల దగ్గరే ఆగిపోయింది. అంటే 39 సీట్లు తగ్గాయి. అయితే ఓట్ల చీలిక వల్లే చాలా చోట్ల బీజేపీ ఓడిపోయింది. ఉదాహరణకు బళ్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి జనార్దన్ రెడ్డి హవా ఎక్కువ. ఆయన ఈ సారి ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ)’ పేరుతో సొంత పార్టీని పెట్టుకున్నారు. ఆయన, ఆయన భార్యతోపాటు మొత్తం 47 మంది పోటీ చేశారు. గాలి జనార్దన్‌రెడ్డి తప్ప మిగతా వారందరూ ఓడిపోయారు. కానీ ఓట్లను భారీగా చీల్చారు. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన సొంత సోదరులు గాలి సోమశేఖరరెడ్డి, గాలి కరుణాకరెడ్డి ఓటమికీ కారకులయ్యారు. బీజేపీని దెబ్బ కొట్టిన కేఆర్పీపీ.. పరోక్షంగా కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చింది. ఈ అనుకూల పరిణామంతో చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ప్రచారం అంతా ఉత్తదే..!
కర్ణాటకలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రకరకాలుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. నిజానికి అలాంటి వ్యతిరేకత ఉంటే ఓట్ల శాతం భారీగా తగ్గాలి. అలాంటిదేమీ లేదు. జేడీఎస్ బలహీనపడటం.. ఆ పార్టీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు వెళ్లడం.. గాలి జనార్దన్ రెడ్డి వల్లనే అసలు సమస్య వచ్చింది. బీజేపీకి షాక్ తగిలింది.