రాహుల్ తప్పిదమే రాజస్థాన్ సంక్షోభమా ?

కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్సే శత్రువంటారు. కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు కిందకు లాక్కుంటారంటారు. రాజస్థాన్లో జరుగుతున్నది కూడా అద. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడుతున్న మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. గెహ్లాట్ ను ఇబ్బందిపెట్టేందుకు పైలట్ సరికొత్త మార్గాలు వెదుకుతున్నారు. దానితో పార్టీలో ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతుందో అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులు అయోమయ స్థితిలో పడిపోయాయి.

పైలట్ జన సంఘర్ష్ యాత్ర…

రకరకాల ఉద్యమాలతో సొంత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ వచ్చిన సచిన్ పైలట్.. ఇప్పుడు అజ్మీర్ నుంచి జైపూర్ కు ఐదు రోజుల జన సంఘర్ష్ యాత్ర చేస్తున్నారు. మునుపటి వసుంధరా రాజే నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతిని విచారించాలన్న డిమాండ్ తో 125 కిలోమీటర్ల యాత్ర నిర్వహిస్తున్నప్పటికీ అసలు ఉద్దేశం ఏమిటన్నది పెద్దగా చెప్పాల్సిన పని లేదు. పైగా రాజస్థాన్ ప్రభుత్వ పరీక్షల్లో పేపర్ లీకేజీపై కూడా విచారణ జరిపించాలని ఆయన కోరుతున్నారు.పైగా గెహ్లాట్ కు హైకమాండ్ సోనియాగాంధీ కాదని, వసుంధరా రాజే కోసం ఆయన పనిచేస్తున్నారని పైలట్ ఆరోపణలు సంధించారు.

టెన్షన్లో కాంగ్రెస్

పైలట్ యాత్ర కారణంగా పార్టీకి వచ్చే నష్టంపై చర్చించేందుకు సీనియర్ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను చర్చించారు. ఏఐసీసీ రాజస్థాన్ ఇంఛార్జ్ సుఖ్జిందర్ సింగ్ రణధావా నేత-త్వంలో సమావేశమైన సీనియర్ నేతలు, ముఖ్యమంత్రి గెహ్లాట్ నాయకత్వంపై పూర్తి విశ్వాసముంచారు. గెహ్లాట్ ప్రజల మనిషని, రాజస్థాన్ సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశారు. కాకపోతే ఆ ప్రకటనలో విశ్వసనీయత లోపించిందని విపక్షాలు అంటున్నాయి. గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం అధోగతిపాలైందని ఆరోపిస్తున్నాయి..

రాహుల్ తప్పిదమే..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ పని చేపట్టినా ఫెయిల్యూరేనన్న వాదన తరచూ వినిపిస్తోంది. సమస్య ఏర్పడితే దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా గిల్లి వదిలిపెట్టడం, బాగా పెద్దదైన తర్వాత తనకేమీ తెలియనట్లుగా ఊరుకోవడం రాహుల్ కు అలవాటుగా మారింది. అసోం ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాహుల్ ఆయన్ను ఎంకరేజ్ చేసినట్లుగా కలరింగ్ ఇచ్చి తర్వాత వదిలేశారు. అసోం ఎదుర్కొంటున్న దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి హిమంత ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఎలాంటి ఎంకరేంజ్ మెంట్ రాలేదు. పంజాబ్ లో సిద్ధు వ్యవహారం కూడా మిస్ ఫైర్ అయ్యింది. సిద్దును సరిగా ప్రోత్సహించలేదు. తర్వాతి కాలంలో ఆయన పార్టీ నేతలపై రెచ్చిపోతుంటే నిలువరించలేకపోయారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పంజాబ్ అధికారాన్ని పువ్వుల్లో పెట్టి ఆప్ కు అప్పగించింది. ఇప్పుడు రాజస్తాన్ విషయంలోనూ అదే జరుగుతోంది. యువనేత సచిన్ పైలట్ ఏవో ఆకాంక్షలతో ముందుకు వస్తే అతడ్ని దారిలోకి తీసుకురావాల్సిన రాహుల్ ఆయన్ను ప్రోత్సహంచారు. తర్వాతి కాలంలో గెహ్టాట్ అడ్డం తిరిగితే ఏం చేయలేక చేతులెత్తేసి పరిష్కార బాధ్యతను పార్టీ పెద్దలపై వదిలేశారు. మరి రాజస్థాన్ కాంగ్రెస్ పరిస్తితి ఏమవుతుందో ఒక సారి అసోం, పంజాబ్ గుర్తు చేసుకుంటే చాలన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.