జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులు,సీఎం పదవి విషయంలో చేస్తున్న ప్రకటనలు జనసైనికుల్ని నిరాశకు గురి చేస్తున్నాయి. సీఎం పదవిని అడగబోనని ఆయన ప్రకటించడం.. ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు నేరుగా సీఎం అవ్వాలని కోరుకోవడం ఏమిటని ఆయన తనను తానే తక్కువ చేసుకోవడంతో జనసైనికులు నివ్వెరపోతున్నారు. పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ ఆలోచనలను సమర్థించలేమని ఎక్కువ మంది చెబుతున్నారు. దీంతో జనసేన పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. జనసైనికుల ఆలోచనలను .. నేరుగా తెలుసుకునే వ్యవస్థ ఏదీ పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.
చంద్రబాబును సీఎం చేస్తామన్నట్లుగా పవన్ ప్రకటన
తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే పవర్ షేరింగ్ విషయంలో మాత్రం ఆయన చేతులెత్తేశారు. సీఎం పదవి బలం చూపించి అడుగుదామని ఆయన చెబుతున్నారు. దీంతో చంద్రబాబు రాజకీయం గురించి అవగాహన ఉన్న వారంతా పవన్ కల్యాణ్ సీఎం అవడం సాధ్యం కాదన్న అభిప్రాయంలో ఉన్నారు. నిరాశకు గురవుతున్నారు. చంద్రబాబుతో పోటీ చేస్తే ఆయనకు అనివార్యంగా మద్దతివ్వాలని ..ఇది ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య వంటి వారు కూడా అదే చెబుతున్నారు.
బీజేపీతో కలిసి పోటీ చేస్తే కింగ్ మేకర్ అయ్యే చాన్స్
పవన్ కల్యాణ్ చెబుతున్నట్లుగా 30 లేదా 40 స్థానాల్లో గెలిస్తే కింగ్ మేకర్ అవ్వొచ్చు. ఆ అవకాశం ప్రస్తుతం ఉన్న పొత్తులను కొనసాగించడం ద్వారా వస్తుందని జనసైనికులు ఎక్కువగా విశ్లేషిస్తున్నారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా కనీసం నలబై స్థానాల్లో బీజేపీ, జనసేన ఓటు బ్యాంక్ నలభై శాతానికిపైగా ఉందని.. త్రిముఖ పోరులో ఈ స్థానాలన్నీ ఈజీగా జనసేన ఖాతాలో పడుతాయని అంటున్నారు. ఎలాంటి ఎన్నికల నిపుణుడితో విశ్లేషించినా ఇదే జరుగుతుందని చెబుతున్నారు. అలాంటప్పుడు పాతిక, ముఫ్ఫై సీట్లకు టీడీపీతో పొత్తు పెట్టుకుని సీఎం సీటును ఆ పార్టీకి ఎందుకివ్వాలన్న ప్రశ్న వినిపిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా ?
జనసేన బలంపై తక్కువ అంచనా లు వేసి చెప్పి పవన్ కల్యాణ్ ను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని జనసైనికులు అనుమానపడుతున్నారు. లేకపోతే పొత్తులపై జనసేన అభిప్రాయం చెప్పాలి కానీ బీజేపీని కూడా పొత్తుల్లో చేర్చి చెప్పడం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా జనసైనికుల అభిప్రాయానికి దూరంగా పవన్ కల్యాణ్ పొత్తుల రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. మరి వీరి మాటల్ని పవన్ ఎప్పుడు ఆలకిస్తారో ?