వైసీపీ మాజీ మంత్రి చూపు బీజేపీ వైపు – ఉత్తరాంధ్రలో కీలక మార్పులు ?

ఉత్తరాంధ్ర వైసీపీలో మూడేళ్ల పాటు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ చక్రం తిప్పారు. కానీ ఇటీవల ఆయన జాతకం తిరగబడింది. ఆయన కుమారుడ్ని వైసీపీ విశాఖ యూత్ వింగ్ కు అధ్యక్షుడ్ని చేస్తే.. వెంటనే హైకమాండ్ జోక్యం చేసుకుని తొలగించేసింది. ఆయన పార్టీ పరమైన బాద్యతలు కూడా ఇవ్వలేదు. దీంతో మాజీ మంత్రి అయిన తనను అవమానిస్తున్నారని ఆయన గట్టిగా ఫీలవుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ఆయనపై పార్టీ మర్పు ప్రచారం ఎక్కువగ ాజరుగుతోంది.

అవంతిని పట్టించుకోని వైసీపీ అధిష్ఠానం

సాధారణంగా పదవిపోతే ఏ నేతకైనా ప్రాధాన్యం తగ్గడం సహజమే కానీ అవంతి పరిస్థితి దారుణంగా ఉంది. సొంతపార్టీ నాయకులు కూడా పలకరించడం లేదు. పొమ్మనలేక పొగబెడుతున్నారని ఇప్పటికే ఆయనకూ ఓ క్ారిటీ వచ్చేింది. జిల్లాలో ఆయనకు గౌరవం దక్కడం సంగతి పక్కన పెడితే.. సొంత నియోజకవర్గంలోనే అవమానాలు ఎదురవుతున్నాయి. అసలు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ సీటు ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా వచ్చేసింది. ఇతరుల పేర్లూ తెరపైకి వచ్చాయి. ద్వితీయశ్రేణి నేతలు కూడా ఇప్పుడు అవంతిని పట్టించుకోవడం లేదు.

ఇంటికే పరిమితమవుతున్న అవంతి

గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన అవంతి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. మూడేళ్లపాటు జిల్లాలో ఏకైక మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆ కాలంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పట్టుకోసం ప్రయత్నం చేశారనే వాదన ఉంది. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోయాక.. అవంతికి విశాఖ జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం. కానీ.. వ్యక్తిగత వ్యవహారాల కారణంగా వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. మాజీ మంత్రి ప్లేస్‌లో జిల్లా వైసీపీ పగ్గాలు చేపట్టారు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే అవంతి డ్రీమ్‌ టీమ్‌ను పక్కన పెట్టారు. తన వర్గాన్ని పక్కన పెట్టడం మాజీ మంత్రికి మింగుడు పడలేదు. ఆ తరువాత పార్టీ ఆఫీసు గుమ్మం తొక్కడం తగ్గించేశారు. ఇదే సందు అనుకుని ఆయనను అసలు పిలువడం మానేశారు వైసీపీ నేతలు.

అవమానిస్తున్నారని ఆవేదన

గతంలో అందరితో సఖ్యంగా ఉండే.. అవంతి ఇప్పుడు ముఖ్య నేతలు ఎవరినీ కలవడం లేదంట. జిల్లా నాయకత్వంతో చాలా గ్యాప్‌ పెరిగిపోయిందని చెబుతున్నారు. దీంతో అవంతి ఒంటరయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆ మధ్య వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆడియో టేపులు వైరల్‌ అయ్యాయి. అవి ఎక్కడి నుంచి.. ఎవరి ప్రోద్బలంతో వెలుగులోకి వచ్చాయనే దానికంటే.. ఆయన పొలిటికల్‌ కెరీర్‌కు మచ్చను తెచ్చిపెట్టాయి. ఇటీవల గడప గడపకు వెళ్తే.. తెలుగు దేశం నాయకులు రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి ఎమ్మెల్యేను అవమానించారు.

బీజేపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం !

రాజకీయ భవిష్యత్ వైసీపీలో లేదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. టీడీపీ నేతలు రానిచ్చే అవకాశం లేదు. జనసేనానికి గతంలో చేసిన తీవ్ర వ్యాఖ్యల కారణంగా ఆ పార్టీలో వెళ్లడం కన్నా జాతీయ పార్టీ అయినా బీజేపీలోకి వెళ్లడం మంచిదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఏం జరుగుతుందనేది ఒకటి, రెండు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.