బీజేపీ ప్రజా చార్జిషీట్ – ఏపీలో ఏ వర్గాన్ని సంతృప్తి పరచలేని పాలన !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు చేపట్టిన ప్రజా చార్జిషీట్ల ఉద్యమంలో బయటపడుతున్న ప్రభుత్వ నిర్వాకాలు .. వేలు, లక్షల్లో ఉంటున్నాయి. ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ సంతృప్తి పరిచేలా పాలన చేయలేకపోయిందని.. అన్ని వర్గాల నుంచి బీజేపీ నేతలకు అందిన చార్జిషీట్లతో స్పష్టత వస్తోందని నేతలు చెబుతున్నారు. కర్నూలులో బీజేపీ చేపట్టిన ప్రజా చార్జిషీట్ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి.. చార్జిషీట్లను డీఆర్వోకు ఇచ్చారు. ఒక్క వర్గమూ సంతోషంగా లేదని ఆ చార్జిషీట్ల ద్వారా స్పష్టమయిందంటున్నారు.

నిరుపేద నుంచి నిరుద్యోగి వరకూ అందరివీ బాధలే !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనా వైఫల్యాలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగితే లోతు పాతాళం దాకా ఉన్నట్లుగా ఏపీ బీజేపీ గుర్తించింది. ఏ ఒక్కర్నీ ప్రభుత్వం ప్రశాంతంగా గడపనీయడం లేదు. చివరికి రేషన్ బియ్యం కూడా సక్రమంగా చేరనీయడం లేదు. ఎండీయూ వ్యవస్థ తీసుకు రావడం వల్ల రేషన్ కోసం పడిగాపులు పడాల్సి వస్తోందని.. గతంలో అయితే ఎప్పుడు వీలుంటే అప్పుడు రేషన్ దుకాణానికి వెళ్లి తెచ్చుకునేవారమని ఎక్కువ మంది పేదలు ఫిర్యాదులు చేశారు. దీన్ని చార్జిషీట్ల రూపంలో బీజేపీ దాఖలు చేసింది.

ఉపాధి కూడా కరువు !

కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పనులు తప్ప.. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర ఉపాధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. ప్రభుత్వం అభివృద్ధి పనులపై ఖర్చులు పూర్తిగా ఆపేయడంతో ఎవరికీ ఉపాధి దొరకడం లేదు. అలాగే పరిశ్రమల్ని ఆకర్షించకపోవడం వల్ల యువతకూ ఉద్యోగాలు లభించడం లేదు. ఇతర ప్రాంతాలకు వలస పోలేక.. సొంత ప్రాంతంలో ఉపాధి లేకపోవడం వల్ల ఎంతో యువశక్తి నిర్వీర్యం అవుతోంది. అత్యధిక మందికి ఉపాధి లేకపోవడం వల్ల వ్యాపారాలూ సాగడం లేదు. రోజంతా తిరిగినా గిట్టుబాటు కావడం లేదనే చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. చదువుకున్నా ఉద్యోగం లేదనే యువత ఎక్కువగా చార్జిషీట్లు వేశారు.

అన్ని వర్గాల నిలువుదోపిడీ !

ఇక పన్నుల పేరుతో ప్రజల్ని దోచుకుంటున్న ప్రభుత్వాల్లో వైసీపీమొదటి స్థానంలో ఉంటుందని చార్జిషీట్లలో వెల్లడయింది. దేశంలోనే అత్యధిక, పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలోనే ఉన్నాయి. ఈ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. జీవనం భారం అయిపోయిందని బాధపడే మధ్యతరగతి జీవులు ప్రతి చోటా కనిపించారు. వారంతా దాఖలు చేసిన చార్జిషీట్లలో కన్నీటి చుక్కలే సాక్ష్యాలుగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలకు లెక్కేలేదు.!.

పాలనా వైఫల్యాలకు తోడు అడుగడుగునా వైసీపీ నేతల దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలపై పెద్ద ఎత్తున ప్రజలు చార్జి్షీట్లు దాఖలు చేశారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే చోటా నేతలు చేసిన కబ్జాలు కొన్ని వేల ఎకరాల్లో ఉంటుంది. స్వయంగా మంత్రి గుమ్మనూరు జయరాం వందల ఎకరాలు కబ్జా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు వేసిన చార్జిషీట్లు సవాలక్ష ఉన్నాయి. ప్రజల సమస్యల పోరాటం కోసం బీజేపీ నిరంతరం పోరాటాలు చేస్తుందని సమస్యగా మారిన ప్రభుత్వాన్ని మార్చే వరకూ మా పోరాటం సాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.