సమ్మర్లో స్విమ్మింగ్ – ఇన్ని ప్రయోజనాలా!

మండిపోతున్న ఎండలు, భరించలేనంత ఉక్కపోత..ఎన్నిసార్లు స్నానం చేసినా మళ్లీ ఉక్కపోత తప్పదు. రెగ్యులర్ గా స్విమ్ చేసేవారి మాటకేం కానీ సమ్మర్లో స్విమ్మింగ్ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువ. పైగా పిల్లలకు స్కూల్స్ సెలవులు కావడంతో స్విమ్మింగ్ క్లాసులకు కూడా తీసుకెళుతుంటారు. ఇదో ఆట, స్నానం, ఎండలవేడి నుంచి కాసేపు ఉపశమనం, ఆహ్లాదం అనుకుంటే పొరపాటే. స్విమ్మింగ్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

స్విమ్మింగ్ మంచి వ్యాయామం
కరోనా సమయంలో మొదలైన మరణ భయం ఇప్పటికీ చాలామందిని వెంటాడుతోంది. ఆరోగ్యంగా కనిపిస్తున్నవాళ్లు కూడా ఉన్నపాటుగా కుప్పకూలిపోతున్నారు. ఆ భయంతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.ఫాస్ట్ ఫుడ్స్ పక్కనపెట్టి మొలకలు, గింజలు తింటున్నారు. టీ కాఫీలు తాగడం తగ్గించి గ్రీన్ టీ, హెర్బల్ టీకి ఓటేస్తున్నారు. ఇక వాకింగ్, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారి మెదడు కూడా చాలా చురుకుగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా ఆరోగ్యం, ఫిట్ నెస్ రెండూ సొంతం అవ్వాలంటే స్విమ్మింగ్ దే ఫస్ట్ ప్లేస్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది ఫన్ తో కూడిన వర్కౌట్.. సమ్మర్లో చురుగ్గా ఉండేందుకు కూల్ వర్కౌట్ అని కూడా చెప్పుకోవచ్చు. కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఇది మంచి ఎక్సరసైజ్.

స్విమ్మింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు
చికాకు, అలసట తెలియని వ్యాయామం స్విమ్మింగ్
శరీరంలోని ప్రతి కండరానికి పని కల్పించే వ్యాయామం. చేతులు, భుజాలు, వీపు కండరాలు, కాళ్ళు..ఇలా శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది
స్విమ్మింగ్ చేసేవారికి లంగ్ కెపాసిటి మెరుగవుతుంది
ఈత వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది
స్ట్రోక్, గుండె సమస్యలను స్విమ్మింగ్ నివారిస్తుంది
అందమైన శరీరాకృతి సొంతమవుతుంది..తొందరగా బరువు తగ్గించేందుకు స్విమ్మింగ్ మంచి వ్యాయామం
రన్నింగ్, జాగింగ్ తో పోలిస్తే మెరుగైన కార్డియో వ్యాయామం స్విమ్మింగ్..ఈత కొట్టే వేగాన్ని బట్టి మీ క్యాలరీలు కరుగుతాయి
వ్యాయామం మాత్రమే కాదు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా..ఈత కొడుతూ గేమ్స్ ఆడేది కూడా ఇందుకే

సమ్మర్లో స్విమ్మింగ్ ఎందుకు మంచిది
సమ్మర్లో ఇతర వ్యాయామాలు చేస్తే తొందరగా అలసిపోతారు..ఒంట్లోంచి నీరంతా పోయి డీహైడ్రేట్ అయిపోతారు. ఎన్ని పానీయాలు తీసుకున్నా నీరసంగా అనిపిస్తుంటుంది. అందుకే సమ్మర్లో ఈతకొట్టడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవదు. ఆరోగ్యానానికి ఆరోగ్యం, ఉల్లాసం, మానసిక ప్రశాంతతతో పాటూ చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. చల్లగా హాయిగా స్విమ్మింగ్ చేసి వచ్చి ఫాస్ట ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకండి.. అప్పుడు కూడా ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి బొండాం, మజ్జిక లాంటివి తీసుకుంటే శరీరానికి అదనపు శక్తి అందుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే మీరు వీటిని అనుసరించడం మంచిది.