పొన్నూరు లేదా రేపల్లె నుంచి అంబటి రాయుడు పోటీ ?

క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తాడేపల్లిలో సీఎం జగన్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఇటీవలి కాలంలో సీఎం జగన్ ను ప్రశంసిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందని కొన్ని మీడియా సంస్థలకు చెప్పారు. అలాగే క్రికెట్ అకాడెమీ కూడా పెట్టాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీ చర్చనీయాంశమవుతోంది.

రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న రాయుడు

గుంటూరులో పుట్టిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలని చాన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నానని కొందరిని కలిసిన తర్వాత తుది నిర్ణయం చెబుతానంటున్నారు. ఏ పార్టీలో చేరాలన్నది కూడా అప్పుడే తెలుస్తుంది’ అని రాయుడు చెప్పాడు. హైదరాబాద్‌‌‌‌లో క్రికెటర్‌‌‌‌ కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసినప్పటికీ తెలంగాణలో కాకుండా ఏపీలోనే పొలిటికల్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ పార్టీ అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ నుంచి అంబటిరాయుడు ఆఫర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏపీ ప్రెసిడెంట్​ తోట చంద్రశేఖర్‌‌‌‌.. బీఆర్ఎస్‌లో చేరి గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. అయితే అంబటి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ ను కలిసినందున వైసీపీలో చేరుతారని భావిస్తున్నారు.

పొన్నూరు, రేపల్లె స్థానాల్లో ఒకటి కేటాయించే అవకాశం

గుంటూరులో బలమైన కాపు అభ్యర్థి కోసం వైసీపీ చూస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు.. పొన్నూరు లేదా రేపల్లెలో బలమైన అభ్యర్థి అవుతారని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పొన్నూరులో ప్రస్తుతం కిలారి రోశయ్య ఉన్నారు. ఆయనపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. రేపల్లెలో కీలక నేతగా ఉన్న మోపిదేవి ఎంపీగా ఉన్నారు. అక్కడ అభ్యర్థి అవసరం. అక్కడ అంబటి రాయుడు పేరును పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

క్రికెట్ అకాడెమీ పెట్టే ఆలోచన !

వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారో లేదో అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే అంబటి రాయుడు వయుసు 37 ఏళ్లు. ఆయన ఇంకా ఎక్కువ కాలం క్రికెట్ కెరీర్ సాగించడం సాధ్యం కాదు. ఈ ఏడాది ఆయన ఐపీఎల్ ఇన్నింగ్స్ గొప్పగా సాగడం లేదు. వచ్చే సారి టీంలో ఉంచుతారో లేదో కూడాతెలియదు. అందుకే క్రికెట్ అకాడెమీ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నారని చెబుతున్నారు. దానికి భూమి అడిగేందుకు జగన్ ను కలిశారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే సీఎం జగన్ తో భేటీపై .. అటు అంబటి రాయుడు కానీ ఇటు సీఎంవో కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రకటన చేసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.