ఏపీలో మార్పు బీజేపీతోనే సాధ్యం – పవన్ చెప్పింది ఇదే !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో రాజకీయాలపై స్పష్టత ఇచ్చారు. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ బీజేపీతో సాధ్యమని పరోక్షంగా తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్..బీజేపీతో అధికారిక పొత్తులో ఉన్నారు. ఏపీలో జనసేన, బీజేపీ మిత్రపక్షాలు. సాంకేతికంగా రెండు పార్టీలు పొత్తులో ఉన్న పార్టీలు. ఇప్పుడు కలుపుకోవాల్సింది టీడీపీనే. టీడీపీని కలుపుకుందామని ఆయన ఢిల్లీలో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. పొత్తులనేవి బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆ పార్టీ నేతలంటున్నారు.

2014 కూటమి కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2014లో పార్టీ పెట్టారు. అయితే పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేయడం కన్నా ఎన్డీఏలో చేరి.. మద్దతు ఇవ్వడం మంచిదనుకున్నారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా తీసుకోలేదు. ఎన్డీఏ గెలిచింది. కేంద్రంలో , రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. కేంద్రంలో టీడీపీ నేతలు మంత్రి పదవులు తీసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు తీసుకున్నారు. కానీ జనసేన పార్టీ మాత్రం పదవులకు దూరంగా ఉంది. ఎమ్మెల్యే , గవర్నర్ కోటా వంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజ్యసభ వంటి సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇచ్చినప్పటికీ జనసేనాని పదవులు తీసుకోవడానికి నిరాకరించారు. 2019 ఎన్నికల్లో తన బలం ఎంతో తేల్చకోవాలని ఆయన బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు వైసీపీని ఓడించడానికి మరోసారి 2014 కూటమి రావాలని కోరుకుంటున్నారు.

అడగకుండానే బీజేపీపై ప్రేమ చూపుతున్న చంద్రబాబు

ఓ వైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి టీడీపీతో కలిసి పని చేయాలనే సంకేతాలు ఇవ్వడం.. మరో వైపు చంద్రబాబు కూడా రిపబ్లిక్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ..మోదీకి పూర్తి మద్దతు ప్రకటించడంతో రెండు వైపులా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా క్లారిటీ వచ్చినట్లయింది. ఎన్డీఏలో చేరుతామా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. నిజానికి చంద్రబాబు ఎన్డీఏలో చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు ఢిల్లీలో చంద్రబాబు మోదీని కలిశారు. అమిత్ షాను నారా లోకేష్ ఓ సారి రహస్యంగా కలిశారన్న ప్రచారమూ జరిగింది. ఇప్పుడు పవన్ ప్రకటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

కేంద్ర రాజకయాలతో ఏపీ రాజకీయలకు లింక్ !

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పొత్తులు పెట్టుకోవాలంటే కేంద్ర రాజకీయాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏపీ బీజేపీ పొత్తులపై హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం.. ఒంటరిగా వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. అలా అయితేనే బలపడతామని లేకపోతే ప్రాంతీయ పార్టీల వ్యూహాల్లో నలిగిపోతామని అంటున్నారు. వారి అభిప్రాయం వారు బీజేపీ హైకమాండ్‌కు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తంగా పొత్తులు ఉంటాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. బీజేపీ కూటమిలో లేకపోతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధ్యం కాదన్న ఓ నమ్మకాన్ని పవన్ గట్టిగా చెబుతున్నారు. నిజం కూడా అదేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏపీ పొత్తుల రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.