కేసీఆర్ మోసం చేశారని భోరుమంటున్న కుమారస్వామి !

కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్ ముగిసీ ముగియక ముందే జేడీఎస్ నేత కుమారస్వామి ఓ కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే.. తమకు డబ్బులు లేకపోవడం వల్ల కనీసం పాతిక సీట్లలో గెలవలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల్లో డబ్బుల ప్రస్తావన కుమారస్వామి ఎందుకు తెచ్చారో చాలా మందికి అర్థం కాలేదు.. కానీ అసలు విషయం మాత్రం కేసీఆర్ కు సందేశం పంపడమేనని.. ఎన్నికలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి చేయకపోవడమేనని కర్ణాటకలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

డబ్బులు లేకపోవడం వల్లే గెలవలేకపోతున్నామని కుమారస్వామి అసంతృప్తి

భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ ఇతర పార్టీలను దగ్గరకు తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కలిసి పని చేద్దామని ఆర్థిక సాయం చేస్తామని ఆశ పెట్టడంతో కుమారస్వామి కేసీఆర్ ఎన్ని సార్లు పిలిచినా హైదరాబాద్ వచ్చారు. ఆయన కుమారుడ్ని కూడా తీసుకు వచ్చారు. అయితే ఆర్థిక సాయం చేయాలంటే.. తమ పార్టీకి అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో కుమారస్వామి ఆలోచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఇస్తామని ప్రతిపాదించారు. కానీ అసెంబ్లీలో సీట్లకావాల్సిదేనని కేసీఆర్ పట్టుబట్టడంతో కుమారస్వామి సమాధానమివ్వలేదని అంటున్నారు.

ఆర్థిక పరిస్థితులపై బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి ?

అయితే పొత్తులు లేకపోయినా కేసీఆర్ తనకు పెద్దన్న లాంటి వారేనని కుమారస్వామి తరచూ చెబుతూ వస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఆయనపై దయతల్చలేదని ఎన్నికలకు ఆర్థిక సాయం పంపకపోవడంతోనే తేలిపోయిందని చెబుతున్నారు. చివరి క్షణంలో అయినా సాయం వస్తుందేమోనని.. కుమారస్వామి ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ ప్రయోజనం లేకపోయే సరికి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

కేసీఆర్ హ్యాండిచ్చారని ఫీలవుతున్నారా ?

కేసీఆర్ విపక్ష పార్టీలన్నింటికీ ..తన నాయకత్వం అంగీకరిస్తేనే ఆర్థిక సాయం చేస్తాననే ప్రతిపాదన పెట్టారని చెప్పుకున్నారు.అయితే ఆయన నాయకత్వాన్ని కుమారస్వామి కూడా అంగీకరించలేదు. మరో వైపు కేసీఆర్ నిర్మించిన ఆర్థిక సామ్రాజ్యంపై కేంద్రం కన్నేసిందని..దర్యాప్తు సంస్థలన్నీ నిఘా పెట్టాయని.. ఈ కారణంగానే జేడీఎస్ కు నిధులు సర్దుబాటు చేయలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కారణం ఏదైనా అసలు కేసీఆర్ కర్ణాటక వైపు కన్నెత్తి చూడలేదు. ఆక్కడ ఫలితాల్ని మార్చేందుకు ఆర్థిక పరమైన సాయాలూ చేయలేదంటున్నారు.