మహారాష్ట్ర విపక్షాల ఐక్యత ఎండమావేనా.. ?
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపక అధినేత శరద్ పవార్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. పార్టీలోనూ, బయట ఆయన సమస్యలతో శతమతమవుతున్నారు. ఎన్సీపీలో నెలకొన్న అంతర్గత సమస్యలతో పొత్తు భాగస్వాములు ఆ పార్టీ వైపు అనుమానంగా చూస్తున్నారు. పైగా ఏమిటీ గోల అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. ప్రతి విమర్శలతో ఇప్పుడు ఫ్రీ ఫర్ ఆల్ అనే పరిస్థితి ఎదురవుతోంది..
ఎంవీఏలో తలో మాట
ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక పుట్టిన తర్వాత బీజేపీ నుంచి దూరం జరిగి కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపారు. సీఎం అయ్యారు. ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేకపోయారు. అప్పుడు ఏర్పాటైన మహా వికాస్ అగాఢీ (ఎంవీఏ) విపక్షంలో కూడా కొనసాగుతోంది. కాకపోతే ముసుగులో గుద్దులాట ఉండేది.. ఇప్పుడు బహిరంగంగానే తిట్టుకుంటున్నారు.
రౌత్ వర్సెస్ పవార్
శివసేన ఎంపీ, సామ్నా పత్రిక సంపాదకుడు సంజయ్ రౌత్ కి కాస్త నోరు ఎక్కువే. మరాఠీలో మంచి రాతగాడే అయినా ఎప్పుడు, ఎక్కడ, ఏమి మాట్లాడాలో ఆయనకు తెలీదంటారు. గురువిందకు కింద నలుపు తెలియదన్నట్లుగా తమ పార్టీలో ఎన్ని విభేదాలున్నా వాటిని పట్టించుకోకుండా ఇతరులకు సలహాలిస్తుంటారు. ఆ క్రమంలోనే శరద్ పవార్ కే ఏదో సూక్తులు చెప్పబోయారు. పవార్ తన వారసులను సిద్ధం చేయడంతో విఫలమయ్యారని, పార్టీలో తిరుగుబాటును అతి కష్టం మీద ఆపుకున్నారని రౌత్ విశ్లేషించారు..
శివసేన ఎంపీ వ్యాఖ్యలపై పవార్ కు బాగానే చిర్రెత్తుకొచ్చింది. “మా పార్టీలో ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నామో… వాళ్లకేం తెలుసు. మేము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మా అంతర్గత వ్యవహారం అవుతుంది.. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు, నా పార్టీ సహచరులకు బాగానే తెలుసు…” అని పవార్ గట్టిగా కౌంటరిచ్చారు. ఎన్సీపీ మరో నేత ఛగన్ భుజ్ బల్ కూడా సంజయ్ రౌత్ కు గట్టి కౌంటరే ఇచ్చారు. ” ఆయనకు మా వ్యవహారాల్లో మాట్లాడే హక్కు లేదు. అంటే ఎంవీఏ నుంచి ఎన్సీపీ బయటకు రావాలని ఆయన కోరకుంటున్నారా..” అని భుజ్ బల్ ప్రశ్నించారు. మీ పార్టీ రెండుగా చీలి షిండే ముఖ్యమంత్రి అవుతుంటే నువ్వేమి చేస్తున్నావన్న ప్రశ్న అందులో కొట్టొచ్చినట్లు కనిపించింది…
పృధ్వీరాజ్ చవాన్ కూ క్లాస్…
కొందరు నేతలు గాలికి పెరిగినా వాళ్లు చాలా తెలివిగలవారు, గొప్పవారు అని అనుకుంటుంటారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ కూడా అంతే. ఎన్సీపీ కూడా తమ పొత్తు భాగస్వామి అన్న సంగతి మరిచిపోయి.. మహారాష్ట్రలో ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని ఆయన అనేశారు. ఇంకేముంది పవార్ ఆయనకు గట్టిగానే ఇచ్చేశారు. ” సొంత పార్టీలో ఆయనకున్న సీన్ ఏమిటి చవాన్ తెలుసుకోవాలి. ఆయన పొజిషన్ ‘ఏ’ నా, ‘బీ’ నా, ‘సీ’ నా , ‘డీ’ నా అన్నది నిర్ణయించుకోవాలి .. ” అని పవార్ గట్టి కౌంటరిచ్చారు. మరో పక్క ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో కూడా చవాన్ పై విమర్శలు సంధించారు. చవాన్ బీజేపీ ఏజెంటులా పనిచేస్తున్నారని , అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను పట్టించుకోవడం మానేసిందని విశ్లేషించారు..
పొత్తుపై అనుమానాలు…
నిజానికి ఇప్పుడు ఎంవీఏలో సీట్ల సర్దుబాటు చర్చలు జరగాలి. నేతల మధ్య మాటల తూటాల కారణంగా అది కార్యరూపం దాల్చడం లేదు. పొత్తును సజీవంగా ఉంచేందుకు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పాటోలే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయినా భాగస్వాములు కలిసి రావడం లేదు…