రంగులు మార్చే రంగాగా పేరున్న బిహార్ సీఎం నితీష్ కుమార్.. ఎక్కిన విమానం ఎక్కడుండా తెగ తిరిగేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తన విధులను పక్కన పెట్టి… విపక్షాల ఐక్యత పేరుతో నగరాలు చుట్టేస్తున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టడమే తన ధ్యేయంగా ఆయన చెప్పుకుంటున్నారు. ఎవరెవరినో కలుపుకుపోవాలనుకుంటున్నారు. ఐనా ఆయన కోరిక నెరవేరే అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి..
నాలుగు మంచి మాటలు.. ఓ కప్పు కాఫీ..
నితీష్ వెళ్లి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలిశారు.ఇద్దరు సీనియర్ నేతలు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలీయదు. పొత్తుల చర్చలు ప్రస్తావనకు రాలేదని మీడియా ఎదుట పట్నాయక్ కుండబద్దలు కొట్టారు. దానితో తెల్లమొహం వేసిన నితీష్.. అవునవును అంటూ ఏవో కథలు చెప్పారు. నాలుగు మంచి మాటలు, ఓ కప్పు కాఫీ కోసం పట్నా నుంచి భువనేశ్వర్ వెళ్లాలా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నితీష్ ప్రతిపాదనను పట్నాయక్ తిరస్కరించారని చెబుతున్నారు. దేశాన్ని ప్రజారంజకంగా పాలించే మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాల్సిన అవసరమేమున్నదని పట్నాయక్ నిలదీశారట. అత్యంత ప్రజాదరణ ఉన్న మోదీకి వ్యతిరేకంగా కూటమి కడితే ఒరిగేదేమీ ఉండదని, నవ్వులపాలు కావడమేనని నితీష్ కు నవీన్ హితబోధ చేశారట. ఏదో వచ్చావు కాబట్టి మాట్లాడేసిపో అన్నట్లుగా ఉందట నవీన్ తీరు..
ఉద్ధవ్ కూడా అంతేనా…
నవీన్ అడ్డం కొట్టినా నితీశ్ తీరు మారలేదు. కాలికి బలపం కట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. తాజాగా గురువారం ఆయన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అవుతున్నారు. దేశ రాజకీయాలపై తనకు ఆసక్తే లేదని, మహారాష్ట్రే ముఖ్యమని ఉద్ధవ్ చాలా సార్లు చెప్పారు. అయినా నితీశ్ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లి ఉద్ధవ్ ను కలిసినప్పుడు నాకు ఇంట్రస్ట్ లేదు… అన్నట్లుగా మహా మాజీ సీఎం వ్యవహరించారు. ఇప్పుడు కూడా అంతే కావచ్చు. ఆ సంగతి కొంతమేర అర్థం చేసుకున్న నితీష్ ఇప్పుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ను కూడా వెంటబెట్టుకు వెళ్తున్నారు. తేజస్వీ ఒక విశ్వసనీయత లేని నాయకుడనే సంగతి నితీష్ మరిచిపోయినట్లున్నారు. దేశంలో ఎక్కువ అవినీతి కేసులున్న కుటుంబం తేజస్వీది. అయినా ఏదో బావుకుందామన్న కోరిక నితీష్ లో కనిపిస్తోంది..
మమత, మాయ దూరం..
నితీష్ తో మనస్ఫూర్తిగా చేతులు కలిపే నేతలు కనిపిచడం లేదు. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో మాయావతి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆమెకు పట్టుమని పది మంది ఎంపీలు కూడా లేకపోవడంతో నిర్ణయాత్మక శక్తి కాలేనని ఆమె గుర్తించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కొన్ని రోజుల క్రితం జాతీయ ఆకాంక్షలుండేవి. ప్రస్తుతం ఆమె బెంగాల్ దాటి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అలాంటి నేతలందరినీ కలుపుకుని మోదీపై కత్తి కట్టేందుకు నితీష్ తెగ కష్టపడిపోతున్నారు. ఆయన తీరు చూసి దేశమే నవ్వుకుంటోంది..