బీఆర్ఎస్ ఏపీ ఎంట్రీపై కృష్ణా నీళ్లు – ఇక ఎలా అడుగుపెడతారు ?

తెలంగాణ ను దాటి బయటకు రావాలనుకుంటున్న బీఆర్ఎస్ ఇంకా… పక్క రాష్ట్రాలతో రాజకీయంపై ఓ క్లారిటీకి రాలేకపోతోంది. ముఖ్యంగా ఆంధ్రులపై వ్యతిరేకతే ఎజెండాగా ఉద్యమం చేసిన కేసీఆర్ ఆ నైజాన్ని మార్చుకోలేకపోతున్నరు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా ఏపీ ప్రజలతో వ్యవహరిస్తున్నారు. తాజాగా కృష్ణా జలాల విషయంలో అదే జరిగింది. గతంలో ఒప్పుకున్న న్యాయమైన కృష్ణా జలాల వాటానే మళ్లీ వివాదంలోకి నెట్టి.. ఏపీ ప్రజల గొంతు కోసే ప్రయత్నం చేస్తోంది. ఇది రాజకీయంగా వివాదమవుతోంది. ఏపీ బీఆర్ఎస్ నేతలను ఒత్తిడికి గురి చేస్తోంది.

ఏపీ కృష్ణా జలాలలను వివాదంలోకి తెస్తున్న బీఆర్ఎస్

ఏపీ ప్రయోజనాల గురించి ఇటీవల బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. పోలవరం మేమే పూర్తి చేస్తామని మల్లారెడ్డి లాంటి మంత్రి కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా కేటీఆర్ ప్రకటనలు చేశారు. అయితే అసలు ఏపీ కోసం మాట్లాడాల్సిన సమయంలో చోట మాత్రం రాజకీయం తిరగబడింది. కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నీటిని కూడా తమకే కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా డి్మాండ్ చేస్తూ పంచాయతీని కేంద్రం ముందు పెట్టింది. ఇది ఇప్పుడు ఏపీలో విస్తృత చర్చకు కారణం అవుతోంది.
ఏపీకి న్యాయంగా కేటాయించిన నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

కేసీఆర్ అంగీకారంతోనే నీటి పంపకాలు

రెండు రాష్ట్రాల మధ్యన 2015 – 16లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం కృష్ణానదీజలాల వినియోగంలో ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన 66:34 నిస్పత్తిలో నీటికేటాయింపులు కుదుర్చుకున్నాయి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే ఉంది. బచావత్ చేసిన 811టీఎంసీల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 299టిఎంసీలు, ఏపికి 512టింసీలు వినియోగించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందమే ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోంది.దీనికి కేసీఆర్ కూడా అంగీకరించారు. మరి వివాదం ఎక్కడ ఉంది. అంతా కేసీఆర్ రాజకీయంలోనే ఉంది. ఓ వైపు ఏపీ ప్రయోజనాల కోసం పని చేస్తామని చెబుతూనే మరో వైపు గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీ బీఆర్ఎస్ నేతలు స్పందించాలన్న విష్ణువర్ధన్ రెడ్డి

బేసిన్లు లేవు..భేషజాలు లేవని విజయవాడలో చెప్పిన డైలాగ్ మర్చిపోయారా అని కేసీఆర్ ను ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. దిగువ రాష్ట్రానికి ఉండే హక్కుల గురించి తెలిసి కూడా ఈ లొల్లి ఎందుకు పెడుతున్నారని ప్ర్నించారు. ఓ వైపు ఏపీ హక్కుల కోసం అంటూ రాజకీయం చేయడం.. మరో వైపు ఏపీ ప్రజల గొంతు కోయడమే మీ రాజకీయమా ? దీనిపై ఏపీ బీఆర్ఎస్ నేతలు తక్షణం స్పందించాలి… లేకపోతే వారు ఏపీ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.